ప్రజాశక్తి- యు.కొత్తపల్లి, పెద్దాపురం:యాసలపు సూర్యారావు ఆశయ సాధన కోసం చేసే కృషిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని మాజీ ఎంపి పి.మధు అన్నారు. సైకిల్ మెకానిక్‌గా జీవితాన్ని ప్రారంభించిన సూర్యారావు కమ్యూనిస్టుగా, కార్మిక నేతగా, పాత్రికేయునిగా, ప్రజాప్రతినిధిగా, కవిగా రాణించారన్నారు. యాసలపు సూర్యారావు 11 వర్ధంతి సందర్భంగా గురువారం కాకినాడ జిల్లా పెద్దాపురంలోని యాసలపు సూర్యారావు భవనంలో సిపిఎం మండల కార్యదర్శి నీలపాల సూరిబాబు అధ్యక్షతన 'తొమ్మిదేళ్ల బిజెపి పాలన - తీరు తెన్నులు' అనే అంశంపై జరిగిన సదస్సులో ఆయన మాట్లాడారు. తొమ్మిదేళ్ల బిజెపి పాలనలో మతోన్మాదం, కార్పొరేట్లకు ఊడిగం చేయటం తప్ప ఏమీ లేదన్నారు. ప్రభుత్వ రంగాన్ని ఒక్కొక్కటిగా కార్పొరేట్లకు దారాదత్తం చేస్తున్నారని తెలిపారు. రకరకాల పేర్లతో పన్నులు వేస్తూ ప్రజలపై భారాలు మోపుతున్నారని విమర్శించారు. విభజన హామీలు ఒక్కటి కూడా అమలు కాలేదన్నారు. దేశ ప్రజల ఐక్యత మధ్య చిచ్చుపెట్టే బిజెపి పాలనకు రానున్న ఎన్నికల్లో చరమగీతం పాడాలని ప్రజలను కోరారు. ఈ సదస్సులో సిపిఎం కాకినాడ జిల్లా కన్వీనర్ ఎం.రాజశేఖర్, నాయకులు పాల్గొన్నారు.
సుబ్బిరెడ్డి మరణం సెజ్ రైతులకు తీరని లోటు
పెనుమల్లు సుబ్బిరెడ్డి అకాల మరణం సెజ్ రైతులకు తీరని లోటు అని పి.మధు అన్నారు. కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి మండలం రమణక్కపేటకు చెందిన సెజ్ పోరాట కమిటీ నాయకులు సుబ్బిరెడ్డి ఇటీవల అకాల మరణం పొందారు. ఆయన కుటుంబాన్ని పి.మధు పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సెజ్ రైతుల సమస్యలపై సుబ్బిరెడ్డి చేసిన పోరాటం మరువలేనిదన్నారు. ఆ పోరాటం వల్లే సెజ్‌కు తీసుకున్న పదివేల ఎకరాల్లో రెండు వేల ఎకరాలను తిరిగి ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించిందని గుర్తు చేశారు.










