Oct 13,2023 08:18
  • తెలుగు తమ్ముళ్లలో అంతర్మథనం

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : బిజెపితో కలిసే అంశంపై టిడిపిలో అంతర్మథనం మొదలైంది. కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో టిడిపి ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ బుధవారం భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ భేటీలో చంద్రబాబు అరెస్టు, కేసులతోపాటు పొత్తు అంశం కూడా చర్చకు వచ్చినట్లు సమాచారం. బిజెపితో పొత్తుపై టిడిపి నేతలు అయోమయంలో ఉన్నారు. చంద్రబాబును రాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేసి నిర్బంధించిందని, ఆ సమయంలో రాజ్యాంగపరంగా కేంద్రం సాయం చేస్తుందని వేచి చూశామని, కానీ ఎలాంటి స్పందన రాలేదని ఆ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అరెస్టుపై అమిత్‌షాను కలిసేందుకు లోకేష్‌ ఢిల్లీలో శతవిధాలా ప్రయత్నించారని, కనీసం పట్టించుకోలేదని పార్టీ నేతలు చెబుతున్నారు. ఇప్పుడు తన ప్రయోజనం కోసం బిజెపి పొత్తు అంశం తెరపైకి తీసుకొచ్చిందని అంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆ పార్టీతో కలిస్తే కొన్ని తరగతుల వారు పార్టీకి దూరమవుతారనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వంపై ఎస్‌సి, ఎస్‌టి, మైనార్టీ వర్గాల ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని టిడిపి నేతలు అంటున్నారు. లౌకిక పార్టీగా పార్టీకి పేరు ఉందని, పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గతంలో కూడా లౌకికవాదానికే కట్టుబడి నిర్ణయాలు తీసుకున్నారని గుర్తు చేస్తున్నారు. బిజెపితో కలిస్తే లౌకికవాదం అనే పదానికి సార్థకత ఉండదని భావిస్తున్నారు. బిజెపి అధికారంలో ఉన్న మణిపూర్‌లో మారణకాండను ప్రస్తావిస్తున్నారు. రాష్ట్రంలో కర్నూలు, గుంటూరు, కృష్ణా, కడప, ప్రకాశం జిల్లాల్లో మైనార్టీలు ఎక్కువగా ఉన్నారు. ఉత్తరాంధ్రలో గిరిజనులు అధికంగా ఉన్నారు. కోస్తా జిల్లాల్లో క్రిస్టియన్ల ప్రభావం ఉంటుంది. బిజెపితో కలిస్తే ఈ సెక్షన్ల ప్రజలు పార్టీకి దూరమవుతారనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి చేయలేదనే ఆగ్రహం రాష్ట్ర ప్రజల్లో ఉందంటున్నారు. విభజన హామీలు, ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు, వెనుకబడిన జిల్లాల ప్రత్యేక ప్యాకేజీ వంటి హామీలను పదేళ్ల నుంచి నెరవేర్చడం లేదనే అసంతృప్తి ప్రజల్లో ఉందంటున్నారు.
           చంద్రబాబు అరెస్టుకు కేంద్ర ప్రభుత్వం మద్దతు కూడా ఉందని అభిప్రాయం తెలుగు తమ్ముళ్లలో ఉంది. కేవలం తెలంగాణ ఎన్నికల్లో ప్రయోజనం పొందేందుకే బిజెపి పొత్తు అంశాన్ని తెరపైకి తీసుకొస్తుందని అంటున్నారు. ఆ రాష్ట్రంలో ఉన్న టిడిపి కార్యకర్తలను, ఆంధ్ర సెటిలర్ల ఓట్ల ద్వారా ఎన్నికల్లో గెలిచేందుకు ప్రయత్నిస్తోందని చెబుతున్నారు. బిజెపితో పొత్తు లేకుండా ఎన్నికలకు వెళ్తేనే ప్రజలు ఆదరిస్తారనే భావన వ్యక్తం చేస్తున్నారు.