Mar 22,2023 12:52
  • నిధులు మంజూరైన ప్రారంభం కాని పనులు
  • మడ్డువలస ప్రాజెక్టు నిర్వహణపై స్పష్టత కరువు
  • నీటి మట్టం తగ్గడంతో తాగునీటి పథకానికి ఆటంకం

ప్రజాశక్తి - వంగర (విజయనగరం) : దాదాపు 40 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించాలనే ఉద్దేశంతో 20 ఏళ్ల క్రితం ప్రారంభించిన మడ్డువలస ప్రాజెక్టు ప్రధాన గేట్లు పూర్తిగా మరమ్మత్తులకు గురయ్యాయి. దీంతో ప్రభుత్వం ఆరు నెలల క్రితం రూ.1.60 కోట్ల నిధులను మంజూరు చేసింది. అయినప్పటికీ నేటికీ మరమ్మతు పనులు ప్రారంభం కాలేదు. కనీసం ఎప్పుడు ప్రారంభిస్తారు కూడా తెలియని పరిస్థితుల్లో యంత్రాంగం పనిచేస్తోంది. గేట్లు మరమ్మతుల కు గురికావడంతో నీరంతా లీకులు రూపంలో బయటకు వృధాగా పోతుంది. ఫలితంగా ప్రాజెక్టు నీటిమట్టం తగ్గింది. దీంతో ప్రాజెక్ట్‌ని ఆనుకొని మగ్గూరు వద్ద ఉన్న రక్షిత మంచినీటి పథకానికి నీరు అందకపోవడంతో వంగర మండలంతో పాటు రేగిడి మండలంలో గల కొన్ని గ్రామాల కు తాగునీటి సరఫరా నిలిచిపోయింది. మరమ్మతు పనులు చేపడితే తప్ప లీకులు అరికట్టే పరిస్థితి ఉండదనీ, నిధు లున్నా పనులు ఎందుకు చేయడంలేదని ఆయా గ్రామాల ప్రజలు అధికారుల నిర్వహణ తీరుపై మండిపడుతున్నారు.
 

                                                                       ఇదీ పరిస్థితి

మండలంలోని గొర్లె శ్రీరాములు నాయుడు మడ్డు వలస ప్రాజెక్టుకు 11 ప్రధాన గేట్లు ఉన్నాయి. ఇందులో సుమారు ఎనిమిది గేట్లు వరకు కూడా రోప్స్‌, సీల్స్‌, గేట్లు పెయింటింగ్‌లు పూర్తిగా పాడైపోవడంతో ప్రాజెక్టులో ఉన్న సాగునీరు అంతా కూడా దిగువకు వృధాగా పోతుంది. వరదల సమయంలో గేట్లు ఎత్తాలన్నా దించాలన్నా అధికా రులకు ఇబ్బందిగా ఉంటుంది. గేట్లును బాగుచేయక పోవ డంతో ప్రాజెక్టు తీర గ్రామాల ప్రజలు ఇబ్బంది పడుతున్నా రని ప్రభుత్వం నిధులు మంజూరు చేసినప్పటికీ అధికారు లు మాత్రం పనులు ప్రారంభించక మీనమేషాలు లెక్కిస్తున్నారు.
 

                                                         40వేల ఎకరాలకు సాగునీరు

ఈ ప్రాజెక్టు నుంచి విజయనగరం జిల్లాలో గల వంగర, రేగిడి, సంతకవిటి మండలాలతో పాటు శ్రీకాకుళం జిల్లాలో గల పొందూరు, జి.సిగడాం, లావేరు, రణస్థలం మండలాల్లోని సుమారు 40వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు వెళ్తుంది. ఇంత పెద్ద ప్రాజెక్టుకు సంబంధించిన పనులు ఎప్పుడు ప్రారంభించి ఎప్పటికీ పూర్తి చేసి సాగునీరు అందిస్తారో ఎవరికి తెలియని పరిస్థితి.
 

                                                                  45 రోజులు సమయం..

మరమ్మత్తు పనులు చేయాలంటే ప్రాజెక్టులో ఉన్న మొత్తం నీటినంతటిని ఖాళీ చేసి పనులు పూర్తి చేసేసరికి 45 రోజులు సమయం పడుతుందని అధికారులే చెబుతున్నారు. ప్రస్తుతం మర్చి నెల పూర్తి కావస్తుంది. పనులు ప్రారంభించినా మే నెల చివరి వరకు జరిగే అవకాశం ఉంది. ఏప్రిల్‌, మే నెలల్లో తుఫానులు వరదలు వచ్చే అవకాశం ఎక్కువ ఉన్నందున పనులు కూడా ఆటంకం కలిగే అవకాశం ఉంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఫిబ్రవరిలోనే పనులు ప్రారంభిస్తే ఏప్రిల్‌ నాటికి పూర్తయ్యే అవకాశం ఉండేది. ఆరు నెలల క్రితం నిధులు మంజూరైన ప్పటికీ మరమ్మత్తు పనులు చేసేందుకు అధికారులు ఎందుకు ఇంత జాప్యం చేస్తున్నారని అధికారులు తీరుపై రైతులు సైతం మండిపడుతున్నారు. కాగా పనులు త్వరితగతన ప్రారంభించక పోతే నిధులు కూడా వెనక్కి వెళ్ళిపోతాయేమోనని రైతులు ఆందోళణ చెందుతున్నారు.
 

                                                          ప్రాజెక్టు ప్రస్తుత నీటి పరిస్థితి

65 మీటర్లు లెవెల్‌ నీటిమట్టనిగాను ప్రాజెక్టులో ప్రస్తుతం 60.68 మీటర్లు లెవెల్‌ నీటిమట్టం ఉందని, సువర్ణముకి, వేగావతి నదుల నుంచి 219 క్యూ సెక్కులు నీరు మాత్రమే వస్తుందని, కుడి ఎడమ కాలువలుతో పాటు ప్రధాన గేట్లు మూసివేసినట్లు ప్రాజెక్ట్‌ అధికారి తెలిపారు.
 

                                                                 తాగునీటికి ఆటంకం

మడ్డువలస ప్రాజెక్టులో ఉన్న నీటిని ఎప్పుడూ లేనంతగా కుడి కాలువ ద్వారా ఈ ఏడాది కిందికి విడిచిపెట్టడం, అధిక లీకులు వల్ల ప్రాజెక్టులో ఉన్న నీరు భారీగా తగ్గిపోయింది. దీంతో ప్రాజెక్టుకి ఆనుకొని మగ్గూరులో ఉన్న రక్షిత మంచినీటి పథకానికి నీరు అందక వంగర మండలంతో పాటు రేగిడి మండలంలో గల కొన్ని గ్రామాలకు తాగునీరు రక్షిత మంచినీటి పథకం ద్వారా వెళ్లే తాగునీరు నిలిచిపోవడంతో ఆయా గ్రామాల ప్రజలు మండిపడుతున్నారు.
 

                                             పనులు ప్రారంభిస్తాం : నర్మదా పట్నాయక్‌, డిఇ

మడ్డవలస ప్రాజెక్టు గేట్లు మరమ్మతులకు సంబంధించి ఇప్పటికే టెండర్లు పూర్తి అయ్యాయి. ఏప్రిల్‌ నెలలో పనులు ప్రారంభిస్తాం, కాంట్రాక్టర్‌ కూడా ప్రాజెక్టు వద్దకు వచ్చి చూసి వెళ్లారు.