ప్రజాశక్తి-బాపట్ల, భీమవరం : ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకొని.. పాత పెన్షన్ విధానాన్ని పరిరక్షించుకుందామని యుటిఎఫ్ నాయకులు అన్నారు. యుటిఎఫ్ స్వర్ణోత్సవాల్లో భాగంగా అనంతపురంలో ప్రారంభమైన బైక్ జాతా బాపట్ల జిల్లాకు, ఇచ్ఛాపురంలో ప్రారంభమైన జాతా పశ్చిమగోదావరి జిల్లాలో బుధవారం కొనసాగింది.
బైక్ జాతా మార్టూరు, పర్చూరు, చీరాల మీదుగా బాపట్లకు చేరుకుంది. బాపట్లలో యుటిఎఫ్ పతాకాన్ని సీనియర్ నాయకులు నూతలపాటి కోటేశ్వరరావు, వై.భాస్కరరావు, రత్నరాజు, రాష్ట్ర నాయకులతో కలిసి ఆవిష్కరించారు. అనంతరం రాష్ట్ర అధ్యక్షులు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. ప్రభుత్వ విద్యావ్యవస్థ నిర్వీర్యం అవుతోందని, దాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని చెప్పారు. రాష్ట్రంలో 44 వేల ప్రాథమిక పాఠశాలలున్నాయని, కేవలం 19 వేల పాఠశాలల్లో నామమాత్రంగానే విద్యార్థులు చేరారని, ఇదే విధానం కొనసాగితే రానున్న రోజుల్లో ప్రభుత్వ పాఠశాలలు సమూలంగా మూతపడే అవకాశాలు ఉన్నాయన్నారు. పెన్షన్ విధానంపై ప్రభుత్వం అనుసరిస్తోన్న వైఖరి లోపభూయిష్టంగా ఉందన్నారు.
పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం, పాలకొల్లు, వీరవాసరం, భీమవరం, తణుకు, తాడేపల్లిగూడెం మీదుగా ఏలూరు జిల్లాలోకి ప్రవేశించింది. ఆయా మండలాల్లో నిర్వహించిన సభల్లో సంఘం రాష్ట్ర కోశాధికారి బి.గోపిమూర్తి, రాష్ట్ర కార్యదర్శి బి.లక్ష్మిరాజా మాట్లాడారు. విద్యారంగ పరిరక్షణకు ఉద్యమాలు చేయడంతోపాటు సమాజానికి సేవ చేయడంలోనూ యుటిఎఫ్ ముందుందన్నారు. ఏడాది పొడవునా జరిగే స్వర్ణోత్సవ కార్యక్రమాలను జయప్రదం చేయాలని కోరారు.










