Aug 16,2023 11:45

సిమ్లా / డెహ్రాడూన్  :   హిమాచల్‌ ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌లలో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. హిమాచల్‌ ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌లలో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. కుంభవృష్టి, కొండచరియలు విరిగిపడటంతో ఇప్పటివరకు 60 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. సిమ్లాలోని సమ్మర్‌ హిల్స్‌ ప్రాంతంలో బుధవారం కూడా కొండచరియలు విరిగిపడ్డాయి. ఇప్పటికే 21 మృతదేహాలను వెలికి తీసినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. రానున్న రెండు రోజుల్లో హిమాచల్‌ ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌లలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండి) వెల్లడించింది.

ఇప్పటికే వరదలు ముంచెత్తడంతో కాంగ్రాలోని పాంగ్‌ డ్యామ్‌ సమీపంలోని లోతట్టు ప్రాంతాల నుండి సుమారు 800మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల ధాటికి డ్యామ్‌లో నీటి మట్టం పెరుగుతోందని అధికారులు తెలిపారు. దీంతో ముందుజాగ్రత్త చర్యగా ప్రజలను తరలిస్తున్నామని అన్నారు. ఈ ఆపరేషన్‌ కొనసాగుతోందని అన్నారు. బుధవారం కూడా విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. రాష్ట్రంలో వర్షాలపై ముఖ్యమంత్రి సుఖ్వీందర్‌ సింగ్‌ మాట్లాడుతూ గత మూడు రోజుల్లో సాధారణ వర్షపాతం కన్నా 157 శాతం అధికంగా వానలు కురిశాయన్నారు. రాష్ట్రంలో మొత్తం 1200 రహదారులు దెబ్బతినగా.. వాటిల్లో 400 రోడ్లను పునరుద్ధరించామన్నారు. ఈ సారి రాష్ట్రంలో మొత్తం 170 కుంభవృష్టి, కొండచరియలు విరిగిపడిన ఘటనలు నమోదయ్యాయి. దాదాపు 9,600 ఇళ్లు దెబ్బతిన్నాయి. ముఖ్యంగా సిమ్లా, సోలన్‌, మండీ, హమీర్‌పుర్‌, కాంగ్రా జిల్లాల్లో నష్టం అధికంగా ఉంది.

ఉత్తరాఖండ్‌లో కుప్పకూలిన భవనం
ఉత్తరాఖండ్‌లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి.   చమోలీ జిల్లా జోషిమఠ్‌ సమీపంలోని హెలాంగ్‌లో మంగళవారం సాయంత్రం ఓ భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో ఒకరు మరణించగా, మరో ఐదుగురిని శిథిలాల నుండి బయటకు తీసినట్లు రాష్ట్రవిపత్తు ప్రతిస్పందన దళం (ఆర్‌ఎస్‌ఎఫ్‌) తెలిపింది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. రుద్రప్రయాగ్‌లోని బంటోలిలో కాలినడక వంతెన కూలిపోవడంతో రుద్రప్రయాగ్‌కు వెళుతున్న సుమారు 200 మంది పర్యాటకులు చిక్కుకుపోయారని అధికారులు తెలిపారు.