Sep 30,2023 16:33

ప్రజాశక్తి-విజయవాడ : హాస్టల్‌ విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో శాంతియుతంగా విజయవాడ ధర్నాచౌక్‌ వద్ద ఆందోళన నిర్వహిస్తున్న విద్యార్థులను అరెస్టు చేయడాన్ని భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. అరెస్టు చేసినవారిని తక్షణమే విడుదల చేయాలని డిమాండ్‌ చేసింది. వారిపై కేసులు బనాయించడం అమానుషమని పేర్కొంది. ఈ మేరకు పత్రికా ప్రకటనను విడుదల చేసింది. ఆరెస్టయిన వారిలో ఎస్‌.ఎఫ్‌.ఐ అధ్యక్ష కార్యదర్శులు కె.ప్రసన్నకుమార్‌, ఎ.అశోక్‌, సహాయకార్యదర్శులు కిరణ్‌, పెద్దిరాజు, వినోద్‌ కుమార్‌, ఎన్‌టిఆర్‌ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు జి.గోపి, సోమేశ్వరరావులతో పాటు 17 మంది విద్యార్థినులతో సహా 99 మందిని వివిధ పోలీస్‌స్టేషన్‌లలో ఉంచారని వెల్లడించారు. వీరిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేసింది. విజయవాడ ధర్నాకు రాకుండా హిందూపురం, పెనుగొండ, మడకశిర, కదిరి, కడప, కర్నూలు జిల్లాల్లో విద్యార్థి నాయకులను ముందస్తు అరెస్టులు చేయడం గర్హనీయమని తెలిపింది. అరెస్టయిన విద్యార్థులను సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యదర్శి వర్గసభ్యులు వై.వెంకటేశ్వరరావులు పరామర్శించారు. విద్యార్థులనుద్దేశించి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి విద్యార్థుల, హాస్టల్‌ విద్యార్థుల న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు.