పాట్నా : బీహార్‌లో విషాదం చోటు చేసుకుంది. గత 24 గంటల్లో పిడుగులు పడి 18 మందికి పైగా మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. వీరిలో రోహ్తాస్ జిల్లాలో ఐదుగురు, ఆర్వాల్‌లో నలుగురు, సరన్‌లో ముగ్గురు, ఔరంగాబాద్, ఈస్ట్ చంపరాన్ జిలాల్లో ఇద్దరు, బంక, వైశాలి జిల్లాలో ఒక్కొక్కరు మృత్యువాత పడ్డారు. బాధిత కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున నష్టపరిహారాన్ని ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రకటించారు. ఈ ఘటనలతో విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో నివసించే ప్రజలు వర్షం కురుస్తున్నప్పుడు వ్యవసాయ క్షేత్రాల్లోకి వెళ్లవద్దని, చెట్లు, విద్యుత్ స్తంభాల దగ్గర నిలబడవద్దని, పట్టణ ప్రాంతాల్లో నివసించే ప్రజలు వర్షం సమయంలో కిటికీలకు దూరంగా ఉండాలని, రిఫ్రిజిరేటర్లు, ఏసీలు వంటి ఎలక్ట్రికల్ పరికరాలను తాకవద్దని, అలాగే భవనాల పైకప్పులపైకి వెళ్లవద్దని హెచ్చరించింది.










