Feb 03,2023 21:23

ప్రజాశక్తి- పాడేరు (అల్లూరి సీతారామరాజు జిల్లా):అల్లూరి సీతారామరాజు జిల్లాలో గిరిజనులకు తీవ్ర నష్టం చేసే హైడ్రో పవర్‌ ప్రాజెక్టుల ప్రతిపాదనలను విరమించుకోకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని రాజ్యసభ మాజీ సభ్యులు, ఎపి రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పి.మధు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. హైడ్రో పవర్‌ ప్రాజెక్టుల వ్యతిరేకోద్యమ బహిరంగ సభ చింతపల్లి మండలం ఎర్రవరం గ్రామంలో ఎపి గిరిజన సంఘం ఆధ్వర్యాన శుక్రవారం జరిగింది. హైడ్రో పవర్‌ ప్రాజెక్టు నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ ఎర్రవరం వద్ద ఆ ప్రాంతంలోని పలు గ్రామాల గిరిజనులు తొలుత ర్యాలీ నిర్వహించారు. వీటితోపాటు మధు ఈ ర్యాలీలో పాల్గన్నారు. హైడ్రో ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ పార్టీలకతీతంగా కదిలివచ్చిన వైసిపి, టిడిపి, సిపిఎం, సిపిఐ ప్రజాప్రతినిధులు, పలు ప్రజాసంఘాల నాయకులతో ఆయన మాట్లాడారు. ముక్తకంఠంతో అందరూ ఒక్కటిగా నిలవడం హైడ్రో వ్యతిరేక ఉద్యమం నైతిక విజయమని ఈ సందర్భంగా మధు వ్యాఖ్యానించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు జిల్లాలోని అటవీ ప్రాంతంలో హైడ్రో పవర్‌ ప్రాజెక్టుల ఏర్పాటుకు గిరిజన చట్టాలకు విరుద్ధంగా అదానీకి, ప్రయివేట్‌ సంస్థలకు అనుమతి ఇవ్వడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. దేశంలోని ప్రజల సకల సంపదలనూ అదానీకి కట్టబెట్టడానికి మోడీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శించారు. విశాఖలోని గంగవరం పోర్టును అదానీ ఇప్పటికే స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. విమానయానాన్ని, అడవులను, సముద్రాన్ని అదానీకి పాలకులు కట్టబెడుతున్నారని విమర్శించారు. ఎర్రవరం హైడ్రో పవర్‌ ప్రాజెక్టు కింద రెండు డ్యాములు కట్టబోతున్నారని, దీనివల్ల 15 వేల ఎకరాల భూములు, 21 గ్రామాలు ముంపునకు గురవుతాయని, సుమారు వంద గ్రామాల్లో 1500 గిరిజన కుటుంబాల జీవనాధారానికి ముప్పు వాటిల్లనుందని తెలిపారు. నాడు బాక్సైట్‌ జోలికొస్తే గిరిజనులు పాలకులను ఎలా తరిమికొట్టారో సిఎం జగన్మోహన్‌రెడ్డి తెలుసుకోవాలన్నారు. ఆదివాసీ అధికార్‌ రాష్ట్రీయ మంచ్‌ జాతీయ కార్యవర్గ సభ్యులు పి.అప్పలనర్స, జిల్లా నాయకులు బోనంగి చిన్నయ్య పడాల్‌, వైసిపి, సిపిఐ, టిడిపి స్థానిక ప్రజాప్రతినిధులు ఉల్లి సత్యనారాయణ, ఎస్‌.సోమరాజు వరలక్ష్మి, సత్తిబాబు తదితరులు పాల్గన్నారు.
రాజధానిపై మోసపూరిత ప్రకటనలు
అమరావతిని అభివృద్ధి చేయలేక, తాజాగా విశాఖ రాజధాని అని, అక్కడే తాను కూడా మకాం పెడతానని ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్మోహన్‌రెడ్డి ప్రకటిస్తున్నారని మధు విమర్శించారు. దీనిని జనం నమ్మే పరిస్థితుల్లో లేరని తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇప్పటికైనా ప్రజలను మభ్య పెట్టకుండా మూడు రాజధానులకు స్వస్తి చెప్పాలని హితవు పలికారు.