ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలంలో నారాయణపురం భూములను సాగుచేసుకుంటున్న దళిత, బలహీన తరగతుల రైతులకే అప్పగించాలని సిపిఎం రాష్ట్ర నాయకులు పి మధు కోరారు. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి శనివారం ఆయన లేఖ రాశారు. నారాయణపురం రెవెన్యూ పరిధిలోని సుమారు 200 ఎకరాల భూమిని తరతరాలుగా చిలకపాలెం గ్రామానికి చెందిన ఎస్‌సి, బిసి కుటుంబాలకు చెందిన రైతులు సాగు చేసుకుంటున్నారని వివరించారు. 1904లో అందవరపు గోవిందరాజులు కుటుంబం ఇనాముదారుల నుంచి 28 ఎకరాల ఇనాము భూమిని కొనుగోలు చేసినట్లు రెవెన్యూ రికార్డుల్లో ఉందని తెలిపారు. మిగిలిన 171 ఎకరాల భూమి రైతుల సాగులోనే ఉన్నట్లు 2005 వరకు రెవెన్యూ అడంగళ్‌లో రికార్డు ఉందని పేర్కొన్నారు. అందవరపు కుటుంబ వ్యక్తులు, కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు, రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై రాజకీయ పలుకుబడిని ఉపయోగించి అడంగళ్ నుంచి రైతుల పేర్లను తొలగించారని పేర్కొన్నారు. వారి పేర్లతో పాస్ పుస్తకాలు సృష్టించారని వివరించారు. రైతులకు అండగా ఉండాల్సిన అధికారులు, పోలీసులు కబ్జాదారులకే కొమ్ము కాస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తమ భూములను కాపాడాలని రైతులు 190 రోజులుగా నిరసనలు, నిరాహార దీక్షలు చేస్తూ ఎంఆర్‌ఒ కార్యాలయం వద్ద ఆందోళన చేస్తున్నారన్నారు. పోలీసుల అండతో కబ్జాదారులు ఆ భూముల్లో ఉన్న జీడి, టేకు, నీలగిరి తోటలను బుల్డోజర్లతో తొక్కించేశారని వివరించారు. అడ్డుకున్న రైతులు, మహిళలు, చిన్న పిల్లలను సైతం 100 మందిని అరెస్టు చేసి దూర ప్రాంతాల్లోని పోలీస్ స్టేషన్లకు తరలించారని అన్నారు. ఈ ఘటనపై జోక్యం చేసుకుని సాగు చేసుకుంటున్న రైతులకే భూములు చెందేలా పట్టాలు ఇప్పించాలని సిఎంను కోరారు. తొలగించిన తోటలకు నష్టపరిహారం చెల్లించేలా చర్యలు తీసుకోవాలన్నారు. దురాక్రమణలకు పాల్పడుతున్న రియల్ ఎస్టేట్ వ్యాపారులపై, తప్పుడు పత్రాలను సృష్టించడానికి సహకరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు.










