- డిపిఆర్‌లు సిద్ధం చేస్తున్న ప్రభుత్వం
ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి - అమరావతి : మరోసారి అదానీవైపే రాష్ట్ర ప్రభుత్వం మొగ్గు చూపిస్తోంది. తాజాగా సంప్రదాయేతర ఇంధన వనరులశాఖ.. అదానీ గ్రూపునకు భారీగా ప్రాజెక్టులను అప్పగించింది. ప్రధానంగా మన్యం జిల్లాల్లోని పంప్‌డ్ స్టోరేజీ జల విద్యుత్ పథకాల్లో ఆరు ప్రాజెక్టులను అదానీకి కట్టబెట్టారు. ఈ ప్రాజెక్టుల ద్వారా మొత్తం 5,300 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసేందుకు నిర్ణయించింది. త్వరలోనే ఈ ప్రాజెక్టుల ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు కూడా అనుమతి ఇవ్వనున్నట్లు తెలిసింది. గతేడాది ప్రకటించిన ఎపి పంప్‌డ్ స్టోరేజీ పవర్ ప్రమోషన్ పాలసీలో భాగంగా పలు పథకాలకు కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగానే 22 పథకాలను ఐదు దశల్లో నిర్మించేందుకు నిర్ణయించింది. మరో రెండు పథకాలను పూర్తిగా ప్రైవేటు రంగంలో నిర్మించేందుకు నిర్ణయించింది. వీటి మొత్తం సామర్థ్యం 24,100 మెగావాట్లుగా ఖరారు చేశారు. రెండు పథకాలను మినహాయిస్తే మిగిలిన 22 పథకాల సామర్థ్యం 20,620 మెగా వాట్లుగా ఖరారు చేశారు. ఇందులోనే అదానీ సంస్థకు 5,300 మెగావాట్ల ప్రాజెక్టులు ఖరారు చేశారు. అదానీ సంస్థకు అడ్డగోలుగా ప్రాజెక్టులను అప్పగించడంపై దేశ వ్యాప్తంగా విమర్శలు వస్తున్నప్పటికీ.. మరోసారి రాష్ట్రంలో అదానీ సంస్థకు మరిన్ని ప్రాజెక్టులు అప్పగించడం గమనార్హం. కడప జిల్లాలోని గండికోటలో ఏర్పాటు చేయనున్న వెయ్యి మెగావాట్ల విద్యుత్ కేంద్రం, సత్యసాయి జిల్లాలోని చిత్రావతి, పార్వతీపురం మన్యం జిల్లాలోని కురుకుర్తి, కర్రివలస కేంద్రాలు, అల్లూరి సీతారామరాజు జిల్లా పెదకోట, రైవాడల్లో నిర్మించనున్న విద్యుత్ కేంద్రాలను అదానీకి అప్పగించారు. మరికొన్ని ప్రాజెక్టులను ఇంకా ఎవరికీ అప్పగించకపోవడంతో అవి కూడా భవిష్యత్తులో అదానీ గ్రూపునకే దక్కే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది. అదానీకి కేటాయించిన ప్రాజెక్టుల్లో పెదకోట 1500 మెగావాట్లు సామర్థ్యం కాగా, అదానీకి వెయ్యి మెగావాట్లు కేటాయించారు. రైవాడ కేంద్రం అంచనా సామర్థ్యం 1000 మెగావాట్లు కాగా, ప్రస్తుతం 600 మెగావాట్లు అదానీకి కేటాయించారు. అంటే రానున్న కాలంలో మిగిలిన సామర్థ్యాన్ని కూడా అదానీకే కేటాయించే అవకాశాలు సుస్పష్టంగా కనిపిస్తు న్నాయి. మొత్తం అన్ని ప్రాజెక్టులకూ పూర్తిస్థాయి ప్రాజెక్టు రిపోర్ట్ (డిపిఆర్) లు సిద్ధం చేసేందుకు అధికారులు చర్యలు ప్రారంభించారు. ఆ తరువాతే ఆయా ప్రాజెక్టు మొత్తం అంచనా వ్యయం ఎంతన్నది తేలుతుంద ని అధికారులు చెబుతున్నారు.











