వాషింగ్టన్ : భారత్‌లో తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘనలు జరుగుతున్నాయని అమెరికా ప్రభుత్వ నివేదిక ఒకటి పేర్కొంది. చట్ట విరుద్ధంగా, ఏకపక్షంగా కొందరిని లక్ష్యంగా చేసుకోవడం, పత్రికా స్వేచ్ఛపై ఆంక్షలు, మైనార్టీ లపై హింస పరంగా 2022లో భారత్‌లో పెద్ద ఎత్తున మానవ హక్కుల ఉల్లంఘన చోటు చేసుకుందని నివేదిక వెల్లడించింది. 'వార్షిక మానవ హక్కుల నివేదిక'ను విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ సోమవారం విడుదల చేశారు. 'భారత్‌లో ఏ స్థాయిలోనూ అధికార దుర్వినియో గానికి జవాబుదారీతనం లేదు. అలసత్వం, సుశిక్షితులైన పోలీసు అధికారుల కొరత, తగినన్ని వనరులు లేక సతమతమవుతున్న న్యాయవ్యవస్థ వల్ల తక్కువమందికే శిక్షలు పడుతున్నాయి. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని పోలీసులు కొందరిని హతమారుస్తుండడం, జైళ్లలో చిత్రహింసలు పెట్టడం, అమానవీయంగా వ్యవహరించడం వంటివి చోటు చేసుకుంటున్నాయి. జైళ్లలో పరి స్థితులు దారుణంగా ఉంటున్నాయి. ఏకపక్షంగా కొందరిని నిర్బంధిస్తున్నారు. గోప్యతలో చొరబడు తున్నారు. పత్రికా స్వేచ్ఛకు ఆంక్షలు విధిస్తున్నారు. అన్యాయంగా అరెస్టులు చేస్తున్నారు. పాత్రికేయుల్ని ప్రాసిక్యూట్ చేస్తున్నారు. ఇంటర్నెట్ స్వేచ్ఛపైనా ఆంక్షలు విధిస్తున్నారు. ఇలాంటి ఎన్నో ఉల్లంఘ నలు చోటు చేసుకుంటున్నాయి' అని నివేదిక పేర్కొంది. వివిధ దేశాల్లో హక్కుల ఉల్లంఘనల గురించి దీనిలో పొందుపరిచారు. రష్యా, చైనా, ఇరాన్, ఉత్తర కొరియా, మయన్మార్ వంటి ఇతర దేశాల్లోని పరిస్థితులనూ నివేదిక తెలిపింది.










