- 27 ఏళ్లుగా కోర్టులో కొలిక్కిరాని కేసు
ప్రజాశక్తి - రామచంద్రపురం(డాక్టర్ బిఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా) : రాష్ట్రంలో సంచలనం కలిగించిన శిరోముండనం కేసులో బాధితుడు పువ్వల వెంకటరమణ (49) ఆదివారం మృతి చెందాడు. ఇటీవల ఆయన అనారోగ్యానికి గురయ్యాడు. పరిస్థితి విషమించడంతో మృతి చెందాడు. వెంకటరమణ కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఆయనకు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు.
డాక్టర్ బిఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా వెంకటాయపాలెం గ్రామానికి చెందిన వెంకటరమణ శిరోముండనం బాధితుల్లో ఒకడు. 1996 డిసెంబర్ 29న వెంకటాయపాలెంలో అప్పటి ఎమ్మెల్యే, ప్రస్తుతం ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులుపై శిరోముండనం కేసు నమోదైంది. ఈ కేసులో దళితులు చల్లపూడి పట్టాభి, కోటి చినరాజు, దడాల వెంకటరత్నం, తనికెళ్ల గణపతి, పువ్వుల వెంకటరమణ బాధితులుగా ఉన్నారు. ఈ కేసు 27 ఏళ్లుగా కోర్టు పరిధిలో ఉంది. వైసిపి సర్కారు వచ్చిన తరువాత బాధితులకు కుల ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేయాలని నిర్ణయించింది. అయితే అనంతరం జరిగిన రాజకీయ పరిణామాల్లో తోట త్రిమూర్తులు వైసిపిలో చేరారు. తరువాత అదే పార్టీ నుంచి ఎమ్మెల్సీ పదవి పొందారు. దీంతో ఈ కేసులో మళ్లీ జాప్యం చోటుచేసుకుంది. తోట త్రిమూర్తులు పార్టీలు మారుతూ ప్రభుత్వం అండదండలతో కేసు నుంచి తప్పించుకుంటున్నారని ప్రజా, దళిత సంఘాలు విమర్శిస్తున్నాయి. ఈ కేసులో ఒకరు చనిపోగ మిగతా నలుగురు బతికున్నారు.










