పోలవరం నిర్వాసితుల పోరుకేక : నెల్లిపాక నుంచి నేడు మహాపాదయాత్ర
- 15 రోజులు 400 కి.మీ
- జులై 4న విజయవాడలో ముగింపు
ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి : పోలవరం నిర్వాసితులు పోరుకేక పెట్టనున్నారు. రాజకీయాలకతీతంగా చేపట్టే ఈ మహాపాదయాత్ర అల్లూరి సీతారామరాజు జిల్లా నెల్లిపాక నుంచి మంగళవారం ప్రారంభం కానుంది. రాష్ట్రానికి జీవనాడిగా పిలవబడుతున్న పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం నిర్వాసితులు తమ సర్వస్వాన్ని త్యాగం చేశారు. అయినా వారికి పునరావాసం కల్పించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మీనమేషాలు లెక్కిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో వారు పాదయాత్రకు కదులుతున్నారు.
జాతీయ ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యత తమదేనంటూ తొలుత ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు పునరావాసంపై మడతపేచీ పెడుతోంది. ప్రాజెక్టు నిర్మాణానికి మాత్రమే నిధులు కేటాయిస్తామని లెక్కలు చెబుతోంది. ప్రాజెక్టులో కీలకమైన నిర్వాసితుల భాగస్వామ్యాన్ని విస్మరించింది. ఈ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించి నిధులు రాబట్టడంలో గత తెలుగుదేశం ప్రస్తుత వైసిపి ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయి. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం తొలి దశ మాత్రమే అంటూ 20 వేల మందికి పునరవాసం అంటూ చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తోంది. ఈ పరిస్థితులలో పోలవరం నిర్వాసితులు రోడ్డెకాల్సి వస్తోంది.
పోలవరం నిర్వాసితుల డిమాండ్లివే
నిర్వాసితులకు పునరావాసం, పరిహారం పూర్తిగా అమలు చేసే వరకు గ్రామాలు ఖాళీ చేయించరాదని మహాపాదయాత్ర డిమాండ్ చేస్తోంది. పది డిమాండ్లను పాలక ప్రభుత్వాల ముందు ఉంచింది. పోలవరం నిర్వాసితులకు పునరావాసం పూర్తయ్యే వరకూ ముంపు గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు యథావిధిగా కొనసాగించాలని కోరుతోంది. 1986, 2022 నాటి వరద ముంపు ఆధారంగా ముంపు గ్రామాల రీ సర్వే చేయాలని, పునరావాసం దశల వారీగా కాకుండా ఏకకాలంలో అన్ని గ్రామాల్లో పూర్తి చేయాలని డిమాండ్ చేస్తోంది. మండలాన్ని యూనిట్‌గా తీసుకొని పునరావాసం, పరిహారం అర్హులందరికీ ఇవ్వాలని, ముంపు మండలాల్లో ప్రభుత్వం స్వాధీనం చేసుకునే ప్రతి ఎకరాకు రూ.20 లక్షలు చెల్లించాలని, ముఖ్యమంత్రి అసెంబ్లీలో ఇచ్చిన హామీ మేరకు ప్రతి నిర్వాసిత కుటుంబానికీ కాంటూరు లెక్కలతో సంబంధం లేకుండా రూ.10.50 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది. జీవో 224 అమలు చేయాలని, గ్రామాలు ఖాళీ చేయించే నాటికి 18 సంవత్సరాలు నిండిన యువతీ, యువకులందరికీ ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది. పెండ్లి అయిన ఆడపిల్లలకు ప్యాకేజీ ఇవ్వాలని, సర్వం కోల్పోతున్న ప్రతి నిర్వాసిత కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని కోరుతోంది. ముంపు ప్రాంతాల ఉద్యోగులందరినీ యథాతధంగా తరలించే ప్రాంతాల్లో కొనసాగించాలని డిమాండ్ చేస్తోంది.
మహా పాదయాత్ర షెడ్యూల్
- ప్రజాశక్తి -ఎటపాక, అల్లూరి సీతారామరాజు జిల్లా
నెల్లిపాక నుంచి మంగళవారం ప్రారంభమయ్యే పాదయాత్ర 15 రోజుల పాటు సాగి జులై 4వ తేదీన విజయవాడ చేరుకుంటుంది. అదే రోజు మహాధర్నాతో ముగుస్తుంది. ఈ పాదయాత్రలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, కార్యదర్శివర్గ సభ్యులు మంతెన సీతారాం, వి.వెంకటేశ్వర్లు పాల్గొంటారు. నెల్లిపాకలో ప్రారంభం రోజున నిర్వహించే భారీ బహిరంగ సభకు ప్రధాన వక్తగా, అఖిల భారత కిసాన్ సభ ప్రధాన కార్యదర్శి విజూ కృష్ణన్, సిపిఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం హజరవుతున్నారు.
చింతూరు డివిజన్‌లో
మహా పాదయాత్ర సాగుతుందిలా...
- 20వ తేదీన - నెల్లిపాక నుంచి మురుమూరు (నెల్లిపాక)
- 21న- మురుమూరు నుంచి టేకులబోరు (కూనవరం)
- 22న - టేకులబోరు నుంచి కూటూరు (కూనవరం)
- 23న -కూటూరు నుంచి ఎర్రంపేట (చింతూరు)
- 24న -ఎర్రంపేట నుంచి రామవరంపాడు (విఆర్.పురం)
- 25న - రామవరంపాడు నుంచి రేఖపల్లి (విఆర్.పురం)
- 26న - రేఖపల్లి నుంచి కూనవరం-రుద్రంకోట (కుకునూరు)










