- 17.5 లక్షల ఎకరాలు తక్కువ
- మూడు వారాలే గడువు
ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి- అమరావతి : ఈ మారు ఖరీఫ్‌లో సాధారణ సాగు కష్టంగా కనిపిస్తోంది. సీజన్‌లో మూడు మాసాలపైన వారం రోజులు గడిచిపోయింది. సెప్టెంబర్ 9 వచ్చినా సేద్యం ఉత్సాహంగా సాగట్లేదు. సీజన్ నార్మల్‌కు సాగు చేరాలంటే ఇంకా పదిహేడున్నర లక్షల ఎకరాల్లో పంటలు పడాలి. 19 శాతం విస్తీర్ణంలో పంటలు సాగు కావాలి. సమయం ఇరవై రోజులే ఉంది. మామూలుగా సెప్టెంబర్ చివరాఖరుకు ఖరీఫ్ ముగుస్తుంది. అడపాదడపా అదీ నీటి వనరులున్న చోట అక్టోబర్ రెండో వారం వరకు వరి నాట్లు పడతాయి. ఈ పరిస్థితులన్నీ బేరీజు వేసుకున్నాక ఈ తడవ ఖరీఫ్ సాగు నార్మల్‌కు చేరడం దుర్లభమేనన్న అంచనాలు వెల్లడవుతున్నాయి. సీజన్ సాధారణ సాగు 92 లక్షల ఎకరాలు కాగా ఇప్పటి వరకు 81 శాతం విస్తీర్ణంలోనే పంటలు వేశారు. సెప్టెంబర్ మొదటి వారానికైతే 5 శాతం తక్కువగా సేద్యం జరిగింది. ఈ లోటును పూడ్చుకొని సాగు సాధారణ స్థాయికి చేరేంతగా పరిస్థితులు ఆశాజనకంగా లేవన్న వాదనలు వినిపిస్తున్నాయి.
ఆహార ధాన్యాలు
ఆహార ధాన్యాల సాగు 52 లక్షల ఎకరాలు కాగా ఇంకా 17 లక్షల ఎకరాలకుపైన సాగు కావాలి. సేద్యం 33 శాతం లోటులో నడుస్తోంది. ఈపాటికి కావాల్సిన సాగులో 6 శాతం తక్కువ సాగు నమోదైంది. వరి 39 లక్షల ఎకరాలకుగాను ఇంకా సుమారు 8 లక్షల ఎకరాల్లో నాట్లు పడాలి. నార్మల్‌లో 20 శాతం విస్తీర్ణంలో సాగు కావాలి. ఇప్పటికి లోటు 4 శాతం. కాకినాడ, తిరుపతి మినహా తతిమ్మా అన్ని జిల్లాల్లోనూ వరి కొద్దోగొప్పో తక్కువే సాగైంది. వరి ఎక్కువగా సాగయ్యే శ్రీకాకుళం, విజయనగరం, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, నెల్లూరు జిల్లాల్లో తక్కువ సాగైంది. ముతక ధాన్యాలు 2.55 లక్షల ఎకరాల్లో (21 శాతం) సాగు కావాలి. పప్పు ధాన్యాలు 3.14 లక్షల ఎకరాల (38 శాతం)లో పడాలి.
నూనెగింజలు
వేరుశనగ సాగుకు అదను ఎప్పుడో తప్పింది. నార్మల్‌లో 3.42 లక్షల ఎకరాలు సాగు ప్రశ్నార్ధకం. వేరుశనగ సాగయ్యే రాయలసీమ జిల్లాల్లో సాగు తగ్గింది. వేరుశనగ తగ్గడంతో మొత్తంగా నూనెగింజల సాగుపై ప్రభావం పడింది. మొత్తంగా నూనెగింజలు 2.87 లక్షల ఎకరాల్లో (16 శాతం) సాగు కావాలి. వాణిజ్యపంటల్లో పత్తి, ముతకధాన్యాల్లో మొక్కజొన్న మాత్రమే సాధారణ స్థాయిలో సాగయ్యాయి.











