Nov 06,2020 07:19

        దేశ ఆర్థిక వ్యవస్థ క్రమంగా కోలుకుంటోందనీ, జిఎస్‌టి వసూళ్లు పెరిగినట్టు, బ్యాంకుల నుండి రుణాలు తీసుకోవడం పెరుగుతోందనీ....పాలకులు చెబుతున్న గొప్పలు వాస్తవ పరిస్థితికి ప్రతిబింబం కాదు. పాలకులు అర్ధ సత్యాలు మాట్లాడితే అదే నిజమని నమ్మి సామాన్య ప్రజలతోపాటు బుద్ధిజీవులు కూడా మోసపోయే ప్రమాదముంది. కరోనా మహమ్మారి విరుచుకు పడక ముందు నుండే దేశ ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో వుంది. కరోనా, లాక్‌డౌన్‌తో అది మరింత తీవ్రతరమైంది. కరోనా ఎప్పుడు అదుపు లోకి వస్తుందో చెప్పగలిగిన పరిస్థితి లేదు. ఇటు ఉపాధి హామీ మొదలు అటు విదేశాలకు ఎగుమతుల వరకూ సర్వత్రా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ వాస్తవ పరిస్థితిని పాలకులు గుర్తించి, దాన్ని చక్కదిద్దడానికి అవసరమైన చర్యలు చేపట్టడం అవసరం. అది మాని అర్ధ సత్యాలు, అవాస్తవాలు చెప్పడం ప్రజలను మోసగించడమే.
         కరోనా సంక్షోభం, లాక్‌డౌన్‌తో పని కోల్పోయిన కోట్లాది మంది గ్రామీణ ఉపాధి హామీ పథకంపై ఆధార పడాల్సి వచ్చింది. దాంతో ఈ ఏడాది మే, జూన్‌ మాసాల్లో భారీ డిమాండ్‌ నెలకొంది. అయితే వారందరికీ ఉపాధి కల్పించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని సర్కారు వారి గణాంకాలే తేటతెల్లం చేస్తున్నాయి. ఏప్రిల్‌- సెప్టెంబర్‌ మధ్య 2.43 కోట్ల మంది ఉపాధి పనులు కోరగా కేవలం 1.63 కోట్ల మందికి మాత్రమే ఉపాధి దొరికింది. అంటే ఉపాధి కోరిన వారిలో 80 శాతం మందికి మాత్రమే అవకాశం కల్పించారు. ఉపాధి హామీ వెబ్‌సైట్‌ ప్రకారం..గడిచిన అక్టోబర్‌లో 2.43 కోట్ల కుటుంబాలు ఉపాధి హామీ కోసం దరఖాస్తు చేసుకున్నాయి. గతేడాది ఇదే నెల ఉపాధి పొందిన వారితో పోల్చితే 88.37 శాతం, 2018 అక్టోబర్‌తో పోల్చితే 52.5 శాతం ఎక్కువ. సాధారణంగా ఆగస్టు నుంచి అక్టోబర్‌ పంటల సీజన్‌ కావడంతో వ్యవసాయ పనులు ఎక్కువ. కూలీలకు గిరాకీ ఉంటుంది. కానీ ఈ ఏడాది ఆ సమయంలో కూడా ఉపాధి హామీపై అత్యధిక ప్రజానీకం ఆధారపడటం ఆందోళన కలిగించే అంశం.
        కరోనా వైరస్‌ తీవ్రత తగ్గడమో లేక దానికి జనం అలవాటు పడిపోవడం వల్లనో ప్రజల కదలిక పెరిగింది. ఆర్థిక కార్యకలాపాలు కొద్దిగా పెరిగిన మాట వాస్తవం. అయితే మొత్తం ఆర్థిక వ్యవస్థే అభివృద్ధి అయిపోతోందని కాదు. ఇటీవల బ్యాంకుల నుండి రుణం తీసుకున్న వారి సంఖ్య, వారు పొందే మొత్తమూ పెరిగింది. సెప్టెంబర్‌ నెలలో బ్యాంకుల రిటైల్‌ రుణ వితరణ 9.2 శాతానికి ఎగబాకింది. అయితే, గత ఏడాది ఇదే నెలనాటి 17 శాతంతో పోల్చితే అది సుమారు సగం. అదే సమయంలో ఈ ఏడాది కార్పొరేట్లకు రుణ మంజూరు తగ్గడం పట్ల బ్యాంకర్లు ఆందోళనగా ఉన్నారు. కాగా భారత ఎగుమతులు ఈ ఏడాది వరుసగా ఆరు నెలలుగా పడిపోతూ.. సెప్టెంబర్‌లో కొంత పుంజుకున్నాయని భావించినంతలోనే తాజాగా అక్టోబర్‌లో 5.4 శాతం తగ్గిపోయింది. పెట్రోలియం ఉత్పత్తులు, రత్నాలు, ఆభరణాలు, తోలు రంగాల ఉత్పత్తులకు ప్రపంచ మార్కెట్‌లో డిమాండ్‌ తగ్గడంతో ఎగుమతుల్లో క్షీణత చోటు చేసుకున్నట్లు వాణిజ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌ నుంచి అక్టోబర్‌ కాలంలో దేశ ఎగుమతులు 19.05 శాతం పతనమయ్యాయి. వాణిజ్య లోటు 8.78 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యింది. ఇలా...ఏ రంగం వైపు చూసినా 'ఏమున్నది గర్వ కారణం' అన్నట్టుంది.
         ఐఎంఎఫ్‌, ప్రపంచ బ్యాంకుతో సహా అనేక రేటింగ్‌ సంస్థలు ఇటీవల రిజర్వ్‌ బాంకు కూడా భారత స్థూల జాతీయోత్పత్తి మైనస్‌ పది శాతాన్ని దాటిపోతుందని ఘంటాపథంగా చెప్పాయి. ఐనా వచ్చే సంవత్సరం మాత్రం భారత్‌ అతి వేగంగా అభివృద్ధి చెందుతుందని కేంద్ర ఆర్థిక మంత్రి చెప్పడం ఎవరిని మభ్యపెట్టడానికి? కరోనా, లాక్‌డౌన్‌తో ఉపాధి కోల్పోయి ఇక్కట్ల పాలవుతున్న దేశ ప్రజలకు చేతి నిండా పని కల్పించడం, వారి వద్దకు డబ్బు చేర్చడం ప్రభుత్వ బాధ్యత. తద్వారా మాత్రమే వస్తూత్పత్తి పెరగడంతోపాటు వినియోగమూ అధికమవుతుంది. సంక్షోభంలో కూరుకున్న ఆర్థిక వ్యవస్థ కొంతయినా పుంజుకుంటుంది. సర్కారు పెద్దలు గొప్పలు చెప్పడం మాని ఈ బాటకు రావాలి.