Sep 26,2023 21:49
  •  యుటిఎఫ్‌ స్వర్ణోత్సవ జాతాలో నాయకులు

ప్రజాశక్తి- యంత్రాంగం : నూతన విద్యావిధానం (ఎన్‌ఇపి)తో పేదలు విద్యకు దూరమవుతారని, దీనికి వ్యతిరేకంగా పోరాడాలని యుటిఎఫ్‌ నాయకులు కోరారు. విద్యాసంస్కరణలకు వ్యతిరేకంగా కార్యక్రమాలు రూపొందించుకొని పోరాటాలు చేయాలన్నారు. యుటిఎఫ్‌ స్వర్ణోత్సవాల్లో భాగంగా అనంతపురంలో ప్రారంభమైన బైక్‌ జాతా ప్రకాశం జిల్లాకు, ఇచ్ఛాపురంలో ప్రారంభమైన జాతా డాక్టర్‌ బిఆర్‌.అంబేద్కర్‌ కోనసీమ జిల్లాల్లో మంగళవారం కొనసాగింది.
ప్రకాశం జిల్లా మార్కాపురం, పొదిలి మీదుగా చీమకుర్తికి జాతా చేరుకుంది. చీమకుర్తిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల సెంటర్‌లో యుటిఎఫ్‌ జెండాను ఆవిష్కరించిన అనంతరం యుటిఎఫ్‌ రాష్ట్ర గౌరవాధ్యక్షులు కొమ్మోజు శ్రీనివాసరావు మాట్లాడారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం నుంచి వస్తున్న సవాళ్లను ఎదుర్కొంటూ ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. జాతీయ విద్యావిధానం రద్దు, సిపిఎస్‌ రద్దు, పాత పెన్షన్‌ సాధన కోసం, విద్యాసంస్కరణలకు వ్యతిరేకంగా కార్యక్రమాలు రూపొందించుకొని పోరాటాలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ యాబై ఏళ్ల కాలంలో సాధించుకున్న హక్కులు ప్రపంచీకరణ నేపథ్యంలో ఒకొక్కటి కనుమరుగవుతున్నాయన్నారు. వీటిని నిలబెట్టుకోవడం, కొత్త హక్కులు సాధించడం, ఉద్యమ ప్రధాన కర్తవ్యంగా తీసుకోవాలన్నారు. ఒంగోలు జిల్లా కార్యాలయం వద్ద యుటిఎఫ్‌ పతాకాన్ని సీనియర్‌ నాయకులు ఆదినారాయణ ఆవిష్కరించారు. జాతాకు మద్దతుగా ఒంగోలు నగరంలో ఉపాధ్యాయులు బైక్‌ ర్యాలీ నిర్వహించారు.
కోనసీమ జిల్లాల్లో రామచంద్రపురం, మండపేట, కొత్తపేట, రావులపాలెం, అమలపురం, రాజోలు వరకూ సాగింది. ఈ జాతాకు యుటిఎఫ్‌ ఆధ్వర్యంలో నాయకులు, ఉపాధ్యాయులు స్వాగతం పలికారు. మండపేట, రావులపాలెం, కొత్తపేట, అమలాపురంలో నిర్వహించిన సభలో యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షులు డివి.రాఘవులు, ప్రధాన కార్యదర్శి కెఎస్‌ఎస్‌.ప్రసాద్‌ మాట్లాడారు. సిపిఎస్‌ రద్దు కోసం జరిగే ఉద్యమాల్లో అందరూ భాగస్వాములు కావాలని కోరారు. యుటిఎఫ్‌ రాష్ట్ర కోశాధికారి బి.గోపిమూర్తి, రాష్ట్ర కార్యదర్శి లక్ష్మి రాజా, తదితరులు పాల్గొన్నారు.