- పాకల తొలగింపును అడ్డుకున్న రైతులు
ప్రజాశక్తి - శ్రీకాకుళం ప్రతినిధి:శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం నారాయణపురం భూముల్లోకి మరోసారి రియల్ మాఫియా చొరబడేందుకు ప్రయత్నించింది. భూముల్లో రైతులు వేసుకున్న పశువుల పాకలను తొలగించేందుకు శనివారం జెసిబితో అదే గ్రామానికి చెందిన గాడు రామారావు, పిలక జయకృష్ణ అక్కడకు చేరుకున్నారు. పోలీసుల సమక్షంలోనే పాకలు తొలగించేందుకు ప్రయత్నించారు. విషయం తెలుసుకున్న నారాయణపురం భూ సాగు హక్కుదారుల సంఘం నాయకులు టి.నందోడు, కె.అప్పన్న, పుట్టా మల్లేషు, జె.సీతారాం, రైతులు, గ్రామస్తులు అధిక సంఖ్యలో చేరుకుని పాకలను తొలగించడాన్ని అడ్డుకున్నారు. దీంతో వారు జెసిబిని వదిలి పారిపోయారు. ఎచ్చెర్ల ఎస్‌ఐ వి.సత్యనారాయణ ఘటనా స్థలానికి చేరుకుని భూములపై కోర్టు కేసు నడుస్తోందని, పాకలను తొలగించాలని రైతులను హెచ్చరించారు. తరతరాలుగా భూముల్లో తాము సాగు చేసుకుంటున్నామని, కేసులేమీ లేవని రైతులు బదులిచ్చారు. రైతుల సమాధానంపై ఎస్‌ఐ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. అనంతరం రియల్ ఎస్టేట్ మాఫియాపై రైతులు, రైతులపై రియల్ ఎస్టేట్ మాఫియా ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నాయి.










