Sep 04,2023 20:17
  •  వైసిపి నేత ఇంటిపై మరో నేత గ్రూపు దాడి

ప్రజాశక్తి-భట్టిప్రోలు (బాపట్ల జిల్లా) : అధికార పార్టీలో గ్రూపుల పోరు తారాస్థాయికి చేరింది. బాపట్ల జిల్లా భట్టిప్రోలు మండలం పల్లికోన గ్రామంలో సోమవారం రాత్రి ఒక గ్రూపు వారు మరో గ్రూపునకు చెందిన వారి బైకులను ధ్వంసం చేయడమే కాకుండా కారు అద్దాలు పగలగొట్టి బీభత్సం సృష్టించారు. గ్రామ పార్టీ అధ్యక్షులు మాజీ ఎంపిటిసి సభ్యులు సేరు శ్రీనివాసరావు, మాజీ గ్రామ సర్పంచ్‌ మండవ రామకోటేశ్వరరావుల మధ్య పార్టీ వ్యవహారాల్లో గత కొన్ని రోజులుగా విభేదాలు నెలకొన్నాయి. పార్టీకి వ్యతిరేకంగా రామకోటేశ్వరరావు, కుమారస్వామి వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ రామకోటేశ్వరావును పార్టీ నుండి తొలగిస్తున్నట్లు ఇటీవల శ్రీనివాసరావు మౌఖికంగా ప్రకటించారు. అప్పటినుండి గ్రామంలో అధికార పార్టీ నాయకుల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఒక దశలో పార్టీని వీడే ఆలోచనలో రామకోటేశ్వరరావు, కుమారస్వామి ఉన్నట్లు ప్రచారం జరిగింది. వీరిని భయపట్టాలనే ఆలోచనతో శ్రీనివాసరావు గ్రూపు సోమవారం రాత్రి కుమారస్వామి ఇంటిముందు ఉన్న నాలుగు బైకులు, ఒక కారును ధ్వంసం చేసిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అడ్డొచ్చిన కుమారస్వామిపై, ఆయన కుటుంబసభ్యులపై కూడా దాడిచేసినట్లు సమాచారం. దీంతో కుమారస్వామి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన గ్రూపుపై కుమారస్వామి దాడి చేశారని శ్రీనివాసరావు కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణారావు రెండు గ్రూపులనూ పిలిపించి.. మాట్లాడారు. ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకుంటే పార్టీకి నష్టం జరుగుతుందని, అన్నీ మర్చిపోయి పార్టీ కోసం పనిచేయాలని సూచించారు.