Oct 10,2023 21:50

- అలరించిన కోలాట నృత్యాలు
- ప్రత్యేక ఆకర్షణగా బతుకమ్మ ఆట, పాట
ప్రజాశక్తి - విజయవాడ, విజయవాడ అర్బన్‌ :దసరా సాంస్కృతికోత్సవాలు కోలాటం, శాస్త్రీయ నృత్యం, జానపద నృత్యాలు, బతుకమ్మ ఆటలతో ఎన్‌టిఆర్‌ జిల్లా విజయవాడలో మంగళవారం ఉత్సాహంగా జరిగాయి. నగరంలోని సంగీత కళాశాలలో దసరా సాంస్కృతిక ఉత్సవాల నిర్వహణ కమిటీ ఆధ్వర్యాన 'దసరా సాంస్కృతికోత్సవాలు' పేరుతో నిర్వహించిన ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. మహిళలు కోలాటాలతో అలరించారు. సుమారు 27 బృందాలు కోలాట నృత్యంలో పాల్గన్నాయి. జానపద, శాస్త్రీయ నృత్యాలతో నగరంలోని వివిధ కళాశాలల విద్యార్థినులు చక్కని సందేశాలు ఇచ్చారు. ఆంధ్రా లయోలా, పిబి సిద్ధార్థ, సిద్ధార్థ మహిళా, నలంద, కెబిఎన్‌ కళాశాలల నుండి విద్యార్థినులు పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. ఫోరం ఫర్‌ ఆర్టిస్ట్స్‌ మహిళా విభాగం ఆధ్వర్యాన ఏర్పాటు చేసిన ఆర్ట్‌ అండ్‌ క్రాఫ్ట్‌ ఎగ్జిబిషన్‌లో సుమారు 30 మంది మహిళలు, యువతులు వందకుపైగా కళాకృతులను ప్రదర్శించారు. ఈ ఎగ్జిబిషన్‌ను విజయవాడకు చెందిన ప్రముఖ సీనియర్‌ క్రాఫ్ట్‌ ఆర్టిస్ట్‌ అనుమకొండ సరోజినీదేవి లాంఛనంగా ప్రారంభించారు. ఉత్సవాల్లో బతుకమ్మ పాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ముగింపు కార్యక్రమంలో ప్రముఖ పారిశ్రామికవేత్త బాయన వెంకట్రావు పాల్గని విజేతలకు బహుమతులను అందజేశారు. సాంస్కృతిక ఉత్సవాల్లో భాగంగా విజయవాడలోని ఘంటసాల ప్రభుత్వ సంగీత, నృత్య కళాశాల ఆడిటోరియంలో జరిగిన సభలో సిద్ధార్థ మహిళా కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ ఎస్‌.పద్మజ మాట్లాడుతూ సంస్కృతీ, సంప్రదాయాలు చారిత్రక సంపదలని, వాటిని పరిరక్షించుకోవాల్సిన కర్తవ్యం ప్రతి ఒక్కరిపై ఉందని తెలిపారు. దసరా సాంస్కృతికోత్సవాల నిర్వహణ కమిటీ కన్వీనర్‌ కె.స్వరూపరాణి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎంబి విజ్ఞాన కేంద్రం నిర్వహణ కమిటీ కార్యదర్శి పి.మురళీకృష్ణ, సంగీత కళాశాల ప్రిన్సిపల్‌ విష్ణుభట్ల కృష్ణవేణి, ప్రముఖ ఆర్టిస్ట్‌ అమృపాలి పార్వతీ, సేఫ్‌ సెక్రటరీ పి.జ్యోత్స్న, జన శిక్షణ సంస్థాన్‌ డైరెక్టర్‌ ఎన్‌.విద్యా కన్నా, ప్రముఖ రచయిత్రి వేమూరి సత్యవతి, భారత మహిళా మండలి బాధ్యులు సూర్య కామేశ్వరి, సాహితీ సంస్థ నిర్వాహకులు కె ఉషారాణి, చిత్రకారిణి ఎ.సంధ్యారాణి, సుహప్తి నాయకులు భారతీదేవి, ఇన్నర్‌ వీల్‌ ప్రెసిడెంట్‌ హరితాదేవి, హైకోర్టు అడ్వకేట్‌ మాగంటి అనూరాధ, రిటైర్డ్‌ వ్యవసాయాధికారి ఝాన్సీలక్ష్మీ, ఎంబివికె శిక్షణా కేంద్రం మహిళా విభాగం బాధ్యులు పి.విజయ, ఆక్వాడెవిల్‌, ఉత్సవాల కమిటీ సభ్యులు విజయశ్రీ గుప్తా తదితరులు పాల్గొన్నారు.