- 11 మందికి తీవ్రగాయాలు.. ఇద్దరి పరిస్థితి విషమం
ప్రజాశక్తి-మార్టూరు రూరల్ : ప్రకాశం జిల్లా మార్టూరులో మంగళవారం వేకువజామున రజకులపై పెత్తందారులు దాడి చేశారు.ఈ ఘటనలో 11మంది గాయపడ్డారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసుల వివరాల మేరకు.. మార్టూరు ఆర్‌టిసి బస్టాండ్ ఎదురుగా జాతీయరహదారికి అనుకోని ఉన్న చాకలి మాన్యంలో సర్వే నంబర్ 603-సిలోని 4.50 ఎకరాల్లోని స్థలంపై పూర్తి హక్కులు తమవేనంటూ రజక సామాజికవర్గానికి చెందిన కుటుంబాలు తమ వద్ద ఉన్న డాక్యుమెంట్లతో అధికారులు చుట్టూ తిరుగుతున్నారు. అయితే అంతకు ముందే అందులో నివాసం ఉంటున్న మరికొంతమంది స్థానికులు ఈ స్థలం తమకే చెందుతుందని తమ వద్ద ఉన్న డాక్యుమెంట్లను అధికారులకు చూపించడంతో రెండు గ్రూపుల మధ్య కొన్ని రోజులుగా వివాదం నడుస్తోంది. రజక సామాజిక వర్గంలోని ఏడు కుటుంబాలకు చెందిన 40 మంది ఈ చాకలి మాన్యంలో ఆరు నెలలుగా తాత్కాలిక నివాసాలు ఏర్పరుచుకొని తమ కుటుంబాలతో నివసిస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం వేకువజామున సుమారు 30 మంది రౌడీలతో ఆరుబయట నిద్రపోతున్న రజకులపై పెత్తందారులు విచాక్షణారహితంగా దాడి చేశారు. 11 మంది తలలకు తీవ్ర గాయాలయ్యాయి. ఓ బాలికపై దాడి చేశారు. పారిపోతున్న ముగ్గురు రౌడీలను రజకులు అదుపులోకి తీసుకొని పోలీసులకు సమాచారమిచ్చారు. తీవ్రంగా గాయపడ్డ బెల్లంకొండ మణిబాబు, ముక్తిపాటి సాంబశివరావు, బెల్లంకొండ ప్రసాద్, ముక్తిపాటి సాయిబాబా, బెల్లంకొండ సుబ్బారావు, తొమ్మిదో తరగతి విద్యార్థిని ముక్తిపాటి శిరీషా, వృద్ధ దంపతులైన బెల్లంకొండ వెంకటేశ్వర్లు, రేణుక, బండి శంకర్రావు, నరేంద్రను స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. వీరిలో మణిబాబు, సాయిబాబా పరిస్థితి విషమంగా ఉంది. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.










