Dec 05,2022 22:18
  • ఎస్‌ఎఫ్‌ఐ 'త్యాగపు ఆర్గాన్‌ పాటల సిడి' ఆవిష్కరణ

ప్రజాశక్తి - హైదరాబాద్‌ బ్యూరో : విద్యార్థులను, ప్రజలను పిడికిళ్లు బిగింపజేసేలా, చైతన్యం కలిగించేలా చేసేదే పాట అని ప్రముఖ సినీ గేయరచయిత సుద్దాల అశోక్‌తేజ అన్నారు. విప్లవ సాహిత్యానికి సౌందర్యాత్మకమైన భావోద్వేగాన్ని రగిలించాలనీ, అందుకు తగ్గ పదాలను ఆ పాటలో జోడించాలని సూచించారు. ఏ అంశంపై పాట రాస్తున్నామో దాన్ని ఇష్టపడితే వచ్చే స్పందన, ఫలితం అద్భుతంగా ఉంటాయని చెప్పారు. భారత విద్యార్థి ఫెడరేషన్‌ (ఎస్‌ఎఫ్‌ఐ) 17వ అఖిల భారత మహాసభను పురస్కరించుకుని సోమవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో 'త్యాగపు ఆర్గాన్‌' అనే పాటల సిడిని ఆయన ఆవిష్కరించారు. అశోక్‌తేజ మాట్లాడుతూ.. పాట పల్లవి గెరిల్లా ముట్టడి లాగా ఉండాలని సూచించారు. తనకు చిన్నప్పటి నుంచే ఎస్‌ఎఫ్‌ఐతో అనుబంధం ఉందన్నారు. 'నేను లెఫ్ట్‌ అయ్యాను. కానీ నా భావజాలం, నా కంఠం, పెన్నులో నుంచి లెఫ్ట్‌... లెఫ్ట్‌ కాలేదు.'అని చెప్పారు. తన ఎదుగుదలకు సుద్దాల హనుమంతు, జానకమ్మ కారణమని అన్నారు. పాటలు రాసిన ఎం విప్లవకుమార్‌, యోచన, ఎ విజయకుమార్‌, సంగీతం అందించిన రవి కల్యాణ్‌ను ఈ సందర్భంగా అభినందించారు. ఎస్‌ఎఫ్‌ఐ కేంద్ర కమిటీ మాజీ సభ్యుడు, రచయిత ఎం విప్లవకుమార్‌, డివైఎఫ్‌ఐ రాష్ట్ర మాజీ కార్యదర్శి, రచయిత ఎ.విజరుకుమార్‌ మాట్లాడుతూ.. విద్యార్థుల్లో ఉత్సాహం, ఉత్తేజాన్ని నింపడం కోసమే తాను ఈ పాట రాశానని అన్నారు. ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎల్‌ మూర్తి అధ్యక్షత వహించారు.