Sep 26,2023 21:39

- విద్యారంగ సమస్యలపై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు
- విజయనగరం, కడపలో అరెస్టులు
ప్రజాశక్తి-యంత్రాంగం :విద్యారంగ సమస్యలతో పాటు, వసతి గృహాల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని కోరిన విద్యార్థులపై పోలీసులు జులుం ప్రదర్శించారు. ఆందోళన చేస్తున్న నాయకులను, విద్యార్థులను బలవంతంగా ఈడ్చుకెళ్లారు. అరెస్టులు చేసి స్టేషన్లకు తరలించారు. ఇంటర్‌ పాఠ్యపుస్తకాలు అందించాలని, మిడ్డే మీల్స్‌ నిర్వహించాలని, మెస్‌, కాస్మొటిక్‌ ఛార్జీలను విడుదల చేయాలని, జిఒ 77ను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల ఎదుట ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు మంగళవారం ధర్నాలు చేశారు. విజయనగరం కలెక్టరేట్‌ వద్ద విద్యార్థులు ధర్నా నిర్వహించారు. అధికారులెవరూ స్పందించి బయటకు రాకపోవడంతో అక్కడే రోడ్డుపై బైఠాయించారు. ఆందోళన విరమించాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా సహాయ కార్యదర్శి డి.రాముతో డిఎస్‌పి మాట్లాడారు. ఆందోళన విరమించేందుకు అంగీకరించకపోవడంతో రామును పోలీసులు బలవంతంగా అరెస్టు చేశారు. చొక్కాను చించివేసి, బలవంతంగా ఈడ్చుకెళ్లి వ్యాన్‌లో ఎక్కించారు. విద్యార్థులంతా రాము అరెస్టును అడ్డుకున్నారు. పోలీసు వాహనానికి ఎదురుగా రోడ్డుపై బైఠాయించారు. ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు రామకృష్ణ, మరికొంత మంది విద్యార్థినులను సైతం పోలీసులు బలవంతంగా ఈడ్చుకెళ్లి అరెస్టు చేశారు. అయినా మిగతా విద్యార్థులు వెరవకుండా మరోవైపు ఆందోళన కొనసాగించారు. అరెస్టు చేసి వారిని ఒకటవ పట్టణ పోలీసు స్టేషన్‌కు, మరికొందరిని గంట్యాడ స్టేషన్‌కు తరలించారు. సాయంత్రం వారిని విడుదల చేశారు. పోలీసుల తీరుపై ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు సౌమ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. నంద్యాల కలెక్టరేట్‌ వద్ద విద్యార్థులు ధర్నా చేశారు. అనంతరం ఉన్నతాధికారులకు వినతి పత్రం అందించేందుకు కలెక్టరేట్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆ ప్రాంతమంతా ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. త్రీటౌన్‌ సిఐ నరసింహులు, డిఆర్‌ఒ పుల్లయ్య కలుగజేసుకొని విద్యార్థులతో మాట్లాడారు. అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని డిఆర్‌ఒకు అందజేశారు. ఎన్‌టిఆర్‌ జిల్లా విజయవాడలోని మ్యూజియం దగ్గర నుండి కలెక్టర్‌ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్‌ వద్ద ధర్నాలో ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు కె.ప్రసన్నకుమార్‌ మాట్లాడుతూ.. విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు ఎం.సోమేశ్వరరావు పాల్గన్నారు. కడప కోటిరెడ్డి సర్కిల్‌ నుంచి కలెక్టర్‌ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. కలెక్టర్‌కు విజ్ఞప్తి చేసేందుకు కలెక్టరేట్‌లోనికి వెళుతున్న విద్యార్థి సంఘం నేతలను పోలీసులు అడ్డుకున్నారు. అరెస్టు చేసి పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఆ తర్వాత వారిని విడుదల చేశారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో కలెక్టరేట్‌కు ర్యాలీగా వెళ్తున్న విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, విద్యార్థులకు స్వల్పతోపులాట చోటుచేసుకుంది. వన్‌టౌన్‌ సిఐ అడబాల శ్రీనివాస్‌ జోక్యం చేసుకుని కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చేందుకు పది మందిని అనుమతించారు. అనంతరం విద్యార్థి నేతలు కలెక్టర్‌ ప్రశాంతిని కలిసి వినతిపత్రం అందజేశారు. కాకినాడ జిల్లాలో కలెక్టరేట్‌ వరకు ర్యాలీ నిర్వహించి, ధర్నా చేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో సబ్‌ కలెక్టర్‌ వద్ద విద్యార్థులు బైఠాయించి ఆందోళన చేశారు. తిరుపతి కలెక్టరేట్‌ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని జాయింట్‌ కలెక్టర్‌ డి.కె.బాలాజీకి అందజేశారు.