'స్వా వలంబన' మంచి స్ఫూర్తిదాయకమైన మాట. స్వయం సమృద్ధి సాధించడం, సొంత వనరులను కాపాడుకోవడం, సొంత గడ్డపై తయారైన వస్తువులను వినియోగించేలా ప్రజలను ప్రోత్సహించడం, ఇరుగు పొరుగు దేశాలతో సంఖ్యత పెంచుకొని స్వీయ పురోగతికి బాటలు వేసుకోవడమే ఏ దేశానికైనా మేలు చేసేది. అయితే 'స్వావలంబన' నినాదపు గొప్పలు చేతల్లోనూ ఉండాలి. సొంత కాళ్లపై నిలబడటం అంటే సొంత కాళ్లపైన నిలబడటమే తప్ప ఉన్న కాళ్లను విరగ్గొట్టుకొని అందమైన ఊత కర్రలను ఆశ్రయించడం కాదు. కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కార్‌కు ఈ ఇంగితమే కొరవడింది. ఒకవైపు స్వావలంబన సాధిస్తామంటూ నినాదాలు చేస్తూనే మరోవైపు ప్రభుత్వ రంగ సంస్థలను విదేశీ కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టేస్తోంది. నేల నుంచి నింగి దాకా అన్ని రంగాల్లోనూ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు తలుపులు బార్లా తెరిచేస్తోంది. స్వావలంబనకు గొడ్డలి పెట్టు అవుతుందే తప్ప ఏ కోశానా ఉద్దీపన కాబోదు. ఈ నెల 27న జరిగిన ఒక వెబినార్‌లో రక్షణ రంగంలో స్వావలంబన సాధించి మిత్ర దేశాలకు విశ్వసనీయ ఎగుమతిదారుగా నిలుస్తామని ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. రక్షణ రంగంలో ఆంక్షలన్నీ ఎత్తివేసి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు ఎర్ర తివాచి పరిచాక స్వావలంబన ఎలా సాధ్యమో కేంద్ర పెద్దలే సెలవివ్వాలి. ఆర్థిక సంక్షోభాలచ్చిన ప్రతిసారి మన ఆర్థిక వ్యవస్థకు దన్నుగా నిలిచింది ప్రభుత్వ రంగ బ్యాంకులు, జీవిత బీమా సంస్థలే. ఇప్పుడు ప్రభుత్వ రంగ సంస్థలన్నిటినీ ఒక్కొటక్కటిగా తెగనమ్మడమంటే ఆర్థిక వ్యవస్థ ఆయువు తీయడమే. వాస్తవానికి వినాశకరమైన ఈ నాటకాలను ఆడిస్తున్నది అమెరికా నేతృత్వంలోని కార్పొరేట్ దుష్ట కూటమే.
అమెరికా కనుసన్నల్లో పని చేసే ప్రపంచ బ్యాంకు, ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యుటిఒ) భారత్ లాంటి వర్థమాన దేశాలకు పిసరంత సాయం చేసి ఆర్థిక వ్యవస్థల్లోకి చొరబడి క్రమక్రమంగా ఆంక్షలు కత్తి నూరుతాయి. ప్రభుత్వ రంగాన్ని నిర్వీర్యం చేస్తూ కార్పొరేట్ కంపెనీల గుత్తాధిపత్యంలోకి దేశ ఆర్థిక వ్యవస్థలను ఈడ్చుకెళ్తాయి. ఈ దుర్మార్గాన్ని గ్రహించే క్యూబా, వెనిజులా, బ్రెజిల్, వియత్నాం వంటి సోషలిస్టు, ప్రజాస్వామిక దేశాలు ప్రత్యామ్నాయ ఆర్థిక సంస్థలను ఏర్పాటు చేసుకొని స్వావలంబనకు కృషి చేశాయి. అమెరికా ఆంక్షలను ప్రతిఘటిస్తూనే ఈ దిశగా అవి విజయం కూడా సాధించాయి. ప్రస్తుతం చైనా స్వావలంబన పథంలో ఆశాకిరణంగా నిలుస్తోంది. వన్ బెల్ట్ వన్ రోడ్‌లో ఇరుగు పొరుగు దేశాలన్నీ కూడా చైనాను అనుసరిస్తే మోడీ సర్కార్ మాత్రం అమెరికాకు, దాని మిత్రులకూ జూనియర్ భాగస్వామిగా ఉండటమే గొప్పగా ప్రచారం చేస్తోంది. ఇటీవలి 'సరిహద్దు' వివాదాన్ని చూపి చైనా పట్ల తన శత్రుత్వ వైఖరిని సమర్థించుకునేందుకు ప్రయత్నిస్తోంది.
సాంకేతిక పరికరాలు, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, స్మార్ట్ ఫోన్లతో పాటు ఫార్మా ముడి సరుకు వరకూ ప్రజల జీవితంతో మమేకమైన చైనా ఉత్పాదనలను బహిష్కరించడం సాధ్యపడుతుందా? చౌకగా లభించే వీటిని కాదని అమెరికా కార్పొరేట్ కంపెనీల ఉత్పాదనలు వాడటం ఏ విధమైన స్వావలంబన? మన దేశ సార్వభౌమత్వాన్ని, మన సరిహద్దులను ఏ విధంగానైనా కాపాడుకోవలసిందే. అందులో ఏమాత్రమూ వెనక్కి తగ్గేది లేదు. కానీ మన మాతృభూమిని రక్షించుకోవడం అంటేనే సరిహద్దు దేశాలతో శత్రుత్వం పెంచుకోవడం అన్న వైఖరి తప్పు. స్నేహం, సఖ్యత, సామరస్యం పరిష్కరించిన సరిహద్దు సమస్యలే మనకు కనబడతాయి తప్ప శత్రుత్వంతో ఎవ్వరూ సరిహద్దుల్ని ఎల్లకాలమూ కాపాడుకోలేరు. కార్పొరేట్ సేవల్లో మునిగి తేలుతున్న మోడీ సర్కార్‌కు ఎంత సేపూ అమెరికా, దాని కార్పొరేట్ కూటమే కనిపిస్తోంది మినహా దేశ స్వావలంబనకు పొరుగు దేశాలతో సఖ్యతకు గల అవినాభావ సంబంధం కనిపించడం లేదు.
టెలికం రంగంలో ఆధునిక టెక్నాలజీ 5జి, కృత్రిమ మేథస్సు (ఎఐ)లో బ్రిక్స్ దేశాలు పరస్పర సహకారంతో ముందుకు సాగాలని చైనా పరిశ్రమలు, ఐటి శాఖ మంత్రి షియో యకింగ్ ఇటీవల స్నేహహస్తం చాచారు. కానీ మోడీ సర్కార్ ముఖం చాటేస్తోంది. భవిష్యత్ అంతా కృత్రిమ మేథస్సుదేనని సాంకేతిక నిపుణలు చెబుతున్నా ఈ రంగంలో పొరుగు దేశమందిస్తున్న సహకారాన్ని అందుకునేందుకు మోడీ సర్కార్ సిద్ధపడకపోవడం సముచితం కాబోదు. ఒక్క భారత్ మినహా బ్రిక్స్ దేశాలన్నీ చైనా ప్రతిపాదనకు అంగీకారం తెలిపాయి. అమెరికా ఏకధ్రువ గుత్తాధిపత్యాన్ని నిలువరించాలంటే బహుళ ధ్రువ ప్రపంచం తప్పనిసరి. బ్రిక్స్ లాంటి కూటములు దీనికి ఎంతగానో దోహదం చేస్తాయి. హువాయి కంపెనీపై అమెరికా నిషేధం విధించినందున ఇప్పుడు చైనా ప్రతిపాదనను స్వాగతిస్తే పెద్దన్న అలకపూనుతాడేమోనన్న బెంగే మోడీ సర్కార్ బ్రిక్స్‌కు దూరం కావడానికి కారణంగా కనిపిస్తోంది. అమెరికాకు మోకరిల్లడం మానేసి ఇరుగుపొరుగుతో సఖ్యత పెంచుకుంటేనే స్వయం సమృద్ధికి, ఆత్మనిర్బర భారత్ ఆవిష్కృతానికి బాటలు పడేది.










