Jan 20,2023 22:19

వాషింగ్టన్‌  :   గూగుల్‌   పేరెంట్‌   కంపెనీ  ఆల్ఫాబెట్‌ ప్రపంచ వ్యాప్తంగా 12,000 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ఆ కంపెనీ చీఫ్‌ ఎగ్జిక్యూటీవ్‌ శుక్రవారం తెలిపారు. మైక్రోసాఫ్ట్‌ సంస్థ 10,000 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించిన మరుసటి రోజే గూగుల్‌ 12,000 మందిని తొలగిస్తున్నట్లు ప్రకటించడం గమనార్హం. ఈ తొలగింపు మొత్తం గూగుల్‌ వర్క్‌ ఫోర్స్‌లో 6 శాతమని, ఈ ఉద్యోగాల తొలగింపు కంపెనీపై ప్రభావం చూపుతుందని. సిఇఒ సుందర్‌ పిచాయ్  వెల్లడించారు. ఈ నిర్ణయాలకు పూర్తిగా బాధ్యత వహిస్తానని తెలిపారు.
ఈ తొలగింపులు రిక్రూటింగ్‌, కొన్ని కార్పొరేట్‌ విధులు, ఇంజనీరింగ్‌ అండ్‌ ప్రొడక్ట్స్‌ సహా కంపెనీలోని వివిధ విభాగాలపై ప్రభావం పడనుందని అన్నారు.  ప్రపంచవ్యాప్తంగా తొలగింపులు ఉన్నప్పటికీ ముందుగా అమెరికాలోని ఉద్యోగులు ప్రభావితం కానున్నారని చెప్పారు.   ముందు ఉన్న గొప్ప అవకాశాలు, మా ప్రోడక్ట్స్‌, సర్వీస్‌ పై, మా మిషన్‌ పై, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఎఐ)  లో పెట్టుబడులపై పూర్తి నమ్మకంతో ఉన్నానని.. సుందర్‌ పిచాయ్  ఓ నోట్‌లో తెలిపారు.

ట్విటర్‌ 3700 మంది ఉద్యోగులను తొలగించగా, అమెజాన్‌ 18,000 మంది ఉద్యోగులపై వేటు వేసింది. మైక్రోసాఫ్ట్‌ 10,000 మంది ఉద్యోగులను, మెటా 11,000 మందిని తొలగించింది. ప్రపంచవ్యాప్తంగా ఆర్థికమాంద్యం పరిస్థితులు నెలకొనడంతో టెక్‌ కంపెనీలు ఖర్చులను తగ్గించుకోవడంలో భాగంగా ఉద్యోగులను తొలగిస్తున్నాయి. దీంతో రానున్న కాలంలో ఐటి పరిశ్రమ ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కోనున్నట్లు నిపుణులు హెచ్చరిస్తున్నారు.