- కొట్టి పారేయలేమన్న కాగ్
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : రాష్ట్రం 2017-18 ఆర్థిక సంవత్సరం నుంచి 2021-22 వరకూ అప్పు తెచ్చిన మొత్తాల్లో 65 శాతం నుంచి 83 శాతం వరకూ రుణాల చెల్లింపులకే ఉపయోగించడం ప్రమాదమని కాగ్ అక్షింతలు వేసింది. ఆస్తులు సృష్టించకుండా ప్రధాన రుణ బాధ్యత నుంచి బయటపడేందుకు మరలా రుణాలపైనే అధారపడటం పెరిగిందని తెలిపింది. దీనివల్ల ప్రభుత్వ ఖజానాపై భారం పెరిగి ప్రభుత్వ రుణం భరించలేనిదిగా మారి రాష్ట్రం అప్పుల వలయంలో చిక్కుకునే అవకాశాన్ని కొట్టి పారేయలేమని పేర్కొంది. ప్రభుత్వం తీసుకున్న రుణాలకు సంబంధించి తిరిగి చెల్లించే బాధ్యత 2024-25 నాటికి రూ.42,236 కోట్లకు అంటే పతాకస్థాయి చేరి అక్కడ నుండి క్రమంగా తగ్గుతుందని కాగ్ అంచనా వేసింది. అందులోనూ 2026-27 నుండి తగ్గుతుందని, ఇందులో 2028-29 మినహాయింపు ఉంటుందని పేర్కొంది. అయితే దీనికి సంబంధించి క్రమంగా ఆదాయాలను పెంపొందించుకోకపోవడం వల్ల ప్రతి సంవత్సరం ప్రస్తుత ఖర్చుల నిమిత్తం బహిరంగ మార్కెట్ రుణాలపై ఆధారపడటం వల్ల రుణ బాధ్యత పెరిగే ప్రమాదమూ లేకపోలేదని హెచ్చరించింది.











