ప్రజాశక్తి - రెడ్డిగూడెం (ఎన్‌టిఆర్‌జిల్లా) : బోయ, వాల్మీకి, బెంతు, ఒరియాలను ఎస్టీలలో చేర్చకూడదని రెడ్డిగూడెం తహశీల్దార్ కార్యాలయంలో గిరిజన సంఘం నాయకులు నిరసన తెలిపారు. అనంతరం తహశీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా గిరిజన సంఘం రాష్ట్ర కార్యదర్శి బి.గోపిరాజు మాట్లాడుతూ.. బోయ, వాల్మీకి, బెంతు, ఒరియాలను ఎస్టీలలో చేర్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నారు. ఈ కులాలను ఎస్టీలలో చేర్చెందుగాను రాష్ట్ర ప్రభుత్వం శ్యాముల్ ఏక సభ్య కమిషన్‌ని యమించిందని జీవో నెంబర్ 52ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 32 లక్షల గిరిజనులు నేటికీ నిరక్షరాస్యత, వెనుకబాటుతనం, నిరుద్యోగ సమస్య, అనారోగ్య సమస్యలతో ప్రతినిత్యం సతమత అవుతుంటే ఓట్ల రాజకీయం కోసం గిరిజనులను మోసం చేయడం సరి కాదని కేంద్ర ప్రభుత్వం 1965లో బిఎన్ లోకూర్ కమిటీ పేర్కొన్న ఏ 5 ప్రమాణాలు వీరికి లేవని ఎస్టీ జాబితాలో చేర్చవద్దని డిమాండ్ చేశారు. రాష్ట్ర గిరిజన నాయకుడు బి రమేష్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నియమించిన శ్యాముల్ ఆనంద్ కుమార్ ఏకసభ్య కమిషనర్ని రద్దు చేయాలని లేని పక్షంలో రాష్ట్రంలోని గిరిజన సంఘాల విద్యార్థి సంఘాలు, గిరిజన ఉద్యోగుల సంఘాలు అన్నిటిని ఏకతాటిపై తెచ్చి ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డి.రవి, అజ్మీర రాజు, బి.రాజా, బి.తావూరియా, బి.చిన్నబాల, బి.రంగా తదితరులు పాల్గొన్నారు.










