Mar 17,2023 21:50

- న్యాయమే గెలిచింది: పి మధు
ప్రజాశక్తి - భీమవరం (పశ్చిమగోదావరి జిల్లా) :గరగపర్రు దళితుల పక్షాన నిలబడి పోరాటం చేస్తే పెత్తందారులు అక్రమ కేసులు పెట్టారని, అయినా దళితులకు అండగా నిలబడ్డామని, చివరకు న్యాయ పోరాటమే గెలిచిందని సిపిఎం మాజీ ఎంపి పి.మధు అన్నారు. గరగపర్రు ఉద్యమంలో సిపిఎం, ప్రజాసంఘాల నాయకులపై పెట్టిన అక్రమ కేసును పశ్చిమగోదావరి జిల్లా భీమవరం కోర్టు శనివారం కొట్టేసింది. మధుతోపాటు సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మంతెన సీతారాం, రాష్ట్ర కమిటీ సభ్యులు దడాల సుబ్బారావు, జిల్లా కార్యదర్శి బలరాం, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు జెఎన్‌వి.గోపాలన్‌, చింతకాయల బాబూరావు, నేతలు కె.శ్రీనివాస్‌, జక్కంశెట్టి సత్యనారాయణ, అల్లూరి అరుణ్‌, పి.మంగరాజు, బివి.వర్మ, పి.సుధీర్‌, శ్రీరామ్‌, రామకృష్ణ శుక్రవారం కోర్టుకు హాజరయ్యారు. 2017లో గరగపర్రు దళితులు రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌ విగ్రహాన్ని గ్రామంలో చెరువు గట్టుపై ఏర్పాటు చేశారన్న కారణంతో దళితులను పెత్తందారులు సాంఘిక బహిష్కరణ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సిపిఎం, ప్రజా సంఘాల నాయకులు దళితులకు అండగా నిలిచి ఉద్యమించారు. దీంతో సిపిఎం, ప్రజాసంఘాల నాయకులపై పెత్తందారులు, భూస్వాములు అక్రమ కేసులు బనాయించారు. 2017 నుంచి నేతలు కోర్టు వాయిదాలకు హాజరవుతూ వచ్చారు. దళితుల పక్షాన పోరాటం చేశారని గుర్తించిన కోర్టు అక్రమ కేసును కొట్టివేసింది. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ గరగపర్రు దళితులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ హామీలు అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. అంబేద్కర్‌ విగ్రహం ఏర్పాటు విషయంలో సాంఘిక బహిష్కరణ అంశాన్ని జాతీయ వ్యాప్త ఉద్యమంగా మలిచి, దళితుల పక్షాన పోరాడినట్లు తెలిపారు. ఈ పోరాటంలో సిపిఎం, ప్రజాసంఘాలు, ఇతర స్వచ్చంద సంస్థలు, దళిత సంఘాలు ప్రధాన పాత్ర పోషించాయన్నారు. ఆ పోరాటం ఫలితంగా నాటి ప్రభుత్వం గరగపర్రు దళితులకు అనేక హామీలు ఇచ్చిందన్నారు. అయితే నేటికీ ఆ హామీలు పూర్తిస్థాయిలో అమలుకాలేదని తెలిపారు. మంతెన సీతారాం మాట్లాడుతూ ఎన్ని నిర్బంధాలు ప్రయోగించినా నిజమైన, న్యాయమైన సమస్య పట్ల పేదలకు అండగా ఉంటామని, వాటిపట్ల నికరంగా నిలబడతామని అన్నారు. దళితులు, సామాన్య ప్రజల సమస్యలపై తమ పోరాటం కొనసాగిస్తామని తెలిపారు.