Mar 14,2023 20:43

ముంబయి: టీమిండియా మిడిలార్డర్‌ బ్యాటర్‌ శ్రేయస్‌ అయ్యర్‌ ఆస్ట్రేలియాతో జరిగే మూడు వన్డేల సిరీస్‌కు దూరమయ్యాడు. ఆసీస్‌తో జరిగే మూడు వన్డేల సిరీస్‌కు బిసిసిఐ ప్రకటించిన 18మంది జట్టు సభ్యుల జాబితాలో చోటు దక్కించుకున్న శ్రేయస్‌.. టెస్ట్‌ సిరీస్‌లో గాయపడడమే ఇందుకు కారణం. బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీలో భాగంగా నాల్గో టెస్ట్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్న దశలో భుజం నొప్పితో బాధపడ్డ శ్రేయస్‌ ఆట మధ్యలోనే మైదానాన్ని వీడాడు. దీంతో శ్రేయస్‌ బెంగళూరులోని నేషనల్‌ క్రికెట్‌ అకాడమీలో డాక్టర్ల పర్యవేక్షణకు వెళ్లనున్నాడు. ఎన్‌సిఏలోని వైద్యబృందం శ్రేయస్‌ ఫిట్‌నెస్‌పై నివేదికను బుధవారం బిసిసిఐకి సమర్పించనుంది. ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్‌ మార్చి 17నుంచి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. మార్చి 31నుంచి ఇండియన్‌ ప్రిమియర్‌ లీగ్‌(ఐపిఎల్‌) ప్రారంభం కానుండగా.. ఫిట్‌నెస్‌ సాధించని పక్షంలో కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌ కెప్టెన్‌ను కోల్పోయినట్లే!