Nov 12,2020 07:31

పైన పటారం...లోన లొటారం.. ఈ సామెత బీహార్‌ ఎన్నికల ఫలితాలకు అతికినట్టుగా సరిపోతుంది. ఎన్‌డిఎ కూటమి ఇక్కడ విజయం సాధించి అధికారం చేపట్టబోతోంది. అంతమాత్రం చేత కేంద్రం లోని నరేంద్ర మోడీ, రాష్ట్రంలో జెడియు అధినేత నితీష్‌ కుమార్‌ అమలు చేసిన విధానాలకు బీహారీయులు పట్టం కట్టినట్టు కాదు! ఎన్నికల ప్రచారంలో వారు చెప్పిన మాటలను, చేసిన హామీలను విశ్వసించినట్టూ కాదు. జెడియు, బిజెపిల నిర్వాకం పట్ల ఆగ్రహంతో ఉన్నారు కాబట్టే ప్రతిపక్ష పార్టీల ప్రచార సభలకు భారీగా తరలి వచ్చారు. అందువల్లనే ఇటీవల కాలంలో ఎన్నడూ లేని విధంగా ప్రజల నిత్యజీవితాలతో సంబంధమున్న నిరుద్యోగం, ధరల పెరుగుదల తదితర అంశాలు ఎన్నికల ఎజెండాలయ్యాయి. వామపక్షాల ఎర్రబావుటా మళ్లీ పైకి లేచింది. గత ఎన్నికల మాదిరే భావోద్వేగాలను రెచ్చగొట్టి లబ్ధి పొందడానికి మోడీ అండ్‌ కో చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఈ వ్యతిరేకతను ఓట్ల రూపంలో మలుచుకోవడంలో మహాఘట్‌బంధన్‌ విఫలం కావడంతో చావు తప్పి కన్ను లొట్టబోయినట్టుగా ఎన్‌డిఎ బొటాబొటీ ఆధిక్యంతో మళ్లీ అధికారం లోకి వచ్చింది.
ఎన్నికల రణక్షేత్రంలో ఎన్‌డిఎ కూటమి ఎంత పేలవమైన పనితీరు కనపరిచిందో ఆయా పార్టీలు పోటీ చేసిన స్థానాల్లో పొందిన ఓట్ల శాతం (కంటెస్టెడ్‌ ఓట్‌ షేర్‌)ను 2019 లోక్‌సభ ఎన్నికల ఫలితాలతో పోల్చి చూస్తే అర్ధమవుతుంది. ఆ ఎన్నికల్లో బిజెపి 56.5 శాతం ఓట్లను, జెడియు 51.8 శాతం ఓట్లను పోటీ చేసిన స్థానాల్లో సాధించాయి. తాజా ఎన్నికల్లో బిజెపి 42.5 శాతం, జెడియు 32.81 శాతంకు పరిమితం కావడం దేనికి సంకేతమో అర్ధం కావడం లేదూ! 2019 ఎన్నికల్లో పోటీ చేసిన స్థానాల్లో 92 శాతానికి పైగా బిజెపి గెలుపొందగా, జెడియు 89.3 శాతం స్థానాల్లో గెలుపొందింది. తాజా ఎన్నికల్లో బిజెపి 66.4 శాతం సీట్లకు, జెడియు 37.4 శాతం సీట్లతో సర్దుకోవాల్సి వచ్చింది. మహాఘట్‌బంధన్‌ పరిస్థితి దీనికి భిన్నం. ఈ కూటమిలో కాంగ్రెస్‌ మినహా అన్ని పార్టీలు గత ఎన్నికల కన్నా అధిక శాతం ఓట్లు, సీట్లను గెలుపొందాయి. కూటమిలో కీలక భాగస్వామి అయిన ఆర్‌జెడి 2019 ఎన్నికల్లో పోటీ చేసిన స్థానాల్లో 32.9 శాతం ఓట్లు సాధించగా, తాజాగా 38.98 శాతం పొందింది. వామపక్షాలు ముఖ్యంగా గత ఎన్నికల్లో కేవలం 2.9 శాతం ఓట్లు పొందిన సిపిఎం తాజాగా 37.23 శాతం ఓట్లు సాధించింది. 2019లో 12.8 శాతం ఓట్లు సాధించిన సిపిఐ, 14.9 శాతం ఓట్లు పొందిన సిపిఐ (ఎంఎల్‌) ఈ సారి వరుసగా 33.29, 41.33 శాతం ఓట్లను పొందాయి. సీట్లు కూడా అంతే! గత ఎన్నికల్లో 7.8 శాతం గెలుపురేటు ఉన్న ఆర్‌జెడి ఈ సారి 52.8 శాతానికి ఎగబాకింది. పోటీ చేసిన స్థానాల్లో కేవలం 2.3 శాతం మాత్రమే గత ఎన్నికల్లో గెలుపొందిన వామపక్షాలు ఈ సారి 55.2 శాతం సీట్లలో గెలుపొందాయి. ఓటర్ల మనోగతమేమిటో ఈ అంకెలు చూస్తే అర్ధమవుతోంది కదా! ఈ కూటమిలో అత్యంత బలహీనమైన పార్టీగా కాంగ్రెస్‌ నిలచింది. 2019లో 33.6 శాతం ఓట్లను పొందిన కాంగ్రెస్‌ తాజాగా 32.89 శాతానికి దిగజారింది. కాంగ్రెస్‌-బిజెపి ముఖాముఖి తలపడిన స్థానాల్లో బిజెపి 78.4 శాతం గెలుపును నమోదు చేసింది. ఆర్‌జెడి పోటీ చేసిన స్థానాల్లో 60.7 శాతం, వామపక్షాలు పోటీ చేసిన చోట 50 శాతం స్థానాల్లో మాత్రమే బిజెపి గెలిచింది. జెడియు కూడా కాంగ్రెస్‌ మీదనే అత్యధిక స్థానాల్లో గెలుపొందింది! కాంగ్రెస్‌ ఇంతకన్నా ఏ మాత్రం మెరుగైన ప్రదర్శన చేసి ఉన్నా పరిస్థితి మరో విధంగా ఉండేది!
అధికారపక్షంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత ప్రతిపక్షం గెలుపును నల్లేరుపై నడకలా మారుస్తుందనుకోవడానికి వీలు లేదని తాజా ఎన్నికలు స్పష్టం చేస్తున్నాయి. కష్టకాలంలో ప్రజలతో కలిసి మెలిసి ఉండటంతో పాటు సమస్యలకు ప్రతిపక్షం సరైన పరిష్కారం చూపాలి. ఆ పరిష్కారం సరైనదేనని ప్రజలు నమ్మాలి! అప్పుడే ఓట్లు వేసి అండగా నిలుస్తారు. కష్టకాలంలో పట్టించుకోకుండా, ఎన్నికల వేళ ఎన్ని ఆపద మొక్కుల మొక్కినా, పొత్తులను కూడగట్టినా, తమ ప్రత్యామ్నాయ విధానాల పట్ల ప్రజల్లో విశ్వాసాన్ని కలిగించగలడమే కీలకం. ఇక్కడే కాంగ్రెస్‌ వైఫల్యం ఉంది. బిజెపి చేపట్టిన నయా ఉదారవాద విధానాలను గానీ, మత విద్వేష ఎజెండాను గాని ప్రతిఘటించకుండా మెతక వైఖరిని అనుసరించింది. అందుకే అధికార జెడి(యు)-బిజెపి కూటమి పట్ల ప్రజలకు ఒక ఏడాది లోనే విరక్తి కలిగినా, అది మహాఘట్‌బంధన్‌కు కలిసిరాలేదు. బీహార్‌ ఎన్నికలు నేర్పుతున్న ఈ పాఠాన్ని ప్రజాస్వామ్య వాదులు, అభ్యుదయ, లౌకిక శక్తులు అర్ధం చేసుకోవాలి!