ఉద్యమాలు బలోపేతం : అక్టోబరు విప్లవ దినోత్సవంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు
- రాష్ట్ర కార్యాలయంలో పతాకావిష్కరణ
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : అక్టోబరు విప్లవ స్ఫూర్తితో ప్రజా ఉద్యమాలను మరింత బలోపేతం చేయాలని, పెట్టుబడిదారీ విధానాలకు వ్యతిరేకంగా పోరాటాలను పెద్దఎత్తున నిర్వహించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. అక్టోబరు విప్లవ దినోత్సవం సందర్భంగా సోమవారం ఉదయం సిపిఎం రాష్ట్ర కార్యాలయంలో ఆయన అరుణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పెట్టుబడిదారీ, భూస్వామ్య విధానాలకు వ్యతిరేకంగా రష్యాలో ఏర్పడిన కమ్యూనిస్టు ప్రభుత్వం ప్రపంచ దేశాలకు స్పేస్, న్యూక్లియర్, స్టీలు పరిశ్రమలు, రక్షణ పరికరాలకు సంబంధించి పరిశ్రమలు ఏర్పాటు చేయడంలో ఎంతో సహకారం అందించిందని వివరించారు. యుద్ధాలను నేడు ధైర్యంగా ఎదుర్కొంటున్నామంటే అది రష్యా యుద్ధ విమానాలలు, రక్షణ పరికరాల ద్వారానే సాధ్యమైందన్నారు. పెట్టుబడిదారుల కుట్రతో రష్యా ప్రభుత్వం కూలిపోవడంతో దాని ప్రభావం అనేక దేశాలపై పడిందన్నారు. రష్యా సహకారంతో నడుస్తున్న వ్యవస్థలన్నీ దెబ్బతిన్నాయన్నారు.
పెట్టుబడిదారుల సహకారంతో మన దేశంలో అధికారంలోకి వచ్చిన మతోన్మాద బిజెపి ప్రజల స్వాతంత్య్రాన్ని హరిస్తోందని చెప్పారు. కమ్యూనిజం ఇంకా ఎక్కడుందంటూ ప్రశ్నించేవారు బ్రెజిల్ వంటి దేశాలను చూడాలన్నారు. పెట్టుబడి దారులు ఎన్ని కుట్రలు చేసినా వాటన్నింటిని తిప్పికొట్టి అక్కడ కమ్యూనిస్టులు అధికారంలోకి వచ్చారన్నారు. అప్పట్లో అమెరికాకు రష్యా ఛాలెంజ్‌గా ఉండేదని, నేడు కమ్యూనిస్టు ఛైనాను చూసి అమెరికా భయపడుతోందని అన్నారు. మూడో ప్రపంచ దేశాల్లో కమ్యూనిస్టులు అధికారంలోకి వస్తున్నారని చెప్పారు. ఆ స్ఫూర్తితోనే మన దేశంలోనూ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని అన్నారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్.బాబూరావు మాట్లాడుతూ ప్రజా ఉద్యమాల బలోపేతం చేయడం కమ్యూనిస్టుల ప్రధాన కర్తవ్యంగా ఉండాలన్నారు. పెట్టుబడిదారీ దేశాల్లో ఆర్థిక మాంద్యం పెరిగిందని, వరుస వైఫల్యాలు వస్తున్నాయని చెప్పారు. దీన్నుంచి బయటపడేందుకు యుద్ధాలకు ప్రోత్సాహమిస్తోందన్నారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం కూడా సామ్రాజ్యవాదుల సృష్టేనని పేర్కొన్నారు. పెట్టుబడిదారీ వికృతరూపం మన దేశంలో మతోన్మాదం, జాతి ఉన్మాదం రూపంలో పెరుగుతోందన్నారు. ప్రజల్లో పెరుగుతున్న అసమానతలకు వ్యతిరేకంగా పోరాడటం ద్వారానే అభివృద్ధివైపు వెళ్లగలమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు దోనేపూడి కాశీనాథ్, జె.జయరాం, కె.హరికిషోర్ తదితరులు పాల్గన్నారు.










