ప్రజాశక్తి - మంగళగిరి (గుంటూరు జిల్లా) : ఆహ్లాదకరమైన వాతావరణం కోసం రాష్ట్ర వ్యాప్తంగా పట్టణానికి సమీపంలో ఉన్న అటవీ ప్రాంతాలను నగర వనాలుగా తీర్చిదిద్దుతామని అటవీ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణ పరిధిలోని ఎయిమ్స్ సమీపంలో 50 ఎకరాల విస్తీర్ణంలో అటవీ శాఖ నిర్మించిన నూతన ఎకో పార్క్‌ను ఆయన బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించడానికి నగర వనాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఆరు నెలల్లో రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని టిడిపి నాయకులు చేస్తున్న వ్యాఖ్యలపై విలేకరుల ప్రశ్నించగా చంద్రబాబు నాయుడు కుప్పంలో గెలిచిన తర్వాత మాట్లాడతానని బదులిచ్చారు. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉంటూ అవినీతికి పాల్పడితే ఇలాగే జరుగుతుందని తెలిపారు. కక్ష సాధింపు చర్యలు ఏమీ లేవన్నారు. రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో 175 స్థానాలూ తామే గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణ రెడ్డి, ఆప్కో చైర్మన్ గంజి చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.










