Apr 03,2023 10:45

ఐపిఎల్‌ సీజన్‌ తొలి మ్యాచ్‌లోనే ముంబయిపై అద్భుతమైన ఇన్నింగ్స్‌తో విరాట్‌ కోహ్లీ రాణించాడు. అర్ధశతకం సాధించి మరీ తన జట్టు ఆర్‌సిబిని విజయతీరాలకు చేర్చాడు. మొత్తం ఆరు ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 82 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. దీంతో ఓ ఆరుదైన రికార్డును కోహ్లీ తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపిఎల్‌ చరిత్రలో 50 సార్లు 50ప్లస్‌ స్కోరు సాధించిన తొలి భారతీయ క్రికెటర్‌గా సంచలన రికార్డును కోహ్లీ సృష్టించాడు.

                                                           49 బంతుల్లో 82 పరుగులు చేసిన కోహ్లీ

ఢిల్లీ క్యాపిటల్స్‌ ఓపెనర్‌ వార్నర్‌ 60సార్లు 50ప్లస్‌ చేసి అగ్రస్థానంలో ఉండగా.. పంజాబ్‌కింగ్స్‌ కెప్టెన్‌ శిఖర్‌ధావన్‌ 49 సార్లు 50ప్లస్‌ చేసి మూడో స్థానంలో ఉన్నాడు. కోహ్లీ ఐపిఎల్‌లో 45 అర్ధసెంచరీలు, 5 సెంచరీలను బాదాడు. నిన్న జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ, డుప్లెసిస్‌ 148 పరుగుల ఓపెనింగ్‌ భాగస్వామ్యాన్ని నెలకొల్పడంతో 22 బంతులు మిగిలి ఉండగానే బెంగళూర్‌.. ముంబైపై విజయం సాధించింది.

                                                      ఆర్సీబీ తరుపున 3 వేల పరుగులు చేసిన కోహ్లీ

మొదట బ్యాటింగ్‌ చేసిన ముంబై ఏడు వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. ఇందులో తిలక్‌ వర్మ 46 బంతుల్లో 84 పరుగులు చేసి విజఅంభించాడు. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (1) పూర్తిగా నిరాశపరిచాడు. 15 ఓవర్లలో డు ప్లెసిస్‌ ఔటైన తర్వాత కోహ్లి అర్షద్‌ ఖాన్‌ బౌలింగ్‌లో ఒక ఫోర్‌, ఓ సిక్సర్‌ కొట్టి ముంబై బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఇక ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ 41 సార్లు 50ం స్కోర్లు చేయడం ద్వారా ఈ జాబితాలో ఐదో స్థానంలో ఉన్నాడు. ఆర్సీబీ ఓపెనర్‌ గా 3వేల పరుగులు చేసిన ఆటగాడిగా కోహ్లీ నిలిచాడు.

                                                                 ఆరెంజ్‌, పర్పుల్‌ క్యాప్‌ రేసులో..

ప్రస్తుతం ఐపిఎల్‌లో ఐదు మ్యాచ్‌లు జరిగాయి. సీఎస్‌కే ఓపెనర్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ (92) ఆరెంజ్‌ క్యాప్‌ రేసులో తొలి స్థానంతో కొనసాగుతున్నాడు. ఆ తర్వాత ముంబయి బ్యాటర్‌ తిలక్‌ వర్మ (84), విరాట్‌ కోహ్లీ (82), కైల్‌ మేయర్స్‌ (73), ఫాఫ్‌ డు ప్లెసిస్‌ (73) టాప్‌ -5 లో ఉన్నారు. బౌలర్ల విభాగంలో అత్యధిక వికెట్లు తీసిన వారికిచ్చే పర్పుల్‌ క్యాప్‌ రేసులో లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌ పేసర్‌ మార్క్‌వుడ్‌ (5 వికెట్లు), రాజస్థాన్‌ రాయల్స్‌ స్పిన్నర్‌ యుజ్వేంద్ర చాహల్‌ (4 వికెట్లు) పోటీలో ముందున్నారు.