Mar 26,2023 08:13
  • పిఎం ఎజెఎవైకి రెండేళ్లుగా కేంద్రం నిధులు నిలిపివేత
  • 2021 నాటి సబ్సిడీ నిధులు ఇప్పుడు కేటాయింపు
  • రుణాలు ఇవ్వకుండా సబ్సిడీ ఇస్తామంటున్న వైనం

ప్రజాశక్తి- శ్రీకాకుళం ప్రతినిధి : ఎస్‌సిలను ఉద్ధరించడానికే అన్నట్లు పథకాలను ప్రకటిస్తున్న కేంద్ర ప్రభుత్వం వాటికి నిధులు విడుదల చేయడంలో ఉదాసీనంగా వ్యవహరిస్తోంది. ఇందుకు ప్రధాన మంత్రి అనుసూచిత్‌ జాతి అభ్యుదరు యోజన పథకమే ఉదాహరణ. ఈ పథకానికి రెండేళ్లుగా నిధులు నిలిపేసింది. 2021లో నిధులు విడుదల చేసినా వెచ్చించలేదు. ఇప్పుడు ఆ డబ్బులను సబ్సిడీ కింద విడుదల చేసేందుకు లబ్ధిదారుల వివరాలు సేకరించాలంటూ ఎస్‌సి కార్పొరేషన్‌ అధికారులకు లేఖలు పంపింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో రుణాలు పొందిన వారే అర్హులంటూ నిబంధన విధించింది. బోరు బావులు, డ్రిప్‌ ఇరిగేషన్‌, స్ప్రింకర్ల కోసం రుణం తీసుకుని ఉండాలని పేర్కొంది. ట్రాక్టర్‌, ట్రాలీ, కమర్షియల్‌ వాహనాలు, తదితర అంశాలకు రుణాలు పొంది స్వయం ఉపాధి పొందుతున్న వారూ అర్హులని తెలిపింది. అటువంటి వారు ఎవరుంటారనే అధికారులు జల్లెడ పడుతున్నారు. డిఆర్‌డిఎ, మెప్మా, వ్యవసాయ శాఖ, స్టేట్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ తదితర ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా రుణం పొందిన ఎస్‌సి లబ్ధిదారుల వివరాలను సేకరించే పనిలో అధికారులు ఉన్నారు. ఎస్‌సి కార్పొరేషన్‌ ద్వారా రుణాలు పొంది ఉంటే తమ దగ్గర వివరాలు ఉంటాయని, వేరే ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా రుణాలు పొందిన వారి వివరాలు తమ వద్ద ఎలా ఉంటాయని వారు తలలు పట్టుకుంటున్నారు. గత ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ పనిముట్లు, వాహనాలపై రుణాలు ఎవరు పొందారో వివరాలు ఇవ్వాలని ఎస్‌సి కార్పొరేషన్‌ అధికారులు బ్యాంకర్లకు లేఖలు రాస్తున్నారు. దీనిపై ఇప్పటివరకు ఒక్కరి వివరాలు కూడా రాలేదు
        దళితుల్లో పేదరికం తగ్గించడం, ఆర్థికంగా, సామాజికంగా వారు అభివృద్ధి చెందేలా చేయడం, ఆదాయమిచ్చే కార్యక్రమాలు అమలు పరచడం వంటి లక్ష్యాలతో కేంద్ర ప్రభుత్వం 2018-19 ఆర్థిక సంవత్సరంలో పిఎం ఎజెఎవై పథకాన్ని ప్రారంభించింది. అంతకుముందు అమల్లో ఉన్న స్పెషల్‌ సెంట్రల్‌ అసిస్టెన్స్‌ టు షెడ్యూల్‌ క్యాస్ట్స్‌ సబ్‌ప్లాన్‌, ప్రధాన మంత్రి ఆదర్స్‌ గ్రామ్‌ యోజన, బాబూ జగ్జీవన్‌రామ్‌ ఛత్రవాస్‌ యోజన పథకాలన్నింటినీ కలిపి పిఎం ఎజెఎవైగా మార్చింది. ఈ పథకానికి 2018 నుంచి 2021 వరకు నిధులు విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం ఆ తర్వాత రెండేళ్లుగా ఇవ్వడం లేదు. 2021లో రాష్ట్రానికి రూ.29.80 కోట్లను కేటాయించినా వాటిని విడుదల చేయలేదు. ప్రస్తుతం అందులో వివిధ రకాల ఖర్చులుపోను రూ.29.07 కోట్లు మిగిలాయి. ఆ డబ్బులనే సబ్సిడీగా ఇవ్వాలని ఇప్పుడు చూస్తోంది. వ్యవసాయ పరికరాలు లేదా స్వయం ఉపాధి పథకాలకు అయ్యే మొత్తం ఖర్చులో 50 శాతం సబ్సిడీ లేదా రూ.50 వేలుకు మించకుండా వారి ఖాతాల్లో డబ్బులు వేస్తామని చెప్తోంది
 

                                                                  రుణాలు ఇవ్వకుండా సబ్సిడీ !

కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో ఎస్‌సి కార్పొరేషన్‌ అధికారులు దళితులకు ప్రభుత్వ ఏజెన్సీలు ఏయే అంశాలకు రుణం ఇచ్చాయో, ఎవరికిచ్చారో అనే వివరాల సేకరణలో అధికారులు ఉన్నారు. అటువంటి వారి వివరాలు దొరకడం కష్టమని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఎస్‌సి కార్పొరేషన్‌ హామీ ఉన్నా ఎస్‌సిలకు రుణం దొరకని పరిస్థితి ఉంది. వారికి సొంత పూచీకత్తుపై ఎవరు రుణమిస్తారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కనీసం ఎస్‌సి కార్పొరేషన్‌ ద్వారా రుణాలు అందించినా వారికి మేలు జరిగేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం ఇవ్వచూపిన సబ్సిడీ నిధులు ఎందుకూ కొరగాకుండా పోతాయనే చర్చ సాగుతోంది.