Aug 16,2023 20:44
  • నిందితులపై హత్యాయత్నం, అట్రాసిటీ కేసు : ఎస్‌పి

ప్రజాశక్తి-ఒంగోలు బ్యూరో/ బాపట్ల : ప్రకాశం జిల్లా దర్శి మండలంలో దళిత కుటుంబంపై దాడికి పాల్పడిన వారిపై హత్యాయత్నం, ఎస్‌సి, ఎస్‌టి అట్రాసిటీ కేసులు నమోదు చేసి.. అరెస్టు చేసినట్లు ఎస్‌పి మల్లికగర్గ్‌ తెలిపారు. ఈ మేరకు కేసు వివరాలను ఆయన బుధవారం మీడియాకు వెళ్లడించారు. బొట్లపాలెం గ్రామానికి చెందిన బ్రహ్మారెడ్డి కుమార్తె భార్గవి, అదే గ్రామానికి చెందిన దళిత యువకుడు సాయిరాం ఈ ఏడాది మార్చిలో ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ వివాహన్ని బ్రహ్మారెడ్డి కుటుంబీకులు అంగీకరించలేదు. ఈ క్రమంలో సాయిరాం కుటుంబంపై బ్రహ్మారెడ్డి కుటుంబ సభ్యులు దాడి చేశారు. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు ఇరువురి కుటుంబ సభ్యులను స్టేషన్‌కు పిలిచి మాట్లాడారు. గొడవలు పడొద్దని సర్ధిచెప్పారు. సోమవారం రాత్రి సాయిరాం సోదరి కామునూరి మౌనిక ఇంటికి సమీపంలోని కుళాయి వద్ద నీళ్లు పట్టుకునే సమయంలో బ్రహ్మారెడ్డి, ఆయన భార్య పుల్లమ్మ దాడి చేశారు. కళ్లలో కారం చల్లారు. కాళ్లతో తన్నుతూ.. కర్రలతో కొట్టుకుంటూ లాక్కెళ్లారు. మౌనిక తల్లి అడ్డుకోగా ఆమెపైనా దాడి చేశారు. మాపైనే కేసులు పెడతారా? అంటూ కత్తితో పొడవబోయారు. అంతటితో ఆగకుండా పెట్రోలు పోసి చంపాలనే యత్నం చేశారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి వారిని అడ్డుకున్నారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. దాడికి పాల్పడిన బ్రహ్మారెడ్డి, ఆయన భార్య పుల్లమ్మను అరెస్టు చేసి కేసులు నమోదు చేసినట్లు ఎస్‌పి వెల్లడించారు. దళిత కుటుంబంపై దాడికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తూ కెవిఎస్‌, ఐద్వా ఆధ్వర్యంలో దర్శిలోని అంబేద్కర్‌ విగ్రహం నుంచి గడియారస్తంభం సెంటర్‌ వరకు నిరసన ప్రదర్శన చేశారు. అనంతరం అక్కడ ధర్నా నిర్వహించారు. బాధిత కుటుంబానికి రక్షణ కల్పించాలని కోరారు.

స్వాతంత్య్ర వేడుకల వేళ దళితులపై దాడులు  : సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు రమాదేవి

స్వాతంత్ర వేడుకలు జరుపుకుంటున్న తరుణంలో దళిత మహిళలపై పెత్తందారులు దాడికి పాల్పడటం పట్ల సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు డి.రమాదేవి ఆందోళన వ్యక్తం చేశారు. బాపట్ల జిల్లా పుచ్చలపల్లి సుందరయ్య ప్రజాసంఘాల కార్యాలయంలో ఆమె బుధవారం విలేకరులతో మాట్లాడారు. ప్రకాశం జిల్లా దర్శిలో దళిత మహిళలపై ఓ దంపతులు విచక్షణారహిరంగా దాడికి పాల్పడ్డారన్నారు. కళ్లలో కారం కొట్టి.. కత్తులతో దాడి చేశారని తెలిపారు. దళితులకు, ఒంటరి మహిళలకు అండగా నిలవాల్సిన ప్రభుత్వం వారి రక్షణను గాలికి వదిలేసిందని విమర్శించారు. కర్నూలు జిల్లా కోసిగి మండలంలో పొలం పనులు ముగించుకుని ఇంటికి వస్తున్న మహిళపై ఐదుగురు సామూహిక అత్యాచారం చేశారని తెలిపారు. ఈ తరహా కేసుల పరిష్కారానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చట్టం చేయాలని డిమాండ్‌ చేశారు.