Sep 26,2023 21:06

ప్రజాశక్తి- చింతలపూడి (ఏలూరు జిల్లా), మేడికొండూరు (గుంటూరు జిల్లా) :రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో పిడుగుపాటుకు మంగళవారం నలుగురు మృతి చెందారు. పోలీసుల కథనం ప్రకారం... గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం మందపాడుకు చెందిన 12 మంది మహిళా కార్మికులు అదే గ్రామంలోని పొలంలో మిర్చి నాట్లు వేస్తున్నారు. ఆ సమయంలో వర్షంతోపాటు పిడుగుపడడంతో దొడ్డ సువార్త (45), బిల్లా ప్రభావతి (22) అక్కడికక్కడే మృతి చెందారు. ఏలూరు జిల్లా లింగపాలెం మండలం తుమ్మండ్రుగూడేనికి చెందిన ముగ్గురు మహిళలు తమ సొంత పొలంలో పనిచేస్తుండగా ఆ సమయంలో వర్షం కురవడంతో సమీపంలోని చెట్టు కిందకు వెళ్లి తలదాచుకున్నారు. ఆ చెట్టుపై పిడుగుపడడంతో తీవ్రంగా గాయపడిన వారి ముగ్గురినీ స్థానికులు 108 అంబులెన్స్‌లో చింతలపూడి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వారిలో సొంగా దేవమాత (50), సొంగా మనీషా (20) అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్థారించారు. జ్యోత్స్న పరిస్థితి విషమంగా ఉండడంతో ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు.