- ప్రలోభాలు, బెదిరింపులే అధికార పార్టీ అజెండా !
- రేపు ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్
ప్రజాశక్తి- యంత్రాంగం : రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం శనివారంతో ముగిసింది. చివరి రోజు హోరాహోరీగా ప్రచారం జరిగింది. పిడిఎఫ్ అభ్యర్థులు ప్రచారంలో ముందున్నారు. మూడు పట్టభద్రుల స్థానాలకు, రెండు ఉపాధ్యాయ స్థానాలకు సోమవారం పోలింగ్ జరగనుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. ప్రలోభాలకు, బెదిరింపులకు అధికార వైసిపి పెద్ద ఎత్తున తెరలేపడంతో ప్రధాన పోటీదారులు అప్రమత్తమయ్యారు. డబ్బు, కానుకల పంపిణీని అడ్డుకోవడానికి ఎక్కడికక్కడే నిఘా పెట్టారు. వైసిపి చేర్పించిన దొంగ ఓట్లు పోలవకుండా ఇప్పటికే పక్కా వ్యూహంతో ఉన్నారు. ఎక్కడెక్కడ దొంగ ఓట్లు నమోదయ్యాయో ఇప్పటికే నిర్థారణకు వచ్చారు. ఎవరైనా దొంగ ఓటు వేయడానికి వస్తే కేసు పెట్టాలనే నిర్ణయానికి వచ్చారు. విశాఖలో వైసిపి అభ్యర్థి ఓటర్లకు పంపిణీకి చేయడానికి వెండి నాణేలు సిద్ధం చేయడంపై పోలీసులకు, అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందించకపోవడం, తిరుపతి, తిరుమలలో పెద్ద ఎత్తున దొంగ నోట్లు నమోదైనా అధికార యంత్రాంగం చూసీచూడనట్లు వ్యవహరించడం విమర్శలకు తావిచ్చింది. చివరి రోజు ప్రచారంలో పిడిఎఫ్ అభ్యర్థులు, వారికి మద్దతు ఇస్తున్న సంఘాల నాయకులు మాట్లాడుతూ శాసన మండలి ఎన్నికల్లో దొడ్డి దారిన గెలిచేందుకు అధికార పార్టీ అనేక కుట్రలు చేస్తోందని విమర్శించారు. దొంగ ఓట్లు చేర్పించిందన్నారు. డబ్బులు, కానుకలు పంచడం లాంటివి చేస్తూ ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తోందని దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు, ఉపాధ్యాయుల పట్ల ఎప్పుడూలేని విధంగా కఠినంగా వ్యవహరిస్తోందన్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయుల ఉద్యమాలను అణచివేసి అక్కసు చాటుకుందని దుయ్యబట్టారు. ఉద్యోగులకు న్యాయంగా రావాల్సిన డిఎలు, పిఆర్‌సి ఇవ్వలేదని తెలిపారు. ఒపిఎస్ అమలు విషయంలో మాట తప్పిందన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగం పెరిగిపోయిందని, ఉద్యోగావకాశాలు లేవని, వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎక్కడా ఒక్క పరిశ్రమ కూడా రాలేదని తెలిపారు. కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేస్తామని ప్రభుత్వం ఇచ్చిన హామీ అమలుకు నోచుకోలేదన్నారు. ప్రభుత్వ దుర్మార్గాలను ఎదుర్కోవాలంటే పిడిఎఫ్ అభ్యర్థులను గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు.
నాలుగు నియోజకవర్గాల్లో త్రిముఖ పోటీ !
ఎన్నికలు జరుగుతున్న ఐదు స్థానాలకుగానూ నాలుగు స్థానాల్లో త్రిముఖ పోటీ నెలకొంది. ఉత్తరాంధ్ర (ఉమ్మడి విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం) పట్టభద్రుల నియోజకవర్గం నుంచి 37 మంది పోటీలో ఉన్నారు. వారిలో పిడిఎఫ్ తరఫున కోరెడ్ల రమాప్రభ, వైసిపి నుంచి సీతంరాజు సుధాకర్, టిడిపి నుంచి వి.చిరంజీవిరావు, బిజెపి నుంచి పివిఎన్.మాధవ్ మధ్య ప్రధాన పోటీ నెలకొంది. 2,89,214 మంది ఓటర్లు ఉన్నారు. పశ్చిమ రాయలసీమ (ఉమ్మడి కడప, అనంతపురం, కర్నూలు జిల్లాలు) పట్టభద్రుల నియోజకవర్గం నుంచి 49 మంది బరిలో నిలిచారు. వారిలో పిడిఎఫ్ అభ్యర్థి పోతుల నాగరాజు, వైసిపి అభ్యర్థి వెన్నపూస రవీంద్రరెడ్డి, టిడిపి అభ్యర్థి భూమిరెడ్డి రామగోపాల్‌రెడ్డి మధ్య ప్రధాన పోటీ ఉంది. మొత్తం 3,30,124 మంది ఓటర్లు ఉన్నారు. పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి 12 మంది బరిలో నిలిచారు. పిడిఎఫ్ అభ్యర్థి కత్తి నరసింహారెడ్డి, వైసిపి మద్దతుతో పోటీ చేస్తున్న రామచంద్రారెడ్డి మధ్య ప్రధాన పోటీ నెలకొంది. మొత్తం 28,148 మంది ఓటర్లు ఉన్నారు. తూర్పు రాయలసీమ (ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాలు) పట్టభద్రుల నియోజకవర్గం నుంచి మొత్తం 22 మంది పోటీ చేస్తున్నారు. వారిలో పిడిఎఫ్ నుంచి మీగడ వెంకటేశ్వర రెడ్డి, వైసిపి నుంచి పేర్నేటి శ్యాంప్రసాద్‌రెడ్డి, టిడిపి నుంచి కంచెర్ల శ్రీకాంత్ మధ్య ప్రధాన పోటీ నెలకొంది. మొత్తం ఓటర్లు 3,81,181 మంది ఓటర్లు ఉన్నారు. తూర్పు రాయలసీమ (ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాలు) ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి మొత్తం ఎనిమిది మంది పోటీ చేస్తున్నారు. పిడిఎఫ్ అభ్యర్థి పొక్కిరెడ్డి బాబురెడ్డి, వైసిపి అభ్యర్థి పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, ఎపిటిఎఫ్‌కు చెందిన ఎల్‌సి.రమణారెడ్డి మధ్య ప్రధాన పోటీ ఉంది. మొత్తం ఓటర్లు 27,694 మంది ఓటర్లు ఉన్నారు.










