Jun 01,2022 09:11
  • నేడు కాల్వలకు సాగు నీటిని విడుదల చేయనున్న మంత్రి అంబటి
  • క్లోజర్‌ పనులు పూర్తి కాకపోవడంతో రైతుల అసంతృప్తి

ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన'ముందస్తు వ్యవసాయ ప్రణాళికలో భాగంగా ధవళేశ్వరం కాటన్‌ బ్యారేజీ నుంచి పాత ఉభయ గోదావరి జిల్లాల్లోని సాగు నీటి కాలువకు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు బుధవారం నీటిని విడుదల చేయనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. నవంబరులో భారీ వర్షాలు, వరదల నుంచి రైతులను రక్షించేందుకు ముందస్తు ఖరీఫ్‌ను చేపడుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ధవశ్వరంలోని కాటన్‌ బ్యారేజీ నుంచి తూర్పు, మధ్య, డెల్టా పశ్చిమ కాల్వల ద్వారా ఉభయ గోదావరి జిల్లాలకు సాగు, తాగునీరు అందిస్తుంటారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 5.54 లక్షల ఎకరాలు, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో 4.50 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ఏటా ఏప్రిల్‌లో నెలాఖరుకు కాలువలకు నీటి సరఫరా నిలిపేసి జూన్‌ 15 నాటికి సాగు నీటిని విడుదల చేసేవారు. ఈ ఏడాది 15 రోజుల ముందుగానే నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ధవళేశ్వరం బ్యారేజీ వద్ద మూడు టిఎంసిల నీరు నిల్వ ఉందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఈ నీరు నారుమళ్లు, తడుల వరకూ సరిపోతుందని చెప్తున్నారు. రైతులు సాగుకు సన్నద్ధం అవుతున్నారు.
 

                                                             పూర్తి కాని క్లోజర్‌ పనులు

కాలువలకు బుధవారం నుంచి విడుదల కానున్నా క్లోజర్‌ పనులు నేటికీ పూర్తి కాలేదు.దీంతో, ఆయకట్టు శివారు భూములకు నీటి కొరతతో పాటు ముంపు సమస్య తలెత్తే అవకాశం ఉందని రైతులు అంటున్నారు. క్లోజర్‌ పనులను వెంటనే పూర్తి చేయాలని కోరుతున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఈ ఏడాది రూ.43 కోట్లతో 275 క్లోజర్‌ పనులకు ఆమోదం లభించింది. కోనసీమలో 212 పనులు, తూర్పుగోదావరిలో 22, కాకినాడలో 41 పనులు చేపట్టాల్సి ఉంది. స్లూయిజ్‌ల నిర్మాణాలు, మరమ్మతులు, కాలువల్లో పూడికతీతలు, గుర్రపు డెక్క తొలగింపు, రిటైనింగ్‌ వాల్స్‌, షట్టర్ల మరమ్మతులు వంటి పనులు వీటిలో ఉన్నాయి. ఈ పనులకు గానూ రెండు విడతల్లో టెండర్లు పిలిచారు. మరమ్మతులు, నిర్మాణ పనుల కోసం మే 16న, తూడు, గుర్రపు డెక్కను తొలగింపు పనులకు మే 23న టెండర్లకు గడువు తేదీ నిర్ణయించారు. గతేడాది రూ.21 కోట్లతో 178 పనులకు పరిపాలనా ఆమోదం లభించినప్పటికీ 30 రోజులు వ్యవధిలో పూర్తి స్థాయిలో పనులు పూర్తి కాలేదు. దీంతో, రబీలో శివారు భూములకు నీరందలేదు. మోటార్ల ద్వారా పంటలకు తడి పెట్టుకోవాల్సి వచ్చింది. స్లూయిజ్‌ గేట్ల లీకుల కారణంగా కోనసీమలో కొన్ని ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. గత పనులకు సంబంధించి రూ.60 కోట్ల వరకూ ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టింది. దీంతో, ఈ ఏడాదికి సంబంధించి తాజాగా పిలిచిన టెండర్లకు కాంట్రాక్టర్లు పెద్దగా ఆసక్తి చూపనట్లు సమాచారం.
 

                                                       పనులకు ఇబ్బంది ఉండదు

తూర్పు డెల్టాలో 41 పనులకు ఆమోదం లభించింది. ఏడు పనులకు మంగళవారం టెండర్లు తెరిచారు. రెండింటికి రెస్పాన్స్‌ లేదు. మిగిలిన 34 పనులకు సంబంధించిన టెండర్లు బుధ, గురువారాల్లో తెరుస్తాము. కాలువలకు నీటిని విడుదల చేసినా పనులకు ఎలాంటి ఇబ్బందీ ఉండదు.
                          - డివి.రామ్‌గోపాల్‌, ఇఇ, తూర్పు కెనాల్‌