Jan 19,2021 20:29

న్యూఢిల్లీ : విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల నిబంధనల్లో మార్పులు చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోందని సమాచారం. ముఖ్యంగా ఇ - కామర్స్‌ రంగ ఎఫ్‌డిఐల్లో కీలక మార్పులు చోటు చేసుకునే అవకాశాలున్నాయని ఓ ప్రభుత్వాధికారి పేర్కొన్నట్లు రాయిటర్స్‌ రిపోర్ట్‌ చేసింది. ప్రధానంగా అమెజాన్‌, మరో కంపెనీ ఫ్లిప్‌కార్ట్‌ను సొంతం చేసుకున్న వాల్‌మార్ట్‌లను ఇరుకున పెట్టే విధంగా మార్పులు చేయాలని భావిస్తోంది. ప్రస్తుతం ఆన్‌లైన్‌ పోర్టళ్లలో అమ్మకం, కొనుగోలుదారులను కలపడానికి మాత్రమే అనుమతి ఉంది. ఆయా ఉత్పత్తులు సొంతగా కలిగి ఉండటం, ఆయా వేదికల్లో ప్రత్యక్షంగా విక్రయించడానికి వీలు లేదు. దీంతో ఆయా కంపెనీలు కొన్ని పెద్ద విక్రయదారులతో ఒప్పందాలు చేసుకొని.. అందులో పరోక్షంగా వాటా కలిగి ఉన్నాయి. ఆయా ఉత్పత్తులను విక్రయిస్తున్నాయి. కాగా ఈ నిబంధనలో మార్పులు చేయాలని ప్రభుత్వం యోచిస్తోందని సమాచారం. అమెజాన్‌, వాల్‌మార్ట్‌ల పెట్టుబడులకు అనుగుణంగా ఇ - కామర్స్‌ నిబంధనల్లో 2018 డిసెంబర్‌లో బిజెపి ప్రభుత్వమే నిబంధనలు మార్చింది. దీంతో ఆయా ఆన్‌లైన్‌ పోర్టళ్లకు విక్రయదారుల సంస్థల్లోనూ 25 శాతం వరకు ఈక్విటీ వాటా ఉండేలా అనుమతించింది. తాజాగా ఈ నిబంధనల్లో మార్పులు చేపట్టాలని భావించడంతో అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌లు ఒత్తిడికి గురి కానున్నాయి.
గత నెలలోనే ఇ - కామర్స్‌ కంపెనీల పెట్టుబడులు, నిబంధనలపై అంతర్గత సమావేశం జరిగిందని వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ యేగేష్‌ బవేజా తెలిపారు. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఆయన వెల్లడించలేదు. కాగా ఈ రంగంలోని అతిపెద్ద కంపెనీ అమెజాన్‌ ప్రతిపాదనలు, సూచనలు పరిగణలోకి తీసుకుంటామన్నారు. 2019లో ఆన్‌లైన్‌ మార్కెట్‌ 30 బిలియన్‌ డాలర్లు (దాదాపుగా రూ.2.25 లక్షల కోట్లు)గా ఉంది. 2026 నాటికి 200 బిలియన్‌ డాలర్ల(దాదాపుగా రూ.15 లక్షల కోట్లు)కు చేరనుందని ఎజెన్సీ ఇన్వెస్ట్‌ ఇండియా అంచనా వేసింది. కాగా ఈ మార్కెట్‌పై రిలయన్స్‌ ఇండిసీస్‌ అధినేత ముఖేష్‌ అంబానీ ఇప్పటికే కన్నేసిన విషయం తెలిసిందే. ఇ - కామర్స్‌ విదేశీ పెట్టుబడుల నిబంధనల మార్పులు ముఖేష్‌ అంబానీకి చెందిన జియో మార్ట్‌కు మద్దతు చేసేలా ఉండొచ్చని నిపుణులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్యూచర్‌ గ్రూపులోని కొన్ని అన్‌లిస్టెడ్‌ కంపెనీల్లో అమెజాన్‌కు మైనారిటీ వాటా ఉన్న విషయం తెలిసిందే. కాగా ముకేష్‌ అంబానీ ఇటీవల కాలంలో ఫ్యూచర్‌ గ్రూపు కొనుగోలు చేయడానికి ఒప్పందం చేసుకోగా.. తమ అనుమతి లేకుండా డీల్‌ ఎలా కుదుర్చుకుంటారంటూ అమెజాన్‌ అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో అమెజాన్‌ను ఇరకాటంలో పెట్టడానికి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నుంచి ఒత్తిడిలు పెంచుతోందన్న రిపోర్ట్‌లు వస్తోన్నాయి. ఇదే క్రమంలో తాజా నిబంధనలు తెరపైకి వస్తుండొచ్చని నిపుణులు విశ్లేషిస్తున్నారు.