Oct 11,2023 21:01

కోమటికుంట విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ ముట్టడి
వారం రోజుల్లో సమస్య పరిష్కరిస్తామని అధికారుల హామీ
ప్రజాశక్తి-మార్కాపురం (ప్రకాశం జిల్లా):గత నాలుగు రోజులుగా విద్యుత్‌ కోతలు అధికమవ్వడంతో రైతన్నలు కన్నెర్ర చేశారు. వ్యవసాయ రంగానికి సరఫరా అవుతున్న తొమ్మిది గంటల్లో నాలుగైదు గంటలకు తగ్గించడం, అదీ ఎప్పుడు ఇస్తారో తెలియకపోవడం, విద్యుత్‌ సరఫరా సమయంలోనూ పలుమార్లు అంతరాయం కలుగుతుండడంతో రైతన్నలు విసిగిపోయారు. దీంతో ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని కోమటికుంట విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ను బుధవారం వారు ముట్టడించారు. కంభాంమార్కాపురం రహదారిపై రాస్తారోకో చేశారు. దీంతో వందలాది వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులతో పాటు విద్యుత్‌ అధికారులు డిఇఇ సియానాయక్‌, ఎఇ సుబ్బరాయుడు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో విద్యుత్‌ డిఇఇ సి సియానాయక్‌ మాట్లాడుతూ విద్యుత్‌ సబ్‌ స్టేషన్లో సాంకేతిక పరికరం దెబ్బతిందని తెలిపారు. దాని కోసం రూ.80 లక్షలకు పైగా వెచ్చించాల్సి ఉందని, దానిపై నివేదిక పంపామని, వారం రోజుల్లో సమస్యకు పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు. ఆ తరువాత వ్యవసాయానికి తొమ్మిది గంటల విద్యుత్‌ సరఫరా కొనసాగిస్తామన్నారు. ఇచ్చే కొద్దిపాటి సమయంలో కోతల్లేకుండా వ్యవసాయానికి సరఫరా చేయాలని సిబ్బందికి సూచించారు. అనంతరం పోలీసులు ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకున్నారు. ఆందోళన చేసిన వారిలో రైతన్నలు వేల్పుల కాశిరెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, వెన్నా అల్లూరిరెడ్డి, కృష్ణారెడ్డి, శ్రీనివాసరెడ్డి, సుబ్బారెడ్డి, రామిరెడ్డి, పరమేశ్వరరెడ్డి, కొండారెడ్డి, నారాయణరెడ్డి, ఆదినారాయణ, లక్ష్మిరెడ్డి, వెంకటనారాయణరెడ్డి, వెంకటరాజు, విశ్వేశ్వరరెడ్డి ఉన్నారు.