Oct 25,2020 07:39

రోనా విపత్కర సమయంలో ఫైనల్‌ ఇయర్‌ విద్యార్థులకు మినహా మిగిలిన విద్యార్థులను పరీక్షలు లేకుండా పై తరగతులకు ప్రమోట్‌ చెయ్యాలని సుప్రీం కోర్టు చెప్పింది. దాన్ని పటిష్టంగా అమలు చేయాలని విద్యార్థులు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నారు. కాని రాష్ట్ర ప్రభుత్వం పరీక్షలన్నీ రాయాల్సిందేనంటూ పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధం కావడం విద్యార్థులను ఆందోళనకు గురిచేస్తుంది. అయితే ఇది ఎంత వరకు సబబు అనేది విశ్లేషించాల్సిన అవసరముంది.


కరోనా విజృంభణను దృష్టిలో వుంచుకుని స్కూల్‌ విద్యార్థికి వెన్నెముక అయిన పదవ తరగతి పరీక్షలు మొదట రద్దు చేశారు. ఇంటర్‌ పరీక్షలు రద్దు చేశారు. ఇక్కడ నుండి సమస్య మొదలయింది. డిప్లొమా కూడా ఇంటర్‌కు సమానమే కదా! మరి వీరినెందుకు ప్రమోట్‌ చెయ్యరు అన్న ప్రశ్న తలెత్తింది. డిగ్రీ, బీటెక్‌ మొదటి రెండు సంవత్సరాల విద్యార్థులను, పి.జి మొదటి సంవత్సరం విద్యార్థులను ఎందుకు ప్రమోట్‌ చెయ్యరు అన్న ప్రశ్న మొదలైంది. దీనిపై చర్చించి సుప్రీం కోర్టు ఫైనల్‌ ఇయర్‌ వాళ్లకి వెంటనే పరీక్షలు నిర్వహించి మిగిలిన విద్యార్థులను ప్రమోట్‌ చెయ్యాలని సూచించింది. ఎఐసిటిఇ, యుజిసి మార్గదర్శకాల ప్రకారం డిప్లొమా 1,3 సెమిస్టర్లు, డిగ్రీ 2,4 సెమిస్టర్లు, పి.జి రెండవ సెమిస్టర్‌ పరీక్షలు నిర్వహించాలా లేదా అనేది ఆయా యూనివర్శిటీ పరిధిలో ఉన్న భౌతిక పరిస్థితులను, విద్యార్థుల అభిప్రాయాలను తీసుకొని నిర్ణయించుకోవచ్చు. అలాగే పరీక్షలు నిర్వహించని పక్షంలో 50 శాతం ఇంటర్నల్‌ మార్కులు, గత సెమిస్టర్ల మార్కుల ఆధారంగా ప్రమోట్‌ చెయ్యాలని తెలియజేశారు. అలాగే ప్రాక్టికల్స్‌, వైవా వాయిస్‌ ఆన్‌లైన్‌లో నిర్వహించమన్నారు. విద్యార్థుల అభిప్రాయాలను, వారి సమస్యలను తెలియచేసేందుకు ప్రతి విద్యా సంస్థలోనూ స్టూడెంట్‌ గ్రీవెన్స్‌ సెల్‌ (హెల్ప్‌ లైన్‌) చెయ్యాలన్నారు. కానీ విద్యార్థుల అభిప్రాయాలు తీసుకోకుండానే ఏకపక్షంగా పరీక్షా తేదీలను ప్రకటించడం సరైనది కాదు. ఇప్పుడు కరోనా కేసుల నమోదులో భారత దేశం ప్రపంచంలో రెండవ స్థానంలో వుండగా...మన రాష్ట్రం సైతం కేసుల నమోదులో దేశంలో ప్రముఖంగానే వుంది. ఇంతటి విపత్కర సమయంలో పరీక్షలు మళ్లీ ఎందుకు నిర్వహించాలి అన్న ప్రశ్న ముందుకు వచ్చింది. పరీక్షల నిర్వహణ కంటే విద్యార్థుల ఆరోగ్యం కాపాడటమే మొదటి కర్తవ్యం. కాని విద్యాశాఖ మంత్రి మొదట పరీక్షలను రద్దు చేసి ప్రమోట్‌ చేస్తున్నామని ప్రకటించారు. రెండు రోజుల తరువాత యూనివర్శిటీ వి.సి ల సమావేశానంతరం పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించి విద్యార్థులను గందరగోళం లోకి నెట్టేశారు. ఇది సమంజసం కాదు.


రాష్ట్ర వ్యాప్తంగా డిగ్రీ, డిప్లొమా, బిటెక్‌, పి.జి చదువుతున్న సంక్షేమ హాస్టల్‌ విద్యార్థులు సుమారు 50 వేల మందికి పైగా వుంటారు. కరోనా వ్యాప్తి వలన హాస్టళ్లు తెరవలేమని ఇది వరకే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. సంక్షేమ హాస్టళ్లు ప్రారంభించకుండా విద్యార్థులంతా పరీక్షలకు ఎలా హాజరవుతారు? గిరిజన, గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చే విద్యార్థులకు షెల్టర్‌ ఎక్కడ ఇస్తారు? అంటే సమాధానం లేదు. లాక్‌డౌన్‌ కారణంగా హాస్టల్‌ విద్యార్థులంతా హాస్టళ్ల లోనే పుస్తకాలు వదిలి వెళ్లారు. మరి పరీక్షలకు ఎలా సిద్ధమవుతారు?
విద్యార్థులకు 2,4 సెమిస్టర్‌ పరీక్షలు ఇప్పుడు నిర్వహించారనుకోండి. 6 నెలల తరువాత 3,5 సెమిస్టర్లు 2021 ఏప్రియల్‌ నెలలో నిర్వహించారనుకుందాం. మరి 4,6 సెమిస్టర్లు ఎప్పుడు నిర్వహిస్తారు? కరోనా పాజిటివ్‌ ఉండి లేదా ఇతర ఆటంకాల వలన ఇప్పుడు పరీక్షలు రాసుకోలేని వారికి డిసెంబర్‌ లేదా జనవరిలో మరోసారి పరీక్ష నిర్వహిస్తాం. అప్పుడు రాసుకోండి అంటున్నారు. మే నెల నుండి వీరు పై తరగతులకు ఎంట్రన్స్‌ పరీక్షలు, లేదా ఉద్యోగ సంబంధ పరీక్షలకు వెళ్ళాల్సి వుంటుంది. దీనిని ఎలా బ్యాలన్స్‌ చేస్తారు?


పోనీ, ఇప్పుడు 2,4 సెమిస్టర్లు పెట్టేసి, జనవరిలో 3,5 సెమిస్టర్లు నిర్వహించి, ఏప్రియల్‌లో 4,6 సెమిస్టర్లు పెట్టాలి అనుకుంటే ఆరు మాసాలలో మూడు సెమిస్టర్లు నిర్వహించడం విద్యార్థులపై ఒత్తిడి కాదా? రెండు నెలల సమయంలో సిలబస్‌ ఎలా పూర్తి చేస్తారు? సైన్సు విద్యార్థులకు ల్యాబులు ఎలా పూర్తి చేస్తారు? సిలబస్‌ తగ్గిస్తారనుకుందాం. పరీక్షలు నిర్వహించాలని పేరుకు మాత్రమే సెమిస్టర్లు పెట్టి...విద్యార్థులపై ఒత్తిడి తీసుకురావడం అవసరమా? ఇంతటి గందరగోళంలో అధికారులు ఎంత అప్రమత్తంగా వుండాలి? ఎంత ముందుచూపుతో వుండాలి? కానీ అవేవీ కనబడడం లేదు. ఏమైనప్పటికీ 6 నెలల విద్యా సంవత్సర సమయాన్ని కోల్పోయారు. కాబట్టి, పరీక్షలు నిర్వహించి విద్యార్థులపై ఒత్తిడి తెచ్చేకంటే ప్రమోట్‌ చేయడం మంచిది.


ఎల్‌. చిన్నారి
( వ్యాసకర్త సెల్‌ : 7382004271)