Sep 14,2023 08:01

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : చంద్రబాబు చట్టానికి, రాజ్యాంగానికి అతీతుడైనట్లు టిడిపి నాయకులు మాట్లాడుతున్నారని వైసిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. స్కిల్‌ స్కామ్‌లో అడ్డంగా దొరికిపోయి అరెస్టు అయి జైలుకు వెళ్లి కూడా దబాయిస్తున్నారని అన్నారు. తాడేపల్లిలోని వైసిపి కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. టిడిపి హయాంలో డబ్బులు ఎవరి నుంచి చేతులు మారాయో స్పష్టంగా ఆధారాలు కూడా వున్నాయని పవర్‌పాయింట్‌ ప్రెజెంటేషన్‌ ద్వారా వివరించారు. చంద్రబాబు దోచుకోవడానికే ఓ స్కీమ్‌ పెట్టారని ఆరోపించారు. షెల్‌ కంపెనీల ద్వారా ప్రజల సొమ్మును క్యాష్‌గా మార్చుకున్నారని విమర్శించారు. వందల కోట్లు కొల్లగొట్టి ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగించినట్లు పక్కా ఆధారాలతో సిఐడి రిమాండ్‌ రిపోర్టు ఇచ్చిందన్నారు. 2014 సెప్టెంబరులో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసి దానికి గంటా సుబ్బారావును ఎమ్‌డిగా నియమించారని అన్నారు. 2015లో దాని పేరును స్కిల్‌ డెవలప్‌మెంట్‌ డిపార్ట్‌మెంట్‌గా మార్చారన్నారు. ఇడి, ఐటి వంటి నేషనల్‌ ఏజెన్సీలు కూడా ఈ దోపిడీపై నివేదికను ఇచ్చాయన్నారు. 2019 ఏప్రిల్‌లో సీమెన్స్‌ ఇన్వెస్టిగేషన్‌ రిపోర్టులో తాము ఎలాంటి అగ్రిమెంట్‌ చేసుకోలేదని తమకు సంబంధం లేదని చెప్పిందన్నారు. అసలు తమకు డబ్బు రాలేదని సీమెన్స్‌ సంస్థ అంటోందన్నారు. డబ్బు టెక్‌డిజైన్‌కు వెళ్లి అక్కడ నుండి నేరుగా షెల్‌ కంపెనీలకు వెళ్లిందన్నారు. ఈ అంశంపై ఇడి నోటీసులిచ్చి దర్యాప్తు చేసిందన్నారు. ఈ కేసులో చంద్రబాబును అరెస్టు చేసే సమయంలో అధికారులు ఎంతో గౌరవంగా వ్యవహరించినా హింసిస్తున్నారని టిడిపి దుష్ప్రచారం చేస్తోందని విమర్శించారు. రాజకీయ ప్రయోజననాల కోసమే చంద్రబాబు సానుభూతిని సృష్టించుకునేందుకు హడావిడి చేస్తున్నారని అన్నారు. దొంగను అరెస్టు చేస్తే మానవహక్కుల ఉల్లంఘన అవుతుందా? అని ప్రశ్నించారు. చట్ట పరిధిలో జరుగుతున్న ఈ విచారణకు టిడిపి సహకరించాలని కోరారు.