Feb 02,2023 22:20

మధ్యప్రదేశ్‌ లక్ష్యం 245, ప్రస్తుతం 56/0
ఇండోర్‌: మధ్యప్రదేశ్‌తో జరుగుతున్న రంజీట్రోఫీ క్వార్టర్‌ఫైనల్లో ఆంధ్రప్రదేశ్‌ జట్టు గెలుపు అవకాశాలు సన్నగలిల్లాయి. తొలి ఇన్నింగ్స్‌లో ఆధిక్యత లభించినప్పటికీ.. రెండో ఇన్నింగ్స్‌లో ఆంధ్రప్రదేశ్‌ జట్టు 93పరుగులకే ఆలౌట్‌ కావడంతో గెలుపు అవకాశాలు సన్నగిల్లాయి. దీంతో 245పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన మధ్యప్రదేశ్‌ జట్టు మూడోరోజు ఆట ముగిసే సమయానికి వికెట్లేమీ నష్టపోకుండా 56పరుగులు చేసింది. ఓవర్‌ నైట్‌ స్కోర్‌ 4వికెట్ల నష్టానికి 144 పరుగులతో గురువారం తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన మధ్యప్రదేశ్‌ జట్టు 228పరుగులకు ఆలౌటైంది. లోయర్‌ ఆర్డర్‌ బ్యాటర్స్‌ ఆవేశ్‌ ఖాన్‌(15), కార్తికేయ(24) మాత్రమే రెండంకెల స్కోర్‌ చేశారు. పృథ్వి రాజ్‌కు ఐదు, శశికాంత్‌కు మూడు, నితీశ్‌, లలిత్‌కు ఒక్కో వికెట్‌ దక్కాయి. దీంతో ఆంధ్రప్రదేశ్‌ జట్టుకు 151పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యత లభించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన ఆంధ్రప్రదేశ్‌ జట్టు మధ్యప్రదేశ్‌ బౌలర్ల ధాటికి 93పరుగులకే కుప్పకూలింది. అశ్విన్‌ హెబ్బర్‌(35) టాప్‌ స్కోరర్‌. గాయపడ్డ ఆంధ్ర కెప్టెన్‌ హనుమ విహారి చివరి వికెట్‌గా బరిలోకి దిగి ఒంటిచేత్తో చేస్తూ.. 15పరుగులతో రాణించాడు. ఆవేశ్‌ ఖాన్‌కు నాలుగు, కార్తికేయ, గౌరవ్‌ యాదవ్‌కు మూడేసి వికెట్లు దక్కాయి. దీంతో ఆంధ్రప్రదేశ్‌ జట్టు 245పరుగుల లక్ష్యాన్ని మాత్రమే మధ్యప్రదేశ్‌ ముందుంజ గలిగింది. మూడోరోజు ఆట ముగిసే సమయానికి మధ్యప్రదేశ్‌ జట్టు వికెట్లేమీ నష్టపోకుండా 58పరుగులు చేసింది. యశ్‌ దూబే(24), హిమాన్షు(31) క్రీజ్‌లో ఉన్నారు.
విహారి మరోసారి ఒంటి చేత్తో..
ఆవేశ్‌ ఖాన్‌ బౌలింగ్‌లో గాయపడి, మణికట్టు ఫ్రాక్చర్‌కు గురైన ఆంధ్ర జట్టు కెప్టెన్‌ విహారి.. రెండో ఇన్నింగ్స్‌లోనూ బ్యాటింగ్‌కు దిగాడు. తొలి ఇన్నింగ్స్‌లో 27పరుగులు చేసిన విహారి.. గురువారం ఆంధ్రజట్టు 76 పరుగులకే 9 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ దశలో మరోసారి బరిలోకి దిగాడు. సింగిల్‌ హ్యాండ్‌తో బ్యాటింగ్‌ చేస్తూ 15పరుగులు జోడించి ఆఖరి వికెట్‌గా వెనుదిరిగాడు. ఈ ఇన్నింగ్స్‌లో 16 బంతులు ఎదుర్కొన్న ఆంధ్ర కెప్టెన్‌.. ఒంటి చేత్తో బ్యాట్‌ను కత్తిలా దూస్తూ 3 బౌండరీలు బాదడం మ్యాచ్‌ మొత్తానికే హైలైట్‌గా నిలిచింది.
ఇతర క్వార్టర్‌ఫైనల్స్‌..
జార్ఖండ్‌ : 173, 162/7
బెంగాల్‌ : 328