Nov 07,2020 07:33

       ''మనకు మార్పు కావాలి. నిజమైన మార్పు. వ్యవస్థాపరమైన మార్పు కావాలి. ఈ వ్యవస్థను భరించలేకుండా ఉన్నాం. రైతులు, కార్మికులు భరించలేకపోతున్నారు. ప్రజలు భరించలేకపోతున్నారు. చివరికి మన భూమాత కూడా భరించలేకపోతున్నది. అందుకే మన జీవితాల్లో, మన నిత్యజీవిత వాస్తవికతలో మార్పు రావాలి''...అయిదేళ్ల క్రితం బొలీవియా రాజధాని శాంతాక్రజ్‌లో జరిగిన ప్రపంచ ప్రజా ఉద్యమాల సదస్సులో ప్రసంగిస్తూ పోప్‌ ఫ్రాన్సిస్‌ అన్న మాటలివి.
        ఆయన అలా చెప్పి అయిదేళ్లు గడిచాయి. ఈ కాలంలో పెట్టుబడిదారీ వ్యవస్థను భరించడం ప్రజలకు మరింత కష్టమైపోయింది. ఆర్థిక సంక్షోభం, నిరుద్యోగం, ఆకలి, అవిద్య, అనారోగ్యాల నుండి ప్రజలను రక్షించే సామర్ధ్యాన్ని పెట్టుబడిదారీ వ్యవస్థ పూర్తిగా కోల్పోయింది. అన్ని రకాల సాధన సంపత్తులూ ఉన్నా కరోనా మహమ్మారి నుండి ప్రజలను రక్షించలేక కొమ్ములు తిరిగిన పెట్టుబడిదారీ దేశాలన్నీ చతికిలబడిపోయాయి. దీనికి భిన్నమైన దృశ్యం నేడు మనకు సోషలిస్టు దేశాల్లో కనిపిస్తోంది. చైనా, వియత్నాం, క్యూబాలు ప్రజలను కరోనా నుండి రక్షించడమే కాదు ఆర్థిక వ్యవస్థలను గాడిలో పెట్టి ప్రజల జీవన ప్రమాణాలను కాపాడుతున్నాయి.
        ఇంతలోనే ఎంత మార్పు ! బెర్లిన్‌ గోడ పడగొట్టామనీ, అక్టోబర్‌ సోషలిస్టు విప్లవాన్ని అంతం చేశామనీ పెట్టుబడిదారీ ప్రపంచం సంబరాలు చేసుకుని మూడు దశాబ్దాలు కాలేదు. ఇంతలోనే ప్రపంచం గిర్రున తిరిగి బయలుదేరిన చోటుకే చేరుకుంటోంది.
ఎరిక్‌ హాబ్స్‌బామ్‌ చెప్పినట్లు 20వ శతాబ్దంలో ప్రపంచం తీవ్ర పరిణామాలను చూసింది. రెండు ప్రపంచ యుద్ధాలు, అణుబాంబు ప్రయోగాలు, అంతరిక్ష ప్రయాణాలు, కంప్యూటర్లు, ఇంటర్‌నెట్‌, సెల్‌ఫోన్లు... మానవ జీవిత విధానంలోనే పెనుమార్పులు తెచ్చాయి.
                                                    అక్టోబరు సోషలిస్టు విప్లవం
        వీటన్నిటి లోకీ 1917లో రష్యాలో జరిగిన అక్టోబరు సోషలిస్టు విప్లవం మానవ సమాజంలో తెచ్చిన మార్పులు మహత్తరమైనవి. పెట్టుబడిదారీ సామ్రాజ్యవాద యుద్ధాన్ని రష్యాలో విప్లవ పోరాటంగా మలిచి ప్రపంచంలో తొలి కష్టజీవుల రాజ్యానికి లెనిన్‌ రహదారి వేయగా...ఆ దారిలో సోషలిజం నిర్మాణాన్ని చేపట్టాడు స్టాలిన్‌. యుద్ధం తరువాత భూగోళం మీద ఒక కొత్త సామాజిక వ్యవస్థ-సోషలిస్టు వ్యవస్థ పుట్టుకొచ్చింది. వెనుకబడిన రష్యాలో సోషలిజం సాధించిన విజయాలు, దానివల్ల రష్యన్‌ శ్రామిక వర్గానికి సమకూరిన సౌకర్యాలు చూసి ప్రపంచ వ్యాపితంగా కష్టజీవులు ఉత్తేజం పొందారు. అనేక పెట్టుబడిదారీ దేశాల్లో కార్మికులు విప్లవ పోరాటాల బాట పట్టారు. వలస దేశాల్లో ప్రజానీకం ఉవ్వెత్తున విముక్తి ఉద్యమాలకు ఉపక్రమించారు. 1929 మహా మాంద్యం ప్రపంచ పెట్టుబడిదారీ వ్యవస్థను కృంగదీస్తే అదే సమయంలో ప్రణాళికా బద్దమైన నిర్మాణంతో సోషలిస్టు సోవియట్‌ అభివృద్ధి లోనూ, శ్రామిక సంక్షేమం లోనూ అద్భుతాలు సాధించింది. దేశంలో నిరుద్యోగం లేకుండా చేసింది. ప్రజలందరికీ ఉచితంగా విద్య, వైద్యం, గృహ సదుపాయాలు అందించింది. దున్నుకునే ప్రతి ఒక్కరికీ భూమి పంచి ఇచ్చింది. వెనుకబడిన రష్యాను సోషలిజం అన్ని రంగాల్లోనూ అభివృద్ధి పథంలో పెట్టింది.
          అటువంటి పరిస్థితుల్లో ప్రపంచాన్ని పునర్విభజన చేసుకోడానికి సామ్రాజ్యవాదులు ప్రారంభించిన రెండవ ప్రపంచ యుద్ధం భూగోళాన్ని మరో భయంకరమైన వినాశనం లోకి నెట్టింది. ప్రపంచాధిపత్యం సాధించడానికి ఫాసిజాన్ని ఆశ్రయించిన జర్మనీ ఈ భూమ్మీద ఉన్న ఏకైక సోషలిస్టు రాజ్యాన్ని కబళించడానికి పూనుకున్నప్పుడు సోవియట్‌ ఎర్రసేన, ఆ దేశ ప్రజానీకం చూపిన తెగువ, చేసిన త్యాగాలూ అనుపమానమైనవి. ఫాసిజంపై సోవియట్‌ విజయం రెండవ ప్రపంచ యుద్ధానికి ముగింపు పలకడమే కాదు భూమ్మీద మూడో వంతు ప్రజలు, ఆరోవంతు భూభాగం దోపిడీ, పీడనల నుండి విముక్తి చెంది సోషలిజం మార్గం అనుసరించడానికి కారణమైంది. వలస దేశాల్లో స్వాతంత్రోద్యమాలు ఉవ్వెత్తున లేచి, విజయాలు సాధించాయి. పెట్టుబడిదారీ దేశాలు కూడా తమ దేశాల్లోని కార్మికవర్గానికి అనేక రక్షణలు, సంక్షేమాలు కల్పించాల్సి వచ్చింది.
          ఇంతటి గొప్ప విజయాలు సాధించిన సోషలిజం సోవియట్‌ యూనియన్‌లో, తూర్పు యూరపు దేశాల్లో అనేక కారణాల వల్ల కుప్పకూలి పోవడంతో సామ్రాజ్యవాదం మళ్లీ ఎదురుదాడిని ముమ్మరం చేసింది. ఐఎంఎఫ్‌, ప్రపంచ బ్యాంకు, డబ్ల్యుటిఓ లను ఆయుధాలుగా చేసుకుని ప్రపంచంపై నయా-ఉదారవాద ప్రపంచీకరణను రుద్దింది. పెట్టుబడిదారీ పండితులు సోషలిజం పైనా, ఆ భావజాలానికి అంకితమై ఉన్నవారి పైనా విపరీతమైన ప్రచారదాడి ప్రారంభించారు. ''చరిత్ర అంతం'' అయిపోయిందన్నారు. పెట్టుబడిదారీ ప్రజాస్వామ్యం పరిఢవిల్లి, ధరణి సుస్థిరాభివృద్ధితో, సుఖశాంతులతో తులతూగుతుందని చెప్పారు.
                                           ముప్పయ్యేళ్ల తరువాత పరిస్థితి ఏమిటి ?
          నయా-ఉదారవాద ప్రపంచీకరణ నేడు తీవ్ర సంక్షోభంలో పడింది. ప్రపంచవ్యాపితంగా ఆర్థిక అసమానతలు పెరిగాయి. ఆర్థిక మాంద్యానికి కరోనా మహమ్మారి తోడు కావడంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు మరింత దెబ్బతిన్నది. 2020లో ప్రపంచ జిడిపి - 5.2 శాతం పడిపోతుందని, ప్రపంచ వాణిజ్యం 30 శాతం పతనమవుతుందని, 3.5 నుండి 6 కోట్ల ప్రజలు అదనంగా నిష్టదారిద్య్రం లోకి దిగజారిపోతారని, 15.8 కోట్ల నుండి 24.2 కోట్ల ఉద్యోగాలు పోతాయని, కార్మికుల ఆదాయాలు 1.2 లక్షల కోట్ల నుండి 1.8 లక్షల కోట్ల డాలర్ల మధ్య పడిపోతాయని అంతర్జాతీయ సంస్థలు అంచనా వేశాయి. మెజారిటీ ప్రజానీకపు ఈతిబాధలు ఇలా ఉండగా, 2020 మార్చి 23 నుండి మే 23 మధ్య ప్రపంచం లోని 25 మంది అత్యధిక ధనవంతుల ఆస్తులు మరో రూ.20 లక్షల కోట్ల వరకు పెరిగిపోయాయని ఫోర్బ్స్‌ పత్రిక తెలిపింది.
          పెట్టుబడిదారీ సంక్షోభం ప్రపంచ వ్యాపితంగా ఉద్రిక్తతలను పెంచుతోంది. బాల్టిక్‌, ఇరాక్‌, ఆప్ఘనిస్థాన్‌ యుద్ధాలు, అనేక దేశాల్లో అంతర్యుద్ధాలు, విపరీతమైన వలసలు, దేశాల మధ్య ఉద్రిక్తతలతో భూగోళం కల్లోలంగా మారింది. సంక్షోభం నుండి ప్రజల దృష్టిని మళ్లించడానికి పాలక వర్గాలు మితవాద జాత్యహంకార విధానాల వైపు మొగ్గడంతో అగ్నికి ఆజ్యం పోసినట్లు ఈ కల్లోలం మరింతగా విస్తరిస్తోంది.
         తన చుట్టూ ప్రపంచం తిరుగుతోందని విర్రవీగిన అమెరికన్‌ సామ్రాజ్యవాదం ప్రస్తుత నయా-ఉదారవాద ప్రపంచీకరణ సృష్టించిన సంక్షోభానికి పరిష్కారం చూపించలేక అది చేతులెత్తేసింది. జి-7 దేశాల కూటమి వల్లా కాలేదు. అమెరికా, బ్రిటన్‌ ఒకవైపూ, జర్మనీ, ఫ్రాన్స్‌ మరోవైపూ చేరి ఈ కూటమిని కలహాల కుంపటిగా మార్చేశాయి. దాంతో 'బ్రిక్స్‌' సహా అనేక దేశాలను కలుపుకుని జి-20 కూటమిని ఏర్పాటు చేశారు. ఇది సంక్షోభాన్ని నివారించలేకపోగా ఇప్పుడు అదే సంక్షోభంలో పడింది. కూటమిలోని దేశాధినేతలు ఒకరి ముఖాలు ఒకరు చూసుకునే పరిస్థితే లేదు. ఐక్యరాజ్య సమితి, ప్రపంచ ఆరోగ్య సంస్థ సహా అంతర్జాతీయ సంస్థలన్నీ విబేధాల వేదికలుగా మారిపోతున్నాయి. ఎందులోనూ ఏకాభిప్రాయం లేదు. సోషలిస్టు చైనా ఎదుగుదలను నివారించడానికి అమెరికా తీసుకుంటున్న చర్యలు ప్రపంచాన్ని మరో ప్రచ్ఛన్న యుద్ధం వైపు నడుపుతోంది. వ్యవస్థ పతనావస్థకు వచ్చినప్పుడు సంక్షోభాలు రానురాను మరింత తీవ్రంగా, నియంత్రించ వీలులేని విధంగా తయారవుతాయి. అందుకే ఇప్పుడు పోప్‌ నుండి పెట్టుబడిదారీ పండితుల వరకు మార్క్స్‌ వైపు చూడాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రస్తుత ప్రపంచ సంక్షోభాన్ని మార్క్స్‌ చెప్పిన విశ్లేషణ రీత్యా కాకుండా మరో విధంగా అర్ధం చేసుకోవడం కష్టం. ఎందుకంటే బ్రిటిష్‌ లేబర్‌ పార్టీ నాయకుడు జెరెమీ కార్బిన్‌ చెప్పినట్లు పెట్టుబడిదారీ వ్యవస్థను అత్యంత ప్రతిభావంతంగా విశ్లేషించిన ఏకైక మేధావి కారల్‌ మార్క్స్‌. రానురాను మరింత సామాజికంగా జరుగుతున్న ఉత్పత్తిని ప్రయివేటు పరం కాకుండా సమాజపరం చేయడమే సంక్షోభాలకు పరిష్కారమని మార్క్స్‌ చెప్పాడు. ఉత్పత్తి సమాజపరం గావాలంటే ఉత్పత్తి సాధనాలు సమాజపరం కావాలి. మహనీయుడు లెనిన్‌ రష్యన్‌ విప్లవం ద్వారా చేసింది అదే. ప్యారిస్‌ కమ్యూన్‌లో విప్లవం ద్వారా ఏర్పడిన మొట్టమొదటి కార్మిక రాజ్యం మూడు మాసాల్లోనే కూలి పోయింది. దాన్నుండి ప్రపంచ కమ్యూనిస్టు ఉద్యమం అనేక గుణపాఠాలు నేర్చుకుంది. కొత్త సూత్రాలను కనుగొంది. వాటిని లెనిన్‌ రష్యా లోని నిర్దిష్ట పరిస్థితులకు నిర్దిష్టంగా వర్తింపచేయడం ద్వారా సోషలిజం నిర్మాణానికి కొత్త బాటలు వేశాడు. అయితే అక్కడ 70 ఏళ్ల సోషలిజం నిర్మాణంలో జరిగిన లోపాలు ఆ వ్యవస్థ విచ్ఛిన్నానికి దారితీశాయి. అంత మాత్రాన ప్రపంచంలో సోషలిజం మరణించలేదు. అక్టోబరు విప్లవ ప్రభావం అంతమైపోలేదు. సోషలిజం ప్రభావం వల్లనే వలసవాద దోపిడీ అంతమైంది. మూడో ప్రపంచ దేశాలు స్వతంత్ర దేశాలైనాయి. నేటికీ స్వతంత్ర దేశాలుగా కొనసాగుతూనే వున్నాయి. నేటి చైనాలో, క్యూబాలో, వియత్నాం, ఉత్తర కొరియా, లావోస్‌లలో అది బతికే ఉంది. కరోనా మహమ్మారి కాలంలో సైతం శత కోటీశ్వరుల సంపదలు పెరిగి సామాన్యులు మరింత పేదరికం వైపు జారిపోవడం పెట్టుబడిదారీ వ్యవస్థలో నేడు కానవస్తున్న చిత్రం. దానికి పూర్తి భిన్నంగా కరోనాను కట్టడి చేసి ప్రజలను ఆదుకుని తిరిగి ఆర్థిక పురోగతి దిశగా అడుగులు పడడం సోషలిస్టు దేశాలలో మనకు దర్శనమిస్తున్న ప్రత్యామ్నాయం. ప్రపంచ వ్యాపితంగా పెట్టుబడిదారీ వ్యవస్థ భారాలకు వ్యతిరేకంగా జరుగుతున్న ప్రజా పోరాటాలు సజీవంగా వర్థిల్లుతున్న అక్టోబర్‌ విప్లవ స్ఫూర్తికి నిదర్శనాలు. నేడు సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న మానవాళికి మార్గం చూపే దీపాలు.

ఎస్‌. వెంకట్రావు

s.venkatrao