ప్రజాశక్తి - రెడ్డిగూడెం(ఎన్‌టిఆర్) : రెడ్డిగూడెం మండల కేంద్రంలో ఎస్సీ ఏరియాలో కొన్ని ప్రాంతాల్లో చినుకు పడితే చిత్తాడే అన్నట్లు అంతర్గత రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. ఇదే విషయాన్ని గత కొంతకాలంగా అధికారులకు, ప్రజాప్రతినిధులకు విన్నవించినా ఫలితం లేకుండా పోతుందని ఆ నివాస ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండటంతో పాటు రహదార్లు గుంటలుగా మారడంతో వర్షం పడితే చాలు రహదారిపైన ఉన్న గోతులలో నీరు నిల్వ ఉండి రాకపోకలకు ఇబ్బందులు కలగటంతో పాటు నీరు నిల్వ ఉండి దోమలు వృద్ధి చెందుతున్నాయని తెలిపారు. ఈ పరిసర ప్రాంతాల్లో సిమెంట్ రోడ్లు వేయాలని ఎన్నోసార్లు విన్నవించినా ఫలితం లేకుండా పోయిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనుక అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి వెంటనే చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.










