తాడేపల్లి: చంద్రబాబుకు కండీషనల్ బెయిల్ మాత్రమే ఇచ్చారని మంత్రి సజ్జల రామకఅష్ణారెడ్డి పేర్కొన్నారు. మధ్యంతర బెయిల్ రాగానే టీడీపీ సంబరాలు జరుపుకోవడంలో అర్ధం లేదని మండిపడ్డారు. స్కిల్ స్కామ్‌లో చంద్రబాబు పాత్ర స్పష్టంగా ఉందని తెలిపారు. చంద్రబాబు మాజీ పీఎస్ పెండ్యాల శ్రీనివాస్‌ను విచారిస్తే అన్ని విషయాలు బయటికి వస్తాయని అన్నారు. మధ్యంతర బెయిల్ రాగానే నిజం గెలిచినట్టా అని సజ్జల ప్రశ్నించారు.
వ్యవస్థలను చంద్రబాబు మేనేజ్ చేస్తారని సజ్జల దుయ్యబట్టారు. స్కిల్ కేసులో డబ్బులు షెల్ కంపెనీలకు దారి మళ్లాయా? లేదా అని ప్రశ్నించారు. సానుభూతి కోసం బెయిల్ తెచ్చుకుని.. జనాలకు చంద్రబాబు ఏం చెప్పాలనుకుంటున్నారని ప్రశ్నించారు. నిజంగా చంద్రబాబు అనారోగ్యంగా ఉంటే చికిత్స చేయించుకోవాలని అన్నారు. చికిత్స తర్వాత చంద్రబాబు జైలుకెళ్లాల్సిందేనని చెప్పారు. చంద్రబాబు నిర్దోషి అయితే ఆధారాలు బయటపెట్టాలని కోరారు.