Jul 08,2020 08:38

     కోవిడ్‌-19 ప్రభావంతో విద్యారంగ రూపురేఖలు మారిపోతున్నాయి. ప్రపంచంలో పలు దేశాలు విద్యా సంవత్సరం ప్రణాళిక ఎలా ఉండాలనే విషయమై చర్చిస్తున్నాయి. ఇప్పటికే వియత్నాం రెండు రోజులకు ఒకసారి తరగతి గదిలో బోధన, హాంకాంగ్‌ ఒంటిపూట బడులతో, డెన్మార్క్‌ పూర్తి రోజులు, ఇటలీ, దక్షిణ కొరియాలు ఆన్‌లైన్‌ క్లాసులతో ఈ విద్యా సంవత్సరాన్ని ప్రారంభించాయి. భారత్‌లో కరోనా విజృంభిస్తున్న సమయంలో పూర్తి స్థాయి తరగతి గది బోధన సాధ్యం కాదు. చాలా దేశాల అనుభవాలు కూడా ఇదే సంకేతాన్ని ఇస్తున్నాయి, ఆచరిస్తున్నాయి. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వానికి ఇదొక అవకాశంలా దొరికింది. కేంద్రం ప్రవేశ పెట్టబోతున్న 'జాతీయ విద్యా విధానం-2019'లో ఆన్‌లైన్‌ విద్యను ప్రోత్సహించడం, ఓపెన్‌ విద్యా సంస్థల ఏర్పాటు కీలకం. ఈ తరుణంలో బిజెపి అనుకున్న దానికి మరింత ఊతం లభించింది. ప్రస్తుతం దేశంలో కేరళ ఆన్‌లైన్‌ బడులను ప్రారంభించింది. కర్ణాటక ఈ విద్యా సంవత్సరం అన్‌లైన్‌ క్లాసులు బోధిస్తామని చెప్పింది. మిగిలిన కొన్ని రాష్ట్రాల్లో అక్కడి పరిస్థితులకు అనుగుణంగా విద్యా సంవత్సరాన్ని రూపొందించుకునేందుకు తర్జన భర్జన పడుతున్నారు. మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే మన రాష్ట్ర విద్యా రంగ స్వభావం వేరు. రాష్ట్రంలో ప్రయివేటు, కార్పొరేటు సంస్థలదే పైచేయి. చాలా ప్రయివేటు, కార్పొరేటు కాలేజీలు ఆన్‌లైన్‌ క్లాసులు ప్రారంభించాయి. ఇలా వుండగా, విద్యా సంవత్సరం ప్రారంభం కాకుండా ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించడానికి వీలులేదని, ఉత్తర్వులను అతిక్రమిస్తే పాఠశాల గుర్తింపు రద్దు చేస్తామని విద్యాశాఖ ప్రకటించింది. కానీ దానికి ప్రత్యామ్నాయం ఏమిటన్నది ఆలోచన చేయడం లేదు. ప్రభుత్వ సంస్థలకు మాత్రం ఇప్పటి వరకు దూరదర్శన్‌లో క్లాసులు నిర్వహిస్తున్నాయి. పూర్తి స్థాయి పర్యవేక్షణ లేకుండా ప్రభుత్వ సంస్థల విద్యార్థులు రాణించడం చాలా కష్టం. దీనితో గ్రామీణ ప్రాంత విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్ధంకంగా మారబోతోంది.
     కేంద్రంలో సిబిఎస్‌ఇ పది, ఇంటర్‌ పరీక్షలను రద్దు చేస్తామని చెప్పింది. ఉన్నత విద్య పరీక్షల విషయంలో నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. రాష్ట్రంలో పదవ తరగతి, ఇంటర్‌ సప్లమెంటరీ పరీక్షలను రద్దు చేసింది. డిగ్రీ, వృత్తి విద్యా కోర్సులను రద్దు చేస్తున్నామని ప్రకటించి మరల తిరిగి రద్దు చేయడం లేదని చెప్పి యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసి) ఇచ్చే నిబంధనల ఆధారంగా నిర్ణయం తీసుకుంటామని ప్రకటించింది. రాబోయే విద్యా సంవత్సరం ఎలా ప్రారంభించాలనే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం మొదట్లో ఆగష్టు 3 నుంచి పాఠశాలలు ప్రారంభిస్తామని చెప్పి మరల ఆగష్టు నెల చివరిలో ప్రారంభించే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. అయితే విద్యా సంవత్సరాన్ని 200 రోజులుగా మార్పు చేసి 100 రోజులు తరగతి గదిలో, మరొక 100 రోజులు ఆన్‌లైన్‌ పాఠాల విద్యా సంవత్సరాన్ని నిర్వహించాలని ప్రతిపాదనను ముందుకు తీసుకు వచ్చింది. తరగతి గది లో 30 మంది మాత్రమే ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని 30 మందికన్నా ఎక్కువ మంది విద్యార్థులు ఉంటే షిఫ్టుల వారీగా నడపాలని పాఠశాల విద్యా శాఖ ప్రతిపాదనలను ముందుకు తీసుకు వచ్చింది. ఇప్పటి వరకు ఒక స్పష్టమైన ప్రణాళికను ప్రభుత్వం నిర్ణయించలేదు.
      రాష్ట్రంలో 61,756 పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 60 శాతం పాఠశాలలు గ్రామీణ ప్రాంతాలలో ఉన్నాయి. ఇప్పటికే ప్రయివేటు, కార్పొరేటు పాఠశాలల్లో 90 శాతం అడ్మిషన్లు పూర్తి చేశారు. అడ్మిషన్లు పూర్తియిన వాటిలో ఆన్‌లైన్‌ క్లాసుల పేరుతో ఫీజులు వసూలు చేస్తున్నారు. కొన్ని కార్పొరేటు విద్యా సంస్థలు పుస్తకాలను ఇంటి వద్దకు పంపించే పని పెట్టుకున్నాయి. ఒక పక్క ప్రయివేటు, కార్పొరేటు సంస్థల్లో విద్యార్థులు ఆన్‌లైన్‌ క్లాసుల పేరుతో ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తుంటే ప్రభుత్వ సంస్థల్లో ఉన్న విద్యార్థులకు అవసరమైన విద్యను అందించే విధంగా ఏర్పాట్లు చేయడంలో నిర్లక్ష్యం కనిపిస్త్తోంది. ఇప్పుడున్న పాఠ్యపుస్తకాలు ఆన్‌లైన్‌ విద్యా వ్యవస్థకు తూగలేవు. పాఠ్య పుస్తకాలను 30 శాతం తగ్గించాల్సిన అవసరం ఉంది. సిబిఎస్‌ఇ సిలబస్‌ను కేంద్రం 33 శాతం తగ్గించింది. అయితే ప్రైమరీ విద్యార్థులకు ఆన్‌లైన్‌ బోధన కుదరదు. వారికి స్థానిక పాఠశాలలోనే వారంలో మూడు రోజుల పాటు లేదా ఒంటిపూట బడులు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలి. 7-10వ తరగతి విద్యార్థులందరికి అన్ని వసతులతో కూడిన ఆన్‌లైన్‌ విద్య అందించే విషయం ఆలోచించవచ్చు. అయితే, ఇది తాత్కాలికం మాత్రమే. ముఖ్యంగా పాఠశాల స్థాయిలో గ్రామీణ విద్యావ్యవస్థ చిన్నాభిన్నం అయ్యే పరిస్థితులు ఉన్నాయి. దీనివలన పేద వర్గాలు విద్యకు దూరమయ్యే పరిస్థితులు ఉన్నాయి.
      ఇంటర్‌ కాలేజీ అడ్మిషన్‌ విషయంలో పూర్తి అయిన ఇంటర్‌ బోర్డు అధికారులు అడ్మిషన్‌ సిస్టమ్‌ ఆన్‌లైన్‌ చేస్తామని ప్రకటించింది. అయితే విధివిధానాలు మాత్రం ఇంకా తయారు చేయలేదు. అయినప్పటకీ ప్రయివేటు, కార్పొరేటు సంస్థల్లో అడ్మిషన్లు 80 శాతం పూర్తయ్యాయి. చేర్చుకున్న విద్యార్థులకు ఆన్‌లైన్‌ పాఠాలను బోధిస్తున్నాయి. అయితే ప్రభుత్వం ఏ చర్యలూ చేపట్టలేదు. ఇప్పుడున్న 450 జూనియర్‌ కాలేజీలలో అడ్మిషన్లు తగ్గే అవకాశం ఉంది. దీనితో కాలేజీలను మూత వేసే ప్రమాదం కూడా ఉంది.
డిగ్రీ, పి.జి, వృత్తి విద్యా పరీక్షలపై నిర్ణయం కోసం వేచి చూడాలి. వర్శిటీలు, డిగ్రీ, ఇంజనీరింగ్‌ తదితర కళాశాలలు తెరుచుకోడానికి మరికొంత సమయం పడుతుంది. జులై చివరిలో ఆన్‌లైన్‌ క్లాసులు ప్రారంభిస్తామని ఇప్పటికే ఉన్నత విద్యా మండలి పేర్కొంది. ఇంకా ఎంసెట్‌, ఎంబిఎ, ఎంసిఎ, పి.జి, లా ఎంట్రన్స్‌ టెస్ట్‌లు జరగాల్సి ఉంది. వీటికి ప్రత్యామ్నాయం ఆలోచించకుండా కాలేజీలు ప్రారంభిస్తామని చెబుతున్నారు. ఒకవేళ ఆన్‌లైన్‌ క్లాసులు ప్రారంభించినా విద్యార్థులకు కంప్యూటర్‌/ట్యాబు/ స్మార్టు ఫోను అత్యధిక మందికి అందుబాటులో లేకపోవడం అతి పెద్ద సమస్య. ప్రతి విద్యార్థికి ప్రభుత్వమే ఒక ట్యాబ్‌, ఇంటర్‌నెట్‌ సౌకర్యం కల్పించాలి. అప్పుడే అది విజయవంతం అవు తుంది. ఇప్పటి వరకు హాస్టళ్లలో ఒక్క గది లోనే ఎక్కువమంది విద్యార్థులు ఉంటున్నారు. హాస్టళ్ళ సంఖ్యను పెంచాల్సి ఉంది. అటువంటి చర్యలు చెపట్టకపోగా...కోవిడ్‌-19 వంకతో ప్రస్తుత హాస్టళ్ళను మూసివేసే ప్రయత్నాలు చేస్తున్నారు.
     రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాలలో పాఠశాలలను ప్రారంభించుకుని భౌతిక దూరం పాటిస్తూ ఆరోగ్యకరమైన వాతావరణంలో ఉండేలా చూడటం చాలా అవసరం. దీనితో పాటు ప్రతి పాఠశాలకు ఒక మెడికల్‌ కిట్‌, వారానికి ఒకసారి మెడికల్‌ చెకప్‌లు చేయాలి. విద్యార్థులకు అవకాశం ఉన్నంత మేరకు తరగతి గదిలో పాఠాలను చెప్పించే విధంగా ప్రయత్నం చేయాలి. లేని పక్షంలో ప్రతి విద్యార్థికి ట్యాబ్‌, నెట్‌ సదుపాయం కల్పించి విద్యను అందించాలి. అప్పుడే ప్రస్తుత పరిస్థితులలో ప్రభుత్వ విద్యా రంగాన్ని నిలబెట్టగలుగుతాం. అయితే ఇది తాత్కాలికం మాత్రమే. కామన్‌ పాఠశాల విద్యా వ్యవస్థ ఉంటే విద్యలో మార్పులు వస్తాయి.