Mar 14,2023 08:14
  • ఆర్‌ఆర్‌ఆర్‌ పాటకు ఆస్కార్‌
  • భారతీయ షార్ట్‌ ఫిలిమ్‌ కు బెస్ట్‌ డాక్యుమెంటరీ అవార్డు
  • ఎవ్విరిథింగ్‌, ఎవ్విరివేర్‌కు ఏడు ఆస్కార్లు !

లాస్‌ఏంజెల్స్‌ : ఆస్కార్‌లో ఈ సారి అద్భుతమే జరిగింది. ఒక్క అవార్డైనా వస్తుందా రాదా అని ఎదురుచూసిన భారతీయులకు ఏకంగా డబుల్‌ బొనాంజా లభించింది. విశ్వవేదికపై రెండు అస్కార్‌ అవార్డులను భారతీయ సినిమా ముద్దాడింది. ముందునుండి పెట్టుకున్న అంచనాలకు తగ్గట్టుగానే ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలో 'నాటు నాటు' పాట బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌ అవార్డును గెలుచుకుంది. ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం వహించిన కీరవాణి, గీత రచయిత చంద్రబోస్‌ ఈ అవార్డును అందుకున్నారు.దీంతో పాటు బెస్ట్‌ డాక్యుమెంటరీ అవార్డుతో భారతీయ షార్ట్‌ ఫిలిమ్‌ మురిసిపోయింది. మన దేశం నుండి నామినేట్‌ అయిన 'ది ఎలిపెంట్‌ విస్పరర్స్‌'కు ఈ అవార్డు దక్కింది. దర్శకురాలు కార్తికి గోన్‌సాల్వెస్‌, నిర్మాత గునీత్‌ మోగ ఈ అవార్డును అందుకున్నారు. .లాస్‌ఏంజెల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో జరుగుతున్న 95వ ఆస్కార్‌ అకాడమీ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం ఈ అద్భుతమైన ఘట్టానికి వేదికైంది. ఈ ఏడాది ఆస్కార్‌ వేదికపై అత్యధిక అవార్డులు గెలుచుకున్న చిత్రంగా ఎవ్విరిథింగ్‌, ఎవ్విరివేర్‌ ఆల్‌ ఎట్‌ వన్స్‌ చిత్రం నిలిచింది . మొత్తం 11 విభాగాల్లో నామినేషన్‌ కాగా, ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటి, ఉత్తమ సహాయక నటి, ఉత్తమ సహాయ నటుడు, ఉత్తర ఒరిజినల్‌ స్క్రీన్‌ప్లే, ఉత్తమ ఎడిటింగ్‌ విభాగాల్లో ఈ సినిమా అవార్డులను కైవసం చేసుకుంది. ది వేల్‌ చిత్రంలో నటనకు గానూ బ్రెండన్‌ ఫ్రాసర్‌కు ఉత్తమ నటుడి అవార్డు వరించింది. అవతార్‌ ది వే ఆఫ్‌ వాటర్‌ చిత్రం ఉత్తమ విజువల్‌ ఎఫెక్ట్స్‌ అవార్డును గెలుచుకుంది. టాప్‌ గన్‌ మేవరిక్‌కు బెస్ట్‌ సౌండ్‌ అవార్డు లభించింది. అల్‌ క్వైట్‌ చిత్రం ఉత్తమ అంతర్జాతీయ చలన చిత్రం కేటగిరీలో అవార్డును స్వంతం చేసుకుంది. డేనియల్‌ క్వాన్‌, డేనియల్‌ షినెర్ట్‌లు ఉత్తమ దర్శకుడిఅవార్డు గెలుచుకున్నారు.

                                                                    'నాటు..నాటు' మానియా !

సోమవారం తెల్లవారు జామునుండే దేశవ్యాప్తంగా నాటునాటు మానియా నెలకొంది. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా సినీ రంగానికి చెందిన వారితో పాటు సాధారణ ప్రజానీకం కూడా ఈ అవార్డు ప్రకటన కోసం ఎదురుచూశారు. అవార్డుల బహుకరుణ జరిగిన డాల్బీ ధియేటర్‌లోనూ ఇదే పరిస్థితి. బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌ అవార్డు ప్రకటనకు ముందే స్థానిక కళాకారులతో కలిసి నాటు నాటు పాటను గాయకులు రాహుల్‌ సిప్లిగంజ్‌, కాలభైరవలు ఆస్కార్‌ వేదికపై అద్భుతంగా ఆలాపించారు. ధియేటర్‌లో ఉన్న వారందరు లేచి నిలబడి 'స్టాండింగ్‌ ఒవేషన్‌' ఇచ్చారు. ఆడియన్స్‌లో కూర్చున్న కీరవాణి, జూనియర్‌ ఎన్‌టిఆర్‌, రామ్‌చరణ్‌లు ఆద్యంతం ఈ ప్రదర్శనను తిలకించారు. ఆ తరువాత కాసేపటికే బెస్ట్‌ ఒరిజనల్‌ సాంగ్‌ అవార్డు ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలోని ఈ పాటకే దక్కినట్టు ప్రకటించడంతో ధియేటర్‌ కరతాళధ్వనులతో మారుమ్రోగింది. ధియేటర్‌లోని రాజమౌళి బృందంతో పాటు, దేశ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకులు ఆనందోత్సాహాల్లో మునిగిపోయారు. ''అప్లాజ్‌ (టెల్‌ ఇట్‌ లైక్‌ ఎ వుమెన్‌), లిఫ్ట్‌ మి అప్‌ (బ్లాక్‌ పాంథర్‌ : వకాండా ఫెరవర్‌), దిసీజ్‌ ఎ లైఫ్‌ (ఎవ్విరీ థింగ్‌ ఎవ్విరీవేర్‌ ఆల్‌ ఎట్‌ వన్స్‌), హౌల్డ్‌ మై హ్యాండ్‌'' (టాప్‌గన్‌ మావెరిక్‌) పాటలను వెనక్కి నెట్టి నాటు నాటు పాట అవార్డును సొంతం చేసుకుంది. అవార్డును స్వీకరిస్తూ మాట్లాడిన కీరవాణి తమ అవార్డును జాతికి అంకితం చేశారు. 1970ల్లో వచ్చిన కార్పెంటర్స్‌ పాట ట్యూన్‌లో తన ఆనందాన్ని తెలియచేస్తూ ప్రసంగించారు. ''ఆ పాట వింటూ పెరిగిన నేను ఈనాడు ఆస్కార్‌తో వున్నాను. ఆర్‌ఆర్‌ఆర్‌ గెలవాలి... ప్రతి ఒక్క భారతీయుడు గర్వపడాలి....ప్రపంచంలోనే అత్యున్నత శిఖరాలపై నన్నుంచాలి...ఇదొక్కటే నా మదిలో, రాజమౌళి, మా కుటుంబాల మనస్సుల్లో వున్న ఒకే ఒక్క కల, అది నేడు సాకారమైంది.'' అంటూ ఆయన ఆలాపించారు.

77

 

                                                                          ప్రశంసల వెల్లువ

ఆస్కార్‌ వేదికపై సత్తా చాటిన భారత సినీ రంగ ప్రముఖులకు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ, రాహుల్‌ గాంధీ, రాజ్‌నాథ్‌ సింగ్‌, అరవింద్‌ కేజ్రివాల్‌ సహా పలువురు రాజకీయ నేతలు, షారుఖ్‌ఖాన్‌ సహా పలువురు సినీరంగ ప్రముఖులు ఆర్‌ఆర్‌ఆర్‌ బృందానికి, ఉత్తమ షార్ట్‌ ఫిలిం కేటగిరీలో అవార్డు గెలుచుకున్న ది ఎలిఫెంట్‌ విష్పరర్స్‌ బృందానికి అభినందనలు తెలియచేశారు.
       భారతదేశానికి రెండు ఆస్కార్లు సాధించిన బృందాలకు అభినందనలు అంటూ మోడీ ట్వీట్‌ చేశారు. ''అసాధారణం, నాటు నాటు పాటకు వచ్చిన ప్రజాదరణ అద్వితీయం. అంతర్జాతీయం. రాబోయే కాలంలో అందరూ గుర్తుంచుకునే పాటగా వుండిపోతుంది. కీరవాణి, చంద్రబోస్‌, మొత్తంగా ఆర్‌ఆర్‌ఆర్‌ బృంద సభ్యులందరికీ ఈ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని అందుకున్నందుకు అభినందనలు. భారత్‌ ఉప్పొంగింది. గర్వపడింది.'' అంటూ ప్రధాని ట్వీట్‌ చేశారు.
      ది ఎలిఫెంట్‌ విష్పరర్స్‌ బృందాన్ని కూడా ప్రశంసిస్తూ విడిగా మరో ట్వీట్‌ చేశారు. ప్రకృతితో మమేకమై జీవించడం యొక్క ప్రాధాన్యతను తెలియచేసిన వారి కృషి అద్భుతమైనదని కొనియాడారు.
కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ కూడా రెండు చిత్ర బృందాలకు అభినందనలు తెలియచేశారు. వన్యప్రాణి సంరక్షణ ప్రాముఖ్యతను, అందాన్ని హృదయానికి హత్తుకునేలా తీసి ఈ ఇద్దరు మహిళలు దేశానికి గర్వకారణమయ్యారని రాహుల్‌ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

                                                                   ఆస్కార్‌ విజేతలు వీరే...

బెస్ట్‌ కాస్ట్యూమ్‌ డిజైన్‌ : రూథ్‌ కార్టర్‌ (బ్లాక్‌ పాంథర్‌ : వకండా ఫరెవర్‌)
ఉత్తమ స్క్రీన్‌ప్లే : డానియెల్‌ క్వాన్‌, డానియెల్‌ స్కీనెర్ట్‌ (ఎవ్రీథింగ్‌ ఎవ్రీవేర్‌ ఆల్‌ ఎట్‌ వన్స్‌)
ఉత్తమ సినిమాటోగ్రఫీ : జేమ్స్‌ఫ్రెండ్‌ (ఆల్‌ క్వైట్‌ ఆన్‌ది వెస్ట్రన్‌ ఫ్రంట్‌)
ఉత్తమ ఎడిటర్‌ : పాల్‌ రోజర్స్‌ (ఎవ్రీథింగ్‌ ఎవ్రీవేర్‌ ఆల్‌ ఎట్‌ వన్స్‌)
ఇంటర్నేషనల్‌ ఫీచర్‌ ఫిల్మ్‌ : ఆల్‌ క్వైట్‌ ఆన్‌ ది వెస్ట్రన్‌ ఫ్రంట్‌ (జర్మనీ)
డాక్యుమెంటరీ ఫీచర్‌ ఫిల్మ్‌ : అలెక్సీ నవానీ
బెస్ట్‌ ప్రొడక్షన్‌ డిజైన్‌ : క్రిస్టియన్‌ ఎం గోల్డ్‌ బెక్‌ ( ఆల్‌ క్వైట్‌ ఆన్‌ ది వెస్ట్రన్‌ ఫ్రంట్‌)
బెస్ట్‌ విజువల్‌ ఎఫెక్ట్స్‌ : అవతార్‌ 2 (అవతార్‌: ది వే ఆఫ్‌ వాటర్‌)
బెస్ట్‌ సౌండ్‌ : టాప్‌గన్‌ : మావెరిక్‌
బెస్ట్‌ మేకప్‌ అండ్‌ హెయిర్‌ స్టైల్‌ : ది వేల్‌
బెస్ట్‌ యానిమేటెడ్‌ ఫీచర్‌ ఫిల్మ్‌ : పినాషియో
లైవ్‌ యాక్షన్‌ షార్ట్‌ ఫిల్మ్‌ : ఏన్‌ ఐరిష్‌ గుడ్‌బై
యానిమేటెడ్‌ షార్ట్‌ ఫిల్మ్‌ : ద బారు, ద మోల్‌, ద ఫాక్స్‌, అండ్‌ ది హార్స్‌
ఉత్తమ అడాప్టెడ్‌ స్క్రీన్‌ప్లే : షెరా పాల్లే (ఉమెన్‌ టాకింగ్‌)
ఒరిజినల్‌ స్కోర్‌ : బ్రెటెల్‌మాన్‌ (ఆల్‌ క్వైట్‌ ఆన్‌ ది వెస్ట్రన్‌ ఫ్రంట్‌)
ఎవ్రీథింగ్‌ ఎవ్రీవేర్‌ ఆల్‌ ఎట్‌ వన్స్‌' చిత్రానికి ఏకంగా ఏడు విభాగాల్లో ఆస్కార్‌ దక్కింది.

11