Dec 22,2020 20:37

న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగ సంస్థలను ఒక్కొక్కటిగా ప్రయివేటీకరించాలని కంకంణం కట్టుకున్న మోడీ సర్కార్‌ తాజాగా షిప్పింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌సిఐ)ని అమ్మకానికి పెట్టింది. ఇందులో కేంద్రానికి ఉన్న 63.75 శాతం వాటాను కార్పొరేట్లకు విక్రయించడానికి వీలుగా డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్‌ పబ్లిక్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ (దీపమ్‌) మంగళవారం ట్వీట్‌ చేసింది. ఆసక్తి కలిగిన ప్రయివేటు కంపెనీలు ఫిబ్రవరి 13లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఈ డిజిన్వెస్ట్‌మెంట్‌కు ఆర్‌బిఎస్‌ఎ కాపిటల్‌ అడ్వైజర్‌గా నియమించుకుంది. అంతర్జాతీయ కంటెయినర్‌ సర్వీసులు అందిస్తున్న ఏకైక భారత కంపెనీ ఇదొక్కటే. ఈ మినీరత్న కంపెనీని 1961 అక్టోబర్‌లో ఏర్పాటు చేశారు. 1992లో ఇందులోని 18.51 శాతం వాటాను విత్త సంస్థలు, ఎంఎఫ్‌, బ్యాంక్‌లకు, విదేశీ ఇన్వెస్టర్లకు విక్రయించారు. 2020 డిసెంబర్‌ 1 నాటికి ఈ కంపెనీలో 3,281 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. గడిచిన ఆర్థిక సంవత్సంలో ఈ కంపెనీ రూ.4668 కోట్ల మొత్తం ఆదాయంతో రూ.336 కోట్ల నికర లాభాలు నమోదు చేసింది. 2020-21 సెప్టెంబర్‌తో ముగిసిన ఆరు మాసాల కాలంలో ఎస్‌సిఐ రూ.2055 కోట్ల ఆదాయంతో రూ. 478 కోట్ల లాభాలు సాధించింది. ఇలాంటి కంపెనీని కేవలం రూ.2000 కోట్ల నికర విలువ కలిగిన ప్రయివేటు కంపెనీకి విక్రయించడానికి వీలుగా ప్రభుత్వం నిబంధనలు రూపొందించింది. మోడీ సర్కార్‌ ఇప్పటికే బిపిసిఎల్‌, ఎయిరిండియా లాంటి కంపెనీలను విక్రయానికి పెట్టిన విషయం తెలిసిందే.