న్యూఢిల్లీ: సీనియర్ టెన్నిస్ ఆటగాడు రోహన్ బొప్పన్నకు అరుదైన గౌరవం దక్కింది. త్వరలో జరిగే ఆసియా క్రీడల్లో భారత బృందానికి ఫ్లాగ్ బేరర్‌గా ఎంపికయ్యాడు. ఈ విషయాన్ని ఆలిండియా టెన్నిస్ అసోసియేషన్(ఎఐటిఏ) మంగళవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. అలాగే ఆసియా క్రీడల్లో పాల్గొనే 12మంది టెన్నిస్ ఆటగాళ్ల పేర్లను ఐటా ఆ ప్రకటనలో తెలిపింది. పురుషుల బృందంలో సుమిత్ నాగల్, శశికుమార్ ముకుంద్, డేవిస్ కూపర్, రామ్‌కుమార్ రామ్‌నాథన్, యుకీ బాంబ్రీ, సాకెత్ మైనేనితోపాటు 43ఏళ్ల రోహన్ బొప్పన్న కూడా ప్రాతినిధ్యం వహించనున్నాడు. ఇక మహిళల బృందంలో గత ఆసియా క్రీడల సింగిల్స్ విభాగంలో కాంస్య పతకం నెగ్గిన అంకిత రైనాతోపాటు కర్మన్ కౌర్ థండి, రుతురాజ్ భోస్లే, సహజ యామలపాటి, వైదేహి, చౌదరి, ప్రథానే ఎంపికైనట్లు ఐటా ఆ ప్రకటనలో తెలిపింది. 2018 జకార్తా వేదికగా జరిగిన ఆసియా క్రీడల్లో భారత టెన్నిస్ బృందం ఒక స్వర్ణ పతకంతోపాటు రెండు కాంస్య పతకాలను సాధించింది. అలాగే సింగిల్స్ విభాగంలో ప్రజ్ఞేష్ గుణ్ణేశ్వరన్ కాంస్య పతకం సాధించాడు. మాజీ భారత టెన్నిస్ ఆటగాడు రోహిత్ రాజ్‌పాల్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. మహిళల బృందానికి అంకిత భాంబ్రీ కెప్టెన్‌గా ఎంపికైంది. ఈమేరకు ఐటా ఛైర్మన్, సెలెక్షన్ కమిటీ సభ్యులు నందన్ బాల్ మంగళవారం ఓ ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు. ఇక చైనాలోని హాంగ్జూ వేదికగా సెప్టెంబర్ 23నుంచి ఆసియా క్రీడలు జరగనున్నాయి.










