Mar 12,2023 08:54
  • భారీగా తగ్గిన రబీ సాగు
  • గతేడాది కంటే ఆరు లక్షల ఎకరాలు తక్కువ

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి- అమరావతి : ఈ తడవ రబీ సాగు విస్తీర్ణం బాగా పడిపోయింది. సీజన్‌ సాధారణ సాగులో పది లక్షల ఎకరాలకుపైన బీడు పడింది. ఖరీఫ్‌లో వర్షాభావం, తుపాన్లు, వరదల వలన సేద్యం తగ్గడం కద్దు. ఆ లోటు రబీలో భర్తీ అవుతుంది. కానీ ఎన్నడూ లేని విధంగా ఈ మారు రబీలో లక్షలాది ఎకరాలు సాగు లేక ఖాళీ పడ్డాయి. రబీలో ఆహార ధాన్యాల సాగు ఎక్కువ. అందులోనూ వరి, పప్పుధాన్యాలు అధికంగా సాగు చేస్తారు. ఈ సారి ఆ పంటలు పది లక్షల ఎకరాల్లో సాగు కాలేదు. ప్రధాన ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు బానే ఉన్నాయి. భూగర్భ జలాలకు కొరత లేదు. అయినప్పటికీ రబీ సాగు భారీగా తగ్గడానికి పంటలకు గిట్టుబాటు ధరలు లేమి, వ్యవసాయ ఉత్పాదకాల ధరలు, పెట్రోలు, డీజిల్‌ ఛార్జీలు, కల్తీ, నకిలీ విత్తనాలు, ప్రకృతి విపత్తులు, వరి సాగుపై ప్రభుత్వ ఆంక్షలు, రైతులకు సర్కారు నుంచి అంతగా లభించని తోడ్పాటు... ఇత్యాది కారణాల వలన రబీ సాగు తగ్గిందని, రైతులు అనాసక్తి చూపారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
 

                                                                      ఆది నుంచీ నెమ్మదే

రబీ ప్రారంభం నుంచీ సాగు ఒక అడుగు ముందుకు రెండడుగులు వెనక్కి అన్న చందంగా నడిచింది. మామూలుగా ఫిబ్రవరి చివరాఖరుకి సీజన్‌ ముగుస్తుంది. మార్చిలో నీటి వనరులున్న ప్రాంతాల్లో వరి నాట్లు వేస్తారు మార్చి 9 నాటికి మొక్కజొన్న, కుసుమలు, పొద్దుతిరుగుడు వంటి చిన్న చితకా పంటలు తప్ప తతిమ్మావన్నీ ఈ సారి తగ్గాయి. రబీలో 58 లక్షల ఎకరాల్లో పంటల సాగును ప్రభుత్వం టార్గెట్‌గా పెట్టుకుంది. సీజన్‌ నార్మల్‌ 57.30 లక్షల ఎకరాలు. ఇప్పటికి 46.52 లక్షల ఎకరాల్లో పంటలు వేశారు. దాదాపు 10.78 లక్షల ఎకరాల్లో (19 శాతం) సాగు లేదు. గతేడాది కంటే సుమారు 6.95 లక్షల ఎకరాల్లో సేద్యం తగ్గింది.
 

                                                                      తిండి గింజలు సైతం

ఆహార ధాన్యాలు 10.05 లక్షల ఎకరాల్లో (19 శాతం) తగ్గాయి. వరి 17 శాతం, ముతక ధాన్యాలు 7 శాతం, పప్పుధాన్యాలు 25 శాతం తగ్గాయి. ముతక ధాన్యాల్లో మొక్కజొన్న మాత్రం నార్మల్‌కు మించి 18 శాతం ఎక్కువ సాగైంది. సజ్జ, రాగి, చిరుధాన్యాలు తక్కువ సాగయ్యాయి. రబీలో వరికి సమానంగా పప్పుధాన్యాలు సాగు చేస్తారు. కాగా ఈ మారు వాటి సాగు పడిపోయింది. పప్పుల్లో ఎక్కువ సాగు చేసే శనగ సైతం ఈ సారి తగ్గింది. 30 శాతం విస్తీర్ణంలో శనగ సాగు కాలేదు. కర్నూలు, నంద్యాల, కడప, అనంతపురం, ప్రకాశం, గుంటూరులో శనగ సాగు బాగా తగ్గింది. మినుములు 17 శాతం, పెసలు 33 శాతం తగ్గాయి. రబీలో నూనెగింజల సాగు తక్కువ. అందులోనూ 14 శాతం సాగు కాలేదు.

11